అమరావతి: ఏపీ-అముల్ ప్రాజెక్టును సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఏపీ అముల్- వెబ్ సైట్, డాష్ బోర్డును కూడా ఆయన ఆవిష్కరించారు. ఏపీ అముల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9,899 పాల సేకరణ కేంద్రాలు, ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
అముల్‌తో ఒప్పందం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని పాడి రైతులకు ఎక్కువ ధర వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. లీటర్‌కు 5 నుంచి 7 రూపాయల మేర అధిక ఆదాయం వస్తుందని అన్నారు. మార్కెట్లో పోటి తత్వం వస్తేనే అందరికీ మంచిదని, అముల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను తదుపరి బోనస్‌గా రైతులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. సహకార రంగంలో ఏర్పాటైన అముల్ సంస్థ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోందని అన్నారు. అముల్ రావటంతో ఏపీలో పాలసహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చని వ్యాఖ్యానించారు. దశలవారీగా 6,551కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు.