Abn logo
Oct 11 2020 @ 05:45AM

ఇంటింటి ఆస్తుల సర్వే పక్కాగా ఉండాలి

Kaakateeya

సకాలంలో నూరుశాతం పూర్తిచేయాలి

కలెక్టర్‌ పౌసుమిబసు.. పరిగిలో పరిశీలన

జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోన్న సర్వే


పరిగి : ఇంటింటి ఆస్తుల సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. పరిగి మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డులో శనివవారం జరుగుతున్న సర్వేను  ఆమె పరిశీలించారు. సర్వే సిబ్బందికి కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. అనంతరం పరిగి మండలం రంగాపూర్‌లో జరుగుతున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయాచోట్ల కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటింటి సర్వే ఫార్మాట్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. ఇంటి యజమాని ఫొటో కూడా కచ్చితంగా ఉండాలన్నారు.  ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెండు,మూడు రోజుల్లో నూరుశాతం పూర్తికావాలన్నారు. తెలియని వారికి సర్వే సిబ్బందే అన్ని వివరాలు అడిగి నమోదు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వసంతకుమారి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి

దోమ: అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని డీఆర్‌డీవో పీడీ కృష్ణన్‌ అన్నారు. దోమ మండలం కిష్టాపూర్‌లో శనివారం ఇంటి సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇంటి నిర్మాణాలతో పాటు వ్యవసాయేతర భూములు కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, సర్పంచ్‌ సత్తెమ్మ, నర్సింహులు పాల్గొన్నారు.


ప్రజల ఆస్తులకు హక్కు

బంట్వారం : ప్రజల ఆస్తులకు హక్కు కల్పించేందుకే ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందని బంట్వారం సర్పంచ్‌ లావణ్యశ్రీనివాస్‌ అన్నారు. సర్వేలో ఆమె పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్‌కుమార్‌, ఎంపీవో విజయ్‌కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ షఫి, పంచాయతీ కార్యదర్శులు గోపాల్‌, ప్రవీణ్‌, లక్ష్మి, శేఖర్‌, ఆరిఫ్‌ ఉన్నారు. 


కాశీంపూర్‌ గ్రామస్థుల ఆందోళన

బషీరాబాద్‌ : ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయంలోనే కూర్చొని సర్వే వివరాలు నమోదు చేస్తున్నారంటూ బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌లో గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. ఈ విషయంపై స్థానిక పంచాయతీ కార్యాలయానికి వచ్చి కార్యదర్శి శ్రావణితో నరేందర్‌ మరికొందరు యువకులు వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న సర్పంచ్‌ సి.వెంకటయ్య కల్పించుకుని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్తేనే పక్కాగా వివరాలు నమోదు చేసే వీలుంటుందని, సర్వేలో తప్పిదాలకు తావులేకుండా చూడాలని కార్యదర్శికి సూచించారు.


తిర్మలాపూర్‌లో యువకుల సహకారం

కులకచర్ల: మండల పరిధిలోని తిర్మలాపూర్‌ గ్రామంలో చదువుకున్న యువకులు శనివారం అధికారులతో పాటు ఇంటింటికీ సర్వేకు సహకారం అందిస్తున్నారు. ప్రతి ఇంటి ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తమ సొంత సెల్‌ఫోన్‌ ద్వారా వివరాలు నమోదు చేస్తున్నారు. యువకులు సహకారం అభినందనీయమని సర్వే అధికారులు శ్రీనివాస్‌, రామస్వామి తెలిపారు. గ్రామ పరిధిలో 70 శాతం సర్వే నమోదు ప్రక్రియ పూర్తయిందని వారు సందర్భంగా తెలిపారు. 


సర్వేను గడువులోగా పూర్తిచేయాలి

మోమిన్‌పేట : గ్రామాల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని ఎంపీడీవో శైలజరెడ్డి అన్నారు. శనివారం ఎన్కతల, టేకులపల్లి గ్రామాల్లో పర్యటించి, సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా ప్రజల ఆస్తులకు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందన్నారు.   గ్రామస్థులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ అలివేలమ్మ, నవనీత, పంచాయతీ కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, వెంకటయ్య, శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీవో యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement