Abn logo
Aug 11 2020 @ 23:36PM

వారసత్వంతో వచ్చినా... ప్రతిభే మాట్లాడుతుంది!

‘‘ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన నటీనటులకు తొలి అవకాశం రావడం కష్టమే. ఒకవేళ అవకాశం వస్తే... వచ్చిన తర్వాత సినిమా విజయం సాధించి, భవిష్యత్తుకు చక్కని బాట ఏర్పడాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి’’ అని శ్రద్ధా శ్రీనాథ్‌ అన్నారు. ‘జెర్సీ’తో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. కన్నడ, తమిళ చిత్రాలూ చేస్తున్నారు. విజయవంతమైన నాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారామె. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలో వారసత్వంతో నటీనటులుగా వచ్చినవాళ్ళు (ఇన్‌-సైడర్స్‌), ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చినవాళ్ళు (అవుట్‌-సైడర్స్‌)పై చర్చ జరుగుతోంది. దీనిపై శ్రద్ధా శ్రీనాథ్‌ స్పందిస్తూ ‘‘వారసులకు సులభంగా తొలి అవకాశాలు వస్తాయి. టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచీ వాళ్లపై దర్శక, నిర్మాతల దృష్టి పడుతుంది. వయసుకు వచ్చాక వాళ్లతో సినిమాలు చేయాలనుకుంటారు. వారసులకు సలహాలు ఇచ్చేవాళ్లుంటారు. ఏళ్లనుంచీ పరిశ్రమలో ఉండటం వలన పరిశ్రమపై అవగాహన ఉంటుంది. ఇంట్లో పెద్దల నుండి గైడెన్స్‌ లభిస్తాయి. అయితే, అంతిమంగా ప్రతిభే మాట్లాడుతుంది. వారసులైనా... ప్రతిభ ఉంటేనే పరిశ్రమలో మనుగడ సాగించగలరు. ప్రతిభ లేకపోయినా... వారసులకు మరికొన్ని అవకాశాలు వస్తాయేమో! అంతే!! ఇక్కడ ప్రతిభే ముఖ్యం’’ అని అన్నారు. హిందీలోనూ శ్రద్ధా శ్రీనాథ్‌ ఓ చిత్రం చేశారు. ‘మిలాన్‌ టాకీస్‌’లో నటించారు. ‘ఆ చిత్రం తర్వాత మీకు అవకాశాలు రాలేదా? మీరు హిందీలో నటించాలనుకోలేదా?’ అని అడగ్గా... ‘‘నేను ఆర్మీ కిడ్‌. దేశంలో వివిధ ప్రాంతాలలో పెరిగా. నా మాతృభాష కన్నడ కంటే హిందీ బాగా మాట్లాడగలను. ‘మిలాన్‌ టాకీస్‌’ తర్వాత నాకు హిందీ నుంచి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. కొన్ని వచ్చాయి గానీ... భయంకరమైనవి. వాటిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మంచి అవకాశం వస్తే హిందీలో నటించడానికి సిద్ధమే’’ అని శ్రద్ధా శ్రీనాథ్‌ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement