Abn logo
Sep 30 2020 @ 05:22AM

ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష

6న అపెక్స్‌ కమిటీ సమావేశం 

అజెండాలో గుండ్రేవులకు స్థానం..?


కర్నూలు(అగ్రికల్చర్‌); సెప్టెంబరు 29: అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన నివాసరంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ జిల్లా అధికారులు హాజరు అవుతున్నారు. ఏపీ, తెలంగాణ జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అక్టోబరు 6న సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.


ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ నీటి పారుదల శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. గుండ్రేవుల రిజర్వాయర్‌పై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 2.65 లక్షల ఎకరాల కేసీ ఆయకట్టుకు నీరందించేకు ఈ రిజర్వాయరు నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. కేసీ ఆయకట్టుకు కేటాయించిన 29 టీఎంసీల నీటిలో 20 టీఎంసీలను గుండ్రేవులలో నిల్వ చేసుకునేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీని గురించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అపెక్స్‌ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సీఎం జగన్‌కు పూర్తి వివరాలు సమర్పించనున్నారని తెలిసింది. దీంతోపాటు నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలకు జిల్లా పరిధిలో 33 పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ.59.16 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సత్వరమే నిధులను విడుదల చేస్తేనే పనులు చేపట్టి పుష్కరాలకి ఘాట్లను సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రికి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు విన్నవించే అవకాశం ఉంది 

Advertisement
Advertisement
Advertisement