మాట్లాడుతున్న కలెక్టర్ నివాస్
కలెక్టర్ నివాస్ ఆదేశం
కలెక్టరేట్, డిసెంబరు 1: ఉద్దానం తాగునీటి ప్రాజెక్ట్ పనులు వేగవంతం కావాలని కలెక్టర్ నివాస్ ఆదేశించారు. మంగళవారం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రూ.700 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉద్దానం ప్రజలకు శుద్ధ జలాలు అందుతాయన్నారు. వారి దశాబ్దాల ఎదురుచూపులు ఫలించనున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ పైపులైన్లు వేసినప్పుడు ఆర్అండ్బీ, హైవే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. హిరమండలం రిజర్వాయర్ వద్ద ఇన్‌టెక్ వెల్ నిర్మించి... అక్కడి నుంచి పైపులైన్ ద్వారా వజ్రపుకొత్తూరు మండలంలో 121 గ్రామాలు, పలాసలో 86 గ్రామాలు, మందసలో 225 గ్రామాలు, సోంపేటలో 74 గ్రామాలు, కవిటిలో 118 గ్రామాలు, కంచిలి మండలంలో 138 గ్రామాలు, ఇచ్ఛాపురం మండలంలో 45 గ్రామాలకు తాగునీరు అందించనున్నట్టు చెప్పారు. మొత్తం 807 గ్రామాలకు శుద్ధ జలాలు అందిస్తామన్నారు. 2,051 వరకూ ప్రజా అవసరాలకు సరిపడే విధంగా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. ప్రాజెక్ట్‌కు ఏడాదికి 1.12 టీఎంసీల నీరు అవసరమని గుర్తించామన్నారు. సమావేశంలో జేసీ సుమిత్ కుమార్, డివిజనల్ అటవీ శాఖ అధికారి సందీప్ కృపాకర్, డీఆర్వో బి.దయానిధి తదితరులు పాల్గొన్నారు.