Abn logo
Sep 27 2020 @ 03:45AM

అమర పోలీసుల పేర కాలనీలు

Kaakateeya

అక్టోబరు 21 నుంచి 31 వరకు 

పోలీస్‌ ఫ్లాగ్‌-డే: డీజీపీ


హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల పేర్లతో కాలనీలు, వీధు లు ఏర్పాటు చేసేందుకు స్థా నిక అధికారులు చర్యలు తీ సుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. అక్టోబరు 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే అక్టోబరు 21 నుంచి 31 వరకు పోలీస్‌ ఫ్లాగ్‌ డే పేరుతో సంస్మరణ దినోత్సవాల్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏర్పాట్లపై డీజీపీ తన కార్యాలయంలో శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పౌరులను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.


పోలీసు అమరులపై హైదరాబాద్‌లో ఛాయాచిత్ర ప్రదర్శన, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, వివిధ స్థాయుల్లోని పోలీసు అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. సీనియర్‌ పోలీసు అధికారులు అమరుల ఇళ్లను సందర్శించి వారి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. 


పోలీస్‌ ఫ్లాగ్‌-డే ఫండ్‌ ఏర్పాటు

విధి నిర్వహణలో అమరులైన, వికలాంగులుగా మారిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పోలీస్‌ ఫ్లాగ్‌ డే ఫండ్‌’ ను ఏర్పాటు చేసిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. జాతీయ పోలీసు మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఫండ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలకు, వికలాంగులకు, పింఛనుదారులకు మరింత ఆర్థిక సహాయ సహకారాలు, భద్రత, పునరావాసం కల్పించడానికి ఈ ఫండ్‌ ఏర్పాటు చేశారని వివరించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నారని వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement