Abn logo
Jan 18 2021 @ 02:13AM

2024 మే దాకా నిరసన సాగిస్తాం

రైతు నేతల స్పష్టీకరణ.. మొండి పట్టుదల వీడండి: కేంద్రం


న్యూఢిల్లీ, జనవరి 17: సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున రైతులు ఇకనైనా మొండి పట్టుదల వీడి సమగ్ర చర్చలకు ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. పదో రౌండ్‌ చర్చలు సోమవారంనాడు జరగనున్న తరుణంలో వ్యవసాయమంత్రి నరేంద్ర తోమర్‌ ఈ విజ్ఞప్తి చేశారు.


విపక్షం బలహీనం: రైతు నేతలు

‘తోమర్‌ చేసిన విజ్ఞప్తిలో కొత్త విషయమేమీ లేదు. ప్రభుత్వ తీరు ఇదే అయితే రేపటి చర్చల్లో కూడా ఫలితం రాదు. మేం 2024 దాకా అంటే తదుపరి సార్వత్రిక ఎన్నికల దాకా కూడా ఈ నిరసన హోరు కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ ప్రకటించారు. విపక్షం బలహీనంగా ఉండడం వల్లే రైతులు ఆందోళన చేయాల్సి వస్తోందని మండిపడ్డారు.


లక్ష ట్రాక్టర్లతో 26న ర్యాలీ

ఈ గణతంత్ర దినోత్సవాన ట్రాక్టర్‌ ర్యాలీలో ఎలాంటి మార్పూ లేదని, వేలాది ట్రాక్టర్లు ఢిల్లీలోకి ప్రవేశిస్తాయని స్వరాజ్‌ అభియాన్‌ కన్వీనర్‌ యోగేంద్ర యాదవ్‌ ప్రకటించారు. ఢిల్లీ ఔటర్‌ రింగు రోడ్డులో 50 కిలోమీటర్ల దూరం  ఈ ర్యాలీ సాగుతుందన్నారు. గణతంత్ర దిన పరేడ్‌కు ఎలాంటి విఘ్నాలూ కలిగించకుండా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే)కి అనుకూలంగా ఉన్నారన్న అభియోగంపై 40 మంది రైతు నేతలు, పంజాబీ కళాకారులు, హక్కుల కార్యకర్తలకు ఎన్‌ఐఏ నోటీసులు పంపింది. వీరిలో కొందరిని ఆదివారం ప్రశ్నించింది. ఈ సమన్లపై రైతు ప్రతినిధులు మండిపడ్డారు. ‘ఇది మమ్మల్ని హింసించడమే. చర్చలను పక్కదారి పట్టించడానికి, ఆందోళనను దెబ్బతీయడానికి కేంద్రం చేస్తున్న కుట్ర. ఇది మా సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందే తప్ప నీరుగార్చదు’ అని వారు అన్నారు.


తెలంగాణ ప్రజాసంఘాల సంఘీభావం

మోదీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునేదాకా దేశవ్యాప్తగా రైతన్నల పోరాటం కొనసాగుతుందని తెలంగాణ రైతు, విధ్యార్థి, సిఐటీయూ, వ్యసాయ,  కార్మిక యువజన సంఘాలు హెచ్చరించాయి.  నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి దాదాపు రెండొందల మంది కార్యకర్తలు ఢిల్లీ సరిహద్దు సింఘూ వద్దకు చేరుకుని  రైతుల ఆందోళనకు తమ సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రైతుసంఘం నేతలు మదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి వీరిలో ఉన్నారు. ఈ పోరు  దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని, ఉధృతం కాకముందే సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని జూలకంటి డిమాండ్‌ చేశారు. ఉద్యమానికి ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు మద్దతివ్వడం హర్షణీయమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిజాయితీగా ఉద్యమానికి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎ్‌సయుటిఎఫ్‌) రూ. 3లక్షలు ఆర్థిక సహాయం అందించింది.

Advertisement
Advertisement
Advertisement