Abn logo
May 25 2020 @ 04:29AM

చితాక్షరి

ఇప్పుడిక అందరూ వైరస్‌ గురించే

చెప్పాలనుకుంటున్నారు

నేను మాత్రం

కొన్ని మిగుల్చుకున్న పదాల గురించే 

మాట్లాడాలనుకుంటున్నాను

జీవితాన్ని ప్రేమించడమే ఏ వైరస్‌కయినా

    వాక్సీన్‌ అనీ.

దుఃఖాన్ని జీవించడమే కాలంతో నెరిపే 

        యుద్ధమనీ తెలిసొచ్చిందిపుడు

పచ్చాకు రసమే కవిత్వ పలారమై మిగిలింది

నుదిటి రాత... కలిసొచ్చినంతనే... కరిగిపోతుంది

ఆకలి నా పుట్టినూరు

వలస నా అన్నం మెతుకు

కూటిగింజలు నా పనిముట్లు

ఎపుడూ వొక మూల మలుపే... నా ఇలాక

అవునే... చిన్నీ... మనమెపుడూ

మూల మలుపుల దగ్గర్నే ముచ్చట్లెందుకు పెట్టుకుంటం?

వీడ్కోలును చెప్పుకునే ముందు

కొవ్వొత్తులను కొంచెం దగ్గరగా జరుపుకుందాం

లోపలి మరకలను కొంత సరిచేసుకుందాం

కనపడనిదాని గురించే ఎక్కువగా అబద్ధాలెందుకు అల్లుకుంటం?


వొద్దు... చిన్నా... ఇక వొద్దు

మనం కనపడే / ప్రవహించే

శవాగారాల ఉప్పెనల మీదనే ముచ్చట్లు ఏరుకుందాం

ఈ జీవ నలుపుది అంత తొందరగా 

కూలిపోయే కాంతి కాదు.

అలసిపోయే నిప్పులెగజిమ్మే

చీకటీ గాదు...

ఈ జీవచిత్ర రసార్ద్రతంతా

కారుణ్యమంతా... ఆగ్రహమంతా... గడ్డకడుతూన్న కొద్దీ

నేనే నన్ను నేనుగా తయారుచేసుకుంటున్నాను

అందరూ ఇప్పుడు 

వొక వైరస్‌ గురించే చెప్పాలనుకుంటున్నారు

నేను 

దాని పుట్టుకకు ముందూ

దాని చావు తర్వాత గురించీ

చెప్పాలనుకుంటున్నాను

కారణం

ఆ మహాపద్మపాణికి తెల్సు

కవిత్వ కాలయవనుడికి తెల్సు

వొడవదిది

ఆగదిది...

సర సర మంటూ

చిక్కకుండా ఎగుర్తూనే 

వుంటదిది

బతుకిది పోరుబంధమిది

పోరగాల్లెప్పటికీ

జింగన్న పురుగుల్ని అగిపెట్టెలల్ల

దాస్తూనే ఉంటరు

పసితనమెపుడూ

అమ్మచీరకొంగు ఉయ్యాలల్ల... వూగుతనే వుంటది

పూలూ గాలీ సంధ్యాస్మృతులూ

వాటి నెత్తుర్ల తడి సవ్వడీ

దరువేస్తూనే వుంటది.

పాత కలెగూరలెపుడూ

పాత పంటలెపుడూ కాలం జెయ్యవు

పాత తొవ్వపూల వాసనలు

వాగు చెరువుల మన్ను బలమింకిపోదు.

చావు నన్ను కాగిలించుకొని తిన్నా

దాని కడుపును చీల్చుకొని బయటికి రానా

ఇరానీ ఛాయ్‌ని సప్పరించకుండ వుంటనా

కొనసాగనా... విప్పుకోనా వాననై

మబ్బుకొసల చందమామ రేకునై

ఆమె చెవికమ్మల రవ్వపుల్లనై

జాలువారనా...

వొడవదిది

ఆగదిది... భూతనమిది

తెల్సుకున్నదే.. మరోగా తెల్సుకుంటూ

అంత్య సమాంతర అనాది లోకాలను 

అక్కడెక్కడ్నో దాగుడుమూతల సృష్టికర్తలనూ

స్వరపరుస్తూ పోనా...

కాదు... చిన్నీ... ఇది తొందరగా

వొడిశిపోయే ముచ్చటా గాదు

ఇగ పైసదెంత అల్పపుతనమో

తెల్సొచ్చింది

దాని బలం... కావురం

ఎంత చాతగానిదో ఎంత ఎచ్చులతనమో

తెల్సొచ్చింది

పేగులు అల్లలాడిపోతున్నయ్‌

సోయి జాగ తప్పింది

లక్షల పాదాలు ఇంటితొవ్వలు పడ్తున్నయ్‌

నరం కోసం నాల్కె తెగుతూంది

ముంత కోసం... మత్తు కోసం

మనకు మనమే పెట్టుకున్నం శాపెనల్ని

కయ్యాల రామక్కలాగ

కుదార్తంగ దీవించే పోశక్కలాగ

ఏం గాదు పో..

నొష్ఠిన ఏం రాసుంటే 

       అంతనే అయితది పో...

పెద్ద దర్వాజ తలుపు ఎపుడూ

తెరిచే వుంటది...

పూలు వనాలను 

       కాస్తూనే వుంటయ్‌

మా యమ్మ

మల్లా మల్లా పుడ్తనే వుంటది

నన్ను కంటనే వుంటది...

ఆత్మ గల్ల మా యవ్వ

తన చనుబాల రుచిని మరిగించి మరిగించీ

తాపిస్తనే వుంటది...

       ఇప్పుడిక ఊపిరితో తొడగొట్టి

       శుభ్రం చేస్తున్నోడే.. నా సుట్టపోడు

       నన్ను బతికిస్తున్నోడే... నా మందీ బలగం

ఇగ ఈ... పెన్నిద్ర

కాలిరిగి మూలకు కూచుంటుంది

మన మన్యాదికే పక్షవాతమొస్తది

చిన్నీ...

ఏదీ ఆగదు

కాలమే నేనయినపుడు

లేనికాలమంతా... నేనే... నే

ఆది జాంబవా...

ఎవరూ... తెర వెనుక కారు

సారె తిప్పుతనే వుంటరు

పుట్ట మన్ను తొక్కుతనే వుంటరు

కూరాడు వెడ్తనే వుంటరు

ఆవమ్‌లు కాలుస్తనే వుంటరు

తాళ్ళవనాల పొంటి... నీరా కుండల్ని

దింపుతనే వుంటరు...

బట్టలల్ల సోడలేసి

దేహాలను ఉడిగించి ఉతికించి

కొత్త నీరెండలకు ఆరవెడ్తనే వుంటరు

ఎహే...

అందరూ... కూలిపోయే గూళ్ళ గురించే

చెబ్తరెందుకే... చిన్నీ

నేను రెక్కలుగల పక్షి గురించే

నా జేబులల్ల నూకలు దాచుకుంటాను

జీవరాసులు వాటి భాషను దాచుకున్నట్టు

బాధను దాచుకున్నట్టు

సిద్ధార్థ

73306 21563


Advertisement
Advertisement
Advertisement