Aug 3 2021 @ 16:51PM

Ganesh Master: పవన్‌కల్యాణ్‌ దగ్గర నేర్చుకున్నదే చేస్తున్నా

గణేశ్‌ మాస్టర్‌ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని. ఆయన నటించిన ఎన్నో చిత్రాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. అంతే కాదు ‘జానీ’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ, కొరియోగ్రాఫర్‌గానూ పని చేశారు. తాజాగా ఓ డాన్స్‌ షోకు జడ్జ్‌గా వెళ్లిన ఆయన కష్టాల్లో ఉన్న కంటెస్టెంట్‌కు ఆసరాగా నిలిచారు. రూ.4 లక్షలు సాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అసలు విషయానికొస్తే.. ఓ టీవీ నిర్వహించే డాన్స్‌ షోలో సాయి అనే కంటెస్టెంట్‌ తన టీమ్‌తో కలిసి ఓ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. దీనికి ఫిదా అయిన జడ్జ్‌లు అభినందించడంతోపాటు వారి కష్టాలను తెలుసుకున్నారు. కంటెస్టెంట్స్‌లో ఒకరైన సోమేష్‌ వారి కష్టాలను బయటపెట్టారు. ‘‘సాయికి తండ్రి లేరు. తన తల్లి రూ.1500 జీతంతో ఇల్లు గడవాలి. అప్పుల బాధలు తట్టుకోలేక ఇంట్లో దాక్కొని ఇంట్లో లేరని చెప్పే పరిస్థితి. సాయికి ఉన్నంతలో తన గ్రూప్‌లో పని చేసే అందరికీ కడుపు నిండా పెట్టి బాగా చూసుకుంటాడు’’ అని చెప్పగానే గణేశ్‌ మాస్టర్‌ వెంటనే స్పందించి తనకున్న అప్పు ఎంతో తెలుసుకుని రూ. 4 లక్షలు షో అయ్యాక తన దగ్గర తీసుకెళ్లమని చెప్పారు.

దీనిపై గణేష్‌ మాట్లాడుతూ ‘‘కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం పవన్‌కల్యాణ్‌గారి దగ్గర నేర్చుకున్నా. చాలాకాలంగా నేను ఆయనతో ట్రావెల్‌ అవుతున్నా. ‘జానీ’ సమయంలో ఆయన పక్కనే ఉండి మంచి విషయాలు తెలుసుకున్నా. ఓ మనిషి కష్టంలో ఉంటే ‘ఎలా స్పందించాలి.. ఏ సమయంలో సాయం చేయాలి’ అన్న విషయాలను ఆయన నుంచే తెలుసుకున్నా. ఇవన్నీ ఆయన చెబితే నేర్చుకున్నది కాదు. కేవలం చూసి నేర్చుకున్నా. నేను చేసిన సాయం నా గొప్ప కాదు. నా గురువు పవన్‌కల్యాణ్‌ది. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నానో అదే చేశా. ఈ డబ్బు నాకూ అవసరమే కానీ ఈ సమయంలో నాకన్నా సాయికి చాలా అవసరం. అందుకే ఇచ్చేశా’’ అని తెలిపారు. యాంకర్‌ రష్మి కూడా వెంటనే స్పందించి సాయికి లక్ష రూపాయిలు సాయం అందించారు.