Abn logo
Jun 2 2020 @ 04:09AM

అవతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

నిరాడంభరంగా నిర్వహణ

మహబూబ్‌నగర్‌లో జెండావిష్కరణ చేయనున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నారాయణపేటలో శాసనమండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు


మహబూబ్‌నగర్‌, జూన్‌1: కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం నిరాడంభరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా అమరులకు నివాళులు అర్పించి, ముఖ్య అతిథితో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పాలమూరులో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, నారాయణపేటలో మండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావులు జెండావిష్కరణ చేయనున్నారు. పాలమూరులో ఉదయం 8:15 గంటలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అమర వీరుల స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళ్లు అర్పించనున్నారు. 8:50 గంటలకు కలెక్టరేట్‌లో సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.


9 గంటలకు కలెక్టరేట్‌ ఆవరణలో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 9:10 గంటలకు అమరుల కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తారు. ఇదివరకు పరేడ్‌ మైదానంలో అవతరణ వేడుకలు నిర్వహించేవారు. ఉత్తమ అధికారులు, స్వచ్ఛంద సేవకులను అవార్డులతో సత్కరించుకునేవారు. ఈ ఏడాది అలాంటి కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు. వేడుకల నేపథ్యంలో అమరుల స్థూపం దగ్గర, కలెక్టరేట్‌ ఆవరణలో డాగ్‌స్క్వార్డ్‌తో పోలీసులు తనిఖీ చేశారు. 


పోలీస్‌ గౌరవ వందనం లేకపోవడంపై నేతి అసంతృప్తి: నారాయణపేటలో వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనమండలి వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావును ప్రభుత్వం నియమించింది. సోమవారం సాయంత్రం ఆయన 6 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిఽథి గృహం వద్దకు చేరుకున్నారు. నారాయణపేట, మహబూబ్‌నగర్‌ ఆర్డీఓలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడే ఉన్న టూటౌన్‌ సీఐ శ్రీనివాసచారి స్వాగతం పలికి, పరిచయం చేసుకున్నారు. అయితే పోలీస్‌ గౌరవ వందనం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం గౌరవ వందనం కూడా ఏర్పాటు చేయరా? మర్యాదలు ఇచ్చేది నేర్చుకుంటున్నారా? ఎక్కడ మీ ఎస్పీ అంటూ విసుక్కున్నారు.


Advertisement
Advertisement