Abn logo
Sep 24 2020 @ 01:22AM

వైద్య ఆరోగ్య శాఖలో కోల్డ్‌ వార్‌

Kaakateeya

తనను బెదిరిస్తున్నారంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టిన డీఎంహెచ్‌వో

డిప్యూటీ డీఎంహెచ్‌వోతో సహా మరో ఇద్దరిపై కేసులు నమోదు

విచారణ జరుపుతున్న పోలీసులు

బదిలీల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు

జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వివాదం


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కోల్డ్‌ వార్‌ మొదలైంది. జిల్లా వైద్యాధికారి కుమరం బాలు, ఉప వైద్యాధికారి సుధాకర్‌ నాయక్‌ల మధ్య అంతర్గత విభేదాలు ముదిరి పాకానపడినట్లు ఆ శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌-19 విజృంభిస్తున్న సమయంలో జిల్లా వైద్యశాఖలో మొదలైన ఈ రచ్చ కారణంగా శాఖ పరువు బజారున పడుతోందని వైద్య సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. జిల్లాలో కుమరంబాలు డీఎంహెచ్‌వోగా బాధ్యతల చేపట్టిన తర్వాత ఫార్మసిస్టులకు, వైద్యులకు ఆయనతో సరిపడడం లేదనే చర్చ నడుస్తోంది. అయితే విధుల నిర్వహ ణలో కఠినంగా వ్యవహరిస్తూ కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా సహచర సిబ్బందితో పనులు చేయిస్తున్నారన్న అక్కసుతోనే శాఖలోని కొంతమంది వ్యక్తులు కావాలని విభేదాలు సృష్టిస్తున్నారని డీఎంహెచ్‌వో వాదన. ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్లో ఒకరు ఆరు నెలలుగా తప్పుడు ప్రచారంతో డీఎంహెచ్‌వోను ఇబ్బందులు పెడుతూ వస్తున్నారని,  తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారని కొంతమంది సిబ్బంది చర్చించుకుంటున్నారు.


ముఖ్యంగా వైద్యుల బదిలీలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో పెద్దఎత్తున డబ్బులు మారాయంటూ సమాచారం హక్కు చట్టం పేరు చెప్పి దరఖాస్తులు దాఖలు చేయడం, దీన్ని బూచిగా చూపించి డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తున్నారని డీఎంహెచ్‌వో చెబుతున్నారు. ఈ వ్యవహారంతో విసిగి వేసారిన కుమరం బాలు ఈనెల 1న ఆదిలాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సంబంధిత నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆసిఫాబాద్‌ పోలీసులను ఆదేశించింది. డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌, బెల్లంపల్లికి చెందిన జనతాదల్‌ సెక్యూలర్‌ నాయకుడు సుదర్శన్‌, సిర్పూర్‌(టి) ఫార్మాసిస్టుగా పనిచేసి సస్పెండ్‌కు గురైన బషీర్‌ఖాన్‌లపై డీఎంహెచ్‌వో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 


అసలేం జరిగింది

తనను ముగ్గురు వ్యక్తులు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని డీఎంహెచ్‌వో కుమరం బాలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టును ఆశ్రయించడం వెనుక వైద్య ఆరోగ్య శాఖలో కొనసాగుతున్న ఆధిపత్య పోరాటానికి నిదర్శనంగా నిలుస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. కుమరం బాలు, జిల్లా ఉప వైద్యాధికారి సుఽధాకర్‌ నాయక్‌ మధ్య కొంతకాలంగా వైరం కొనసాగుతోంది. సిర్పూ రు(టి)లో ఫార్మాసిస్టుగా విధులు నిర్వహిస్తున్న బషీర్‌ అహ్మద్‌ఖాన్‌ తనకు అప్పగించిన కొవిడ్‌-19 విధులను సరిగ్గా నిర్వహించలేదన్న ఉద్దేశంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఈ ఇద్దరితో పాటు సమాచార హక్కు చట్టం పేరుతో జనతాదళ్‌ పార్టీకి చెందిన నాయకుడి సహాయంతో తనను ఇబ్బంది పెట్టేందుకు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారనేది కుమరం బాలు వాదన. 


వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో లక్షల్లో చేతులు మారాయని, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయటంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలతో సమాచార హక్కు చట్టం ద్వారా పిటిషన్లు వేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని జిల్లా  వైద్యా ధికారి కుమరం బాలు చెబుతున్నారు.  నిబంధనల ప్రకారం వైద్యుల బదిలీలు, ఉమ్మడి జిల్లా కేంద్రంలో పనిచేసే డీఎంహెచ్‌వో నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నందున బదిలీల అధికారం ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వోకే ఉంటుందని కుమరం బాలు పేర్కొంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం అమలు చేస్తున్న పోలియో వ్యాక్సినేషన్‌తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాల ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే నిధులను కలెక్టర్‌, డీఎం హెచ్‌వోలకు సంయుక్త డ్రాయింగ్‌ పవర్‌ ఇచ్చారని అంటున్నారు. కలెక్టర్‌ అనుమతి లేకుండా తాను ఎలా నిధుల డ్రా చేస్తానని కుమరం బాలు అంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి పైసా ఏజెన్సీల వారీగా విభజించి నేరుగా వారి ఆన్‌లైన్‌ ఖాతాలకు జమచేస్తామని, దీనిలో నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని డీఎంహెచ్‌వో చెబుతున్నారు.  


డబ్బులు గుంజేందుకే బ్లాక్‌ మెయిల్‌..డీఎంహెచ్‌ఓ కుమరం బాలు

వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఇద్దరితో పాటు డిపార్టుమెంటుకు ఎలాంటి సంబంధం లేని రాజకీయ నాయకుడు నాపై లేని పోని ఆరోపణలు చేస్తూ నావద్ద డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతకాలంగా వ్యూహాత్మకంగా బ్లాక్‌మెయిలింగ్‌  పాల్పడుతున్నా చూసీ చూడనట్టు వదిలేశా. అయినా పద్ధతి మార్చుకోకుండా పదే పదే ఆరోపణలు చేస్తూ నా పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, బషీర్‌ అహ్మద్‌ ఖాన్‌, బెల్లంపల్లికి చెందిన సుదర్శన్‌ తదితరులపై ఈ నెల 1న ఆదిలాబాద్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించి అట్రాసిటి కేసుగా ఫిర్యాదు చేశా. సుధాకర్‌ నాయక్‌ నా పరువుకు భంగం కలిగించినందుకు అతడిపై పరువునష్టం దావా కూడా వేశా.

Advertisement
Advertisement
Advertisement