Abn logo
Oct 24 2020 @ 05:39AM

కమిషనర్‌ ఆస్తులపై దర్యాప్తు

 ఎసీబీ కోర్టుకు మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ సురేందర్‌


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 23 : లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన మహబూబ్‌నగర్‌ పురపాలిక కమిషనర్‌ వడ్డె సురేందర్‌ ఆస్తులపై శుక్రవారం అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.65 లక్షలు లంచంగా తీసుకుంటూ గురువారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడంతో ఆయన ఆస్తులపై ఆరా తీస్తున్నారు. అతని కున్న స్థిర, చర  ఆస్తులపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది వరకు ఎక్కడెక్కడ పనిచేశారు? ఆయా ప్రాంతాల్లో ఏమైనా ఆస్తులున్నాయా? కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఉన్న ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. కాగా, కమిషనర్‌ను సాయంత్రం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దసరా పండగ తరువాత కమిషనర్‌ ఆస్తులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ తెలిపారు. కాగా, కమిషనర్‌ తన ఆస్తులకు సంబంధించి ఎక్కడా చిక్కకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని పేరిట ఉన్న ప్లాట్లలో కొన్ని, తన తండ్రి నుంచి గిఫ్ట్‌ డీడీ కింద వచ్చినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఆయన నివాసంలోనూ సోదాలు చేశారు.

Advertisement
Advertisement