Abn logo
Oct 10 2020 @ 02:50AM

కొరడా!

Kaakateeya

ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ సీరియస్‌

సక్రమంగా పనిచేయని అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు 

ఇప్పటికే పలువురికి సస్పెన్షన్‌, షోకాజు నోటీసులు జారీ

పంచాయతీ కార్యదర్శులపై పెరుగుతున్న పని ఒత్తిడి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :

ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై వేటు తప్పడం లేదు. పనిచేయని అధికారులపై కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ కొరఢా ఝళిపిస్తున్నారు. పనుల లక్ష్య సాధనలో వెనుకబడుతున్న వారికి షోకాజు నోటీసులు జారీ చేస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తున్న వారిని సస్పెండ్‌ చేస్తున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో సక్రమంగా విధులు నిర్వర్తించని ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడు తున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం, నర్సరీలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను విధించింది. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. వైకుంఠధామాల నిర్మాణం, పల్లె ప్రకృతివనాల ఏర్పాటు, పారి శుధ్య కార్యక్రమాలను కొంతమంది సక్రమంగా నిర్వహించడం లేదు. దీంతో  గతనెల 23నుంచి ఇప్పటివరకు ఏడుగురు పంచా యతీ కార్యదర్శులు, నలుగురు సర్పంచ్‌లపై సస్పెన్షన్‌ వేటు పడింది.


అలాగే రైతు వేదికల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహిం చడంతోపాటు తప్పుడు సమాచారం ఇచ్చిన రాజేంద్రనగర్‌ పంచా యతీరాజ్‌ విభాగం డీఈఈ సంజీవరెడ్డి, ఏఈఈ శ్రీనివాసులుకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కందుకూరు మండల పంచాయతీ అధికారి విజయలక్ష్మిపై సస్పెన్షన్‌ వేటు పడింది. తాజాగా ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిం చడం, రోజువారీ లక్ష్యాలను సాధించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన యాచారం మండల పంచాయతీ అధికారి, అదే మండలం గుండాల్‌ పంచాయతీ కార్యదర్శితోపాటు మరో పంచాయతీ కార్యదర్శి, గన్‌గుల్‌ ఉపసర్పంచ్‌తోపాటు 12మంది సర్పంచ్‌లకు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో పనిచేయని ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన పంచా యతీ కార్యదర్శు లను పెండింగ్‌ ఎంక్వైరీలో ఉంచారు. ప్రస్తుతం వారిని విధుల్లోకి తీసు కున్నారు. సర్పంచ్‌లపై విధిం చిన సస్పెన్షన్‌ కొన సాగుతోంది. 


పెరుగుతున్న పని ఒత్తిడి

గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి పెరుగుతోంది. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి కార్యదర్శులను బాధ్యులను చేయడంతో ఆందోళన చెందుతు న్నారు. రోజువారీ విధులతో పాటు అదనపు పనులను నెత్తిన రుద్దడంతో టెన్షన్‌ పడు తున్నారు. ఇప్పటివరకు ఉపాధిహామీ పనులతోపాటు హరితహారం, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, కల్లాలు, తదితర పనులను పర్యవేక్షించిన పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ  బాధ్యతను అదనంగా అప్పజెప్పడంతో అసహనానికి గురవుతున్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. వారి వేతనం నెలకు రూ. 15వేలు.. చాలీచాలని వేతనంతో కాలం వెల్లదీస్తున్నారు. 


నిర్దేశించిన లక్ష్యం చేరుకోవాల్సిందే..శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి 

ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. ఇందుకు పంచాయతీ పాలకవర్గం కూడా భాగస్వామ్యం కావాలి. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, పంచాయతీకార్యదర్శి, మండల పంచాయతీ అధికారితోపాటు ఎవరు నిర్లక్ష్యంగా వ్యహరించినా ఉపేక్షించేది లేదు. పనుల ప్రగతి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. ఎవరు వెనుకబడి ఉన్నారో తెలిసిపోతుంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకోకుంటే.. ముందుగా షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. అయినా మార్పు కనిపించకుంటే.. సస్పెన్షన్‌ వేటు తప్పదు. గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు బాధ్యతగా వ్యవహరించాలి. గ్రామాభివృద్ధిలో చురుగ్గా పనిచేయాలి. ఎప్పటికప్పుడు గ్రామాభివృద్ధిని పరిశీలిస్తున్నాం. వెనుకబడిన గ్రామ పంచాయతీలను గుర్తించి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాము. 

Advertisement
Advertisement