Abn logo
Oct 24 2020 @ 11:57AM

కేసీఆర్ టాస్క్.. ఆ ఇద్దరికీ అగ్ని పరీక్షే..!

Kaakateeya

ఆ నాయకుడికి ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే గెలుపు ఖాయమని టాక్‌.. ఇప్పటివరకు అప్పగించిన ఎన్నికల్లో ఊహించని విజయాన్ని సాధించిపెట్టారు. ఆయన రంగంలోకి దిగితే పార్టీకి విజయం నల్లేరు మీద నడకే అన్న పేరు ఉంది. ఇక మరో నాయకుడు తనకు అప్పగించిన మొదటి ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీ సాధించారు. ఇప్పుడు ఆ అగ్రనేతలిద్దరు వేర్వేరుగా మరో ఎన్నికల సవాల్‌ను ఎదుర్కోబోతున్నారు? పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నా వారిద్దరికే అధినేత కీలకమైన ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారు? ఇంతకీ వారి ట్రాక్‌ రికార్డ్‌ ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.


ఒకరు క్లాస్... మరొకరు మాస్...

గులాబీ పార్టీలో ఇద్దరు అగ్రనేతలకు పార్టీ అధినేత కేసీఆర్ సమాన బాధ్యతలు అప్పగిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎంత క్లిష్టమైన టాస్క్ ఇచ్చినా.. పోటాపోటీగా ఇద్దరు సత్తా చాటుతున్నారు. ఒకరు క్లాస్ అయితే, మరొకరు మాస్ పంథాతో జనం దగ్గరికి వెళ్తున్నారు. వారే ఒకరు మంత్రి కేటీఆర్, మరొకరు హరీష్ రావు. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికల బాధ్యతలు హరీష్ రావుకు.. జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించారు. ఆ సమయంలో ఇద్దరికీ ఆ రెండు టాస్క్‌లు అత్యంత కఠినమైనవి. ఇప్పుడు కూడా ఇద్దరూ అలాంటి సవాళ్లే ఎదుర్కోబోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక హరీష్ రావుకు, జీహెచ్ఎంసీ ఎన్నికలు మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. అయితే గతంలో కన్నా ఇద్దరికీ ఇచ్చిన టాస్క్‌ ఛాలెంజ్‌గా మారాయి. 


ట్రబుల్ షూటర్ ఎంట్రీతో సీన్ మారింది...

ముందుగా మంత్రి హరీష్ రావు విషయానికి వద్దాం.. నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ కంచుకోటకు బీటలు వారేలా చేశారు. ఉప ఎన్నికల ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న ఆయనకు.. ఏ బాధ్యత అప్పగించినా అవలీలగా పూర్తి చేస్తారన్న పేరు తెచ్చుకున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించాక ఈ నియోజకవర్గంలో కనీస ఓట్లను రాబట్టుకోలేకపోయింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఆకస్మిక మరణంతో 2016లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌ ఎంట్రీతో సీన్‌ మారిపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎం భూపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే ప్రజాప్రతినిధులు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్‌ ఇచ్చి ఏకగ్రీవం చేయాలన్న ఆనవాయితీ అప్పటి వరకూ ఉండేది. కానీ అలాంటి సంప్రదాయానికి కేసీఆర్ చరమగీతం పాడారు. కాంగ్రెస్ కంచుకోటలో హరీష్ రావు గులాబీ జెండా రెపరెపలాడేలా చేశారు.


లక్ష్యాన్ని పూర్తి చేసి...

2014లో జీహెచ్ంఎసీ ఎన్నికల బాధ్యతలు తనయుడు కేటీఆర్‌కు సీఎం కేసీఆర్‌ అప్పగించారు. అప్పటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీకి కత్తిమీద సాములా మారాయి. ఆ సమయంలో ఆంధ్రా తెలంగాణ అన్న బేధాభిప్రాయాలు వెల్లువెత్తాయి. పరిశ్రమల తరలింపు అన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇతర ప్రాంతాల వారి జీవన విధానానికి ఇబ్బంది తలెత్తుతుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అలాంటి క్లిష్ట సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న కేటీఆర్‌.. వంద సీట్లు టార్గెట్‌గా రంగంలోకి దిగారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగిస్తూ గ్రేటర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. మొత్తానికి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేశారు.

సేమ్ సీన్ రిపీట్...

నాలుగేళ్ల తర్వాత ఇద్దరీకీ మళ్లీ అలాంటి సవాళ్లే పునరావృతం కాబోతున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరుగనుంది. రామలింగారెడ్డి కుటుంబంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే హరీష్ రావు దుబ్బాక బై పోల్ గ్రౌండ్‌లో దిగి గట్టిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అక్కడక్కడా ప్రతిపక్షాలు కూడా ఆయనకు బౌన్సర్లు విసురుతున్నారు. వాటికి కూడా తనదైన పంచ్‌ డైలాగులతో కౌంటర్‌ ఇస్తున్నారు. ఇటీవల హరీష్ విసిరిన సవాల్ బిజేపీని ఇరకాటంలో పడేసింది. కరీంనగర్‌కు చెందిన ఓ కార్పొరేటర్ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లకు 1600 వందల రూపాయలు కేంద్రమే ఇస్తుందన్నారు. దాంతో హరీష్‌రావు.. బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. ఇది నిజమని నిరూపిస్తే తన పదవులకు రాజీనామా చేస్తానన్నారు. కానీ ఈ సవాల్‌పై బిజేపీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో గులాబీ నాయకులు మరింత జోష్ పెంచారు. ఇప్పటికే టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్న హరీష్... రెండు, మూడు స్థానాల కోసం కాంగ్రెస్, బిజేపీలు కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన లక్ష ఓట్ల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.


ఎలా రిసీవ్ చేసుకుంటారో...

మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యత తీసుకున్న కేటీఆర్‌కు పెను పరీక్ష ఎదురైంది. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి. పదుల సంఖ్యలో నగర వాసులు మృత్యువాతపడ్డారు. వరద బాధితులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ఇచ్చిన పలు హామీలు ఇంకా ప్రభుత్వం నెరవేర్చలేదు. స్కైవేలు, ఆకాశ హర్మ్యాలు, ఫ్లైఓవర్లు, ఫుట్ పాత్‌లు, రోడ్ల విస్తరణ లాంటి అనేక హామీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు ఎల్‌ఆర్ఎస్‌పై నగర జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి. భారీ వర్షాలతో నగరానికి జరిగిన నష్టానికి ప్రభుత్వమే కారణమని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జీహెచ్ంఎసీ ఎన్నికలను కేటీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. వరద బాధితుల కోసం పరిహారంతో పాటు 550 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. నిత్యావసరాలను వారికి సరఫరా చేస్తోంది. ఇలాంటి ప్యాకేజీలు నగర వాసులను సంతృప్తి పరుస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా బావ బావమరిదికి అప్పగించిన పరీక్షల్లో ఎవరు ఎన్ని మార్కులు సాధిస్తారో చూడాలి.

Advertisement
Advertisement