తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్న అంగన్వాడీ వర్కర్లు
పరవాడ, ఫిబ్రవరి 25: ముత్యాలమ్మపాలెం- 1 అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ చింతకాయల ముత్యాల రాణిపై జరిగిన దాడిని నిరసిస్తూ సీటూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్జిల్లా ప్రధాన కార్యదర్శి నాగశేషు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో బీఎల్వోగా విధులు చేపట్టిన ముత్యాలరాణిపై ఈ నెల 22న వైసీపీకి చెందిన ఓ వర్గం వారు దాడి చేసి గాయపరచడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులందరిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ బీవీ రాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, అంగన్వాడీ యూనియన్ నాయకులు కె.రమణ, సీహెచ్ దేవి, వివి రవణమ్మ, పార్వతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.