Abn logo
Oct 15 2021 @ 01:17AM

భూకుంభకోణంపై.. కలెక్టర్‌ సీరియస్‌

కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌

విచారణకు ఆదేశాల జారీ

ఎంక్వయిరీ ఆఫీసర్‌గా డిప్యూటీ కలెక్టర్‌ లలిత

తహసీల్దార్‌, వీఆర్‌వోలకు షోకాజ్‌ నోటీసుల జారీ

కంప్యూటర్‌ ఆపరేటర్‌ తొలగింపు


గుంటూరు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలోని తుళ్లూరు మండలం రాయపూడిలో నదీపాతం భూములను మెట్టగా భూస్వభావాన్ని మార్పు చేసి మేసేసిన ఉదంతంపై జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సీరియస్‌ అయ్యారు. గురువారం ఆయన రెవెన్యూ వర్గాలను ప్రాథమికంగా వివరాలు అడిగి తెలుసుకొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని నిర్ణయించారు. ఆ మేరకు డిప్యూటీ కలెక్టర్‌ లలితని విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలానే తుళ్లూరు తహసీల్దార్‌, రాయపూడి వీఆర్‌వోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఒకరిని విధుల నుంచి తొలగించారు. డిప్యూటీ కలెక్టర్‌ విచారణ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని గురువారం రాత్రి కలెక్టర్‌ ఆంధ్రజ్యోతికి ఫోన్‌ ద్వారా తెలిపారు. 

కృష్ణానది గర్భంలో ఉన్న భూముల క్రయవిక్రయాలపై గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో ఆయా సర్వే నెంబర్లను చేర్చకుండా చేసింది. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో అంతా ఎన్నికలు, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఆందోళనలో ఉన్న సమయంలో సర్వే నెంబర్లు: 15ఏ, బీ, 16ఏ, బీ, 17ఏలో ఉన్న కృష్ణానది భూమిని మెట్టగా మార్పు చేశారు. దీనిని వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లో చేర్చారు. ఏవైతే సర్వే నెంబర్లలో సుమారు ఆరు ఎకరాలకు పైగా భూమి స్వభావాన్ని మార్చారో అదే సర్వే నెంబర్లలోని కొంత భూమిని తహసీల్దార్‌ కుమారులు, కారుడ్రైవర్‌ పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ నేపథ్యంలో భారీ భూకుంభకోణం జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనూ మంగళగిరి మండలంలోని రాజధాని గ్రామాల్లో ఒక స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఇదే రీతిన భూకుంభకోణానికి పాల్పడగా అప్పట్లో ఆమెపై చర్యలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు నదీపాతం భూముల స్కాంలో ఎవరిపై చర్య తీసుకొంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. తహసీల్దార్‌ ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లిపోయారు.