Abn logo
Oct 23 2021 @ 00:33AM

ఆశించిన ఫలితాల్లేవ్‌

  నరసాపురం సబ్‌ డివిజన్‌ అభివృద్ధిపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

నరసాపురం రూరల్‌, అక్టోబరు 22 : ‘ఒకప్పుడు నరసాపురం సబ్‌ డివిజన్‌కు రాష్ట్రంలోనే మంచి పేరు ఉండేది. ఇక్కడ పని చేసిన ఎందరో అఽధికారులు రాష్ట్ర స్థాయిలో పేరు ప్రతిష్టలు సాధించారు. అలాంటి సబ్‌ డివిజన్‌ నేడు వెనుకబడింది. వనరులు సమృద్ధిగా ఉన్నా ఏలూరు, కొవ్వూరు, కుక్కునూరు డివిజన్లతో పోలిస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఇప్పటి నుంచైనా అధికారులు దృష్టి సారించి అన్ని రంగాల్లో డివిజన్‌ను ప్రథమంగా నిలపాలి. విధి నిర్వహణలో అధికారులకు నిర్లక్ష్యం తగదు’ అని  కలెక్టర్‌ కార్తికేయమిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో వివిధ శాఖల అఽధికారులతో డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన ఆర్యోగం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రం జిల్లాకు నాలుగు ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. వీటిని మొగల్తూరు మండలం కాళీపట్నం, పోడూరు మండలం గుమ్మలూరు, కాళ్ల మండలం కలవపూడి, పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామాల్లో నిర్మించాలని నిర్ణయించామన్నారు. వీటికి అవసరమైన స్థల సేకరణను వెంటనే చేపట్టాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించిన అంశాలకు తక్షణం కౌంటర్‌ ఫైల్స్‌ దాఖలు చేయాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం, వైద్య పరీక్షల్లో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో జేసీలు అంబేడ్కర్‌, హిమాన్షు శుక్లా, పద్మావతి, సబ్‌ కలెక్టర్‌ విష్టుచరణ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.