Abn logo
Apr 22 2021 @ 05:08AM

ప్రజలు అల్లాడుతుంటే జగన్‌రెడ్డి చోద్యం చూస్తున్నారు: కేఎస్‌ జవహర్‌

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చోద్యం చూస్తున్నారు. కేసుల రోజువారీ సంఖ్య 10 వేలకు చేరువ అవుతున్నా దానికి తగిన స్థాయిలో ప్రభుత్వంలో స్పందన లేదు. ప్రజలు ఎవరి చావు వారు చస్తారన్నట్లుగా వదిలేసి కూర్చున్నారు’’ అని టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని పరీక్షల సంఖ్యను పెంచాల్సిందిపోయి ఎక్కువ పరీక్షలు చేయవద్దని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ ఉధృతిని ఎలా అరికట్టాలో ఒక ప్రణాళిక రూపొందించకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని వ్యాఖ్యానించారు. సిఫార్సు ఉంటే తప్ప రాష్ట్రంలో టీకాలు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. మొదటి డోస్‌ వేయించుకొన్న వారికి రెండో డోస్‌ దొరుకుతుందో లేదో తెలియడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌ క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చి క్షేత్ర స్థాయిలో అధ్వాన్నంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి ప్రజలకు అండగా నిలవాలన్నారు. లేని పక్షంలో ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని జవహర్‌ హెచ్చరించారు. 

Advertisement
Advertisement
Advertisement