Abn logo
Oct 24 2020 @ 16:52PM

నా ఆడపడుచులకు ‘బతుకమ్మ’ పండుగ శుభాకాంక్షలు: చిరు

Kaakateeya

తెలంగాణలో ఆశ్వయుజ మాసం.. ఆశ్వయుజ పాడ్యమి నుంచి బతుకమ్మ, దసరా కళ వచ్చేస్తుంది. ఉత్తరాదిలో శరన్నవరాత్రులు, అమ్మవారికి అలంకారాలు ప్రసిద్ధి అయితే, తెలంగాణలో శరన్నవరాత్రులతో పాటు.. బతుకమ్మ వేడుకలు కూడా జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో పూల పండుగ పరవశంలో ముంచెత్తుతుంది. ప్రకృతిని, పూలను ఆరాధించే అత్యంత అరుదైన బతుకమ్మ పండుగ తెలంగాణలో కన్నులనిండుగా జరుగుతుంది. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను ఆరాధిస్తారు. సామాన్యులు మొదలుకొని, ప్రముఖుల దాకా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అందరూ పదం, పాదం కలిపి బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గ్రామాల్లో కూడళ్లు, నగరాల్లో పార్కులు, ప్రముఖ ప్రదేశాలు పూల శోభను సంతరించుకుంటాయి. ఆడపడుచులు తెచ్చే బతుకమ్మలతో ఆ ప్రాంతాలన్నీ పుష్పాభిషేకాన్ని తలపిస్తాయి. తెలంగాణ సంస్కృతికి ఇదో ప్రతీక. తెలంగాణ ప్రజలు ఎంతో విశిష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి.. రాష్ట్ర మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

''బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు.. ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని  కోరుకొంటున్నాను.." అని మెగాస్టార్‌ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement