Abn logo
Oct 12 2021 @ 00:52AM

తిరుపతిలో సీఎం

సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఏజే శేఖర్‌

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం


తిరుపతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. సీఎం అయ్యాక జగన్‌ తిరుపతి వచ్చిన ప్రతి సందర్భంలోనూ విమానాశ్రయం నుంచీ నేరుగా వాహనంలో నిర్ణీత ప్రదేశానికి చేరుకునేవారు. మార్గమధ్యంలో ఎక్కడా ఆగడం గానీ, నాయకులను, కార్యకర్తలను కలవడం గానీ చేయలేదు.అయితే సోమవారం విమానాశ్రయం నుంచీ వెలుపలికి వచ్చాక తన కోసం వేచి చూస్తున్న వైసీపీ నాయకులను, కార్యకర్తలను కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు పుష్పగుచ్ఛాలు అందుకుంటూ పలువురిని పేర్లు పెట్టి పలకరించారు. ముఖ్యమంత్రిలో కనిపించిన ఈ మార్పు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.అనంతరం తిరుపతి చేరుకున్న జగన్‌ బర్డ్‌ ఆస్పత్రి ప్రాంగణంలో రూ. 25 కోట్లతో టీటీడీ తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేసిన పద్మావతీ చిన్నపిల్లల గుండెజబ్బుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలో వివిధ విభాగాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆపై అలిపిరి చేరుకుని అక్కడ రిలయన్స్‌ సంస్థ రూ. 25 కోట్లతో నడక దారిపై నూతనంగా నిర్మించిన పైకప్పును ప్రారంభించారు. అక్కడే టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, చెన్నై సమాచార కేంద్ర సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ సహకారంతో రూ. 15 కోట్లతో నిర్మించిన గో మందిరం, గో తులాభార మండపాలను కూడా సీఎం ప్రారంభించారు. గోపూజ నిర్వహించి, మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గోశాలలోని పుంగనూరు, ఒంగోలు, సాహివాత, కాంగేయ, హల్లికేత, కాంక్రేజ్‌ జాతి గోవులను జగన్‌ గమనించారు. గోమందిరం ప్రాముఖ్యత, ప్రాధాన్యత విశేషాలను డిజిటల్‌ స్ర్కీన్‌ ద్వారా వీక్షించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


విమానాశ్రయంలో రోజా, కేజేలను కలిపిన జగన్‌

నగరి నియోజకవర్గంలో ఉప్పూ నిప్పుగా వుంటున్న వైసీపీ వర్గాల నడుమ సయోధ్య కుదిర్చేందుకు సీఎం జగన్‌ ప్రయత్నించారు. విమానాశ్రయం రన్‌ వేపై నుంచీ సీఎం వెలుపలికి వచ్చాక పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిశారు. ఆ సందర్భంగా నగరి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కేజే కుమార్‌ సీఎంకు శాలువా కప్పారు. ఆ సందర్భంగా కేజే కుమార్‌ చేయి పట్టుకున్న సీఎం తన వెనుక వస్తున్న రోజా చేతిని కలిపించారు. వారిద్దరితో ఏమీ మాట్లాడకపోయినా ఆ చర్య ద్వారా నగరి నియోజకవర్గంలో ఇరువర్గాలూ కలసికట్టుగా పార్టీ కోసం పనిచేయండని సూచించినట్టుగా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌  అటు తిరగగానే వారిద్దరూ ఎవరి పాటికి వారు చెరోవైపు వెళ్ళిపోవడం కనిపించింది.కాగా గతంతో పోలిస్తే సీఎం జగన్‌ సోమవారం తిరుపతిలో జరిపిన పర్యటన పట్ల ప్రజల్లో గానీ, ఇటు పార్టీ వర్గాల్లో గానీ పెద్దగా ఆసక్తి కనిపించలేదు. విమానాశ్రయం వెలుపల వైసీపీ నాయకులు, కార్యకర్తల సంఖ్య 200 మించలేదు. వారికంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. కార్యకర్తలు తక్కువమందే వున్నా హడావిడి, హంగామా మాత్రం ఎక్కువగానే కన్పించింది.

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ప్రారంభోత్సవంలో జగన్‌తో టీటీడీ ఛైర్మన్‌, మంత్రులు తదితరులు