Abn logo
Feb 26 2021 @ 00:19AM

వ్యర్థాలపై ప్రణాళిక రూపొందించాలి

గుంటూరు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వ్యర్థాల నిర్వహణపై పటిష్ఠ ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మునిసిపల్‌ కమిషనర్లని ఆదేశించారు. క్లీన్‌ ఆంధ్ర వంద రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఆయన అధికారులతో మాట్లాడారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో డోర్‌ టూ డోర్‌ వ్యర్థాల సేకరణ 100 శాతం జరగాలన్నారు. గృహాల్లో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తతో హోం కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నారు.  రహదారులపై ఉన్న గుంతలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్వచ్ఛంధ సంస్థలు, మెప్మా సిబ్బందిని భాగస్వామ్యం చేయాలన్నారు. క్లీన్‌ ఆంధ్ర 100 రోజుల కార్యక్రమం పురోగతిని తెలుసుకునేందుకు 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. టిడ్కో గృహాల కోసం అర్హత లేని వారు చెల్లించిన లబ్ధిదారు వాటాను మునిసిపల్‌ ఎన్నికల ముందుగానే, అర్హత ఉండి లబ్ధిదారుల వాటా కంటే అదనంగా నగదు చెల్లించిన వారికి ఎన్నికల తర్వాత నగదును వాపసు చేయాలన్నారు.  కార్యక్రమంలో టిడ్కో ఎస్‌ఈ కోటేశ్వరరావు, పబ్లిక్‌హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు, జేసీ పీ ప్రశాంతి, మునిసిపల్‌ ఆర్‌డీ శ్రీనివాసరావు, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement