Abn logo
Jul 12 2021 @ 16:08PM

China: దలైలామా జన్మదిన వేడుకలను వ్యతిరేకిస్తూ చైనా సైనికుల బ్యానర్లు

లడఖ్: టిబెటన్ల మతగురువు దలైలామాపై తమకున్న ఉక్రోషాన్ని చైనీయులు మరోమారు బయటపెట్టారు. లడఖ్‌లో కొందరు గ్రామస్థులు దలైలామా జన్మదిన్నాన్ని ఘనంగా జరుపుకుంటుండగా, దెమ్చక్ ప్రాంతంలోని సింధు నదికి ఆవల చైనా సైనికులు, కొందరు పౌరులు బ్యానర్లు, చైనా జెండాలు చూపిస్తూ వ్యతిరేకించే ప్రయత్నం చేశారు.ఈ నెల 6న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. 


కొందరు పౌరులతో కలిసి ఐదు వాహనాల్లో ఆ దెమ్చక్ ప్రాంతానికి వచ్చిన చైనా సైనికులు దలైలామా జన్మదిన వేడుకలు జరుగుతున్న గ్రామంలోని కమ్యూనిటీ సెంటర్ సమీపానికి వచ్చి బ్యానర్లు చూపిస్తూ కనిపించారు. దలైలామా 86వ జన్మదినాన్ని పురస్కరించుకుని గతవారం భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. 2014లో మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దలైలామాతో నేరుగా మాట్లాడడం ఇదే తొలిసారి. దలైలామాకు ఫోన్ చేసి విషెస్ చెప్పినట్టు మోదీ మంగళవారం ఉదయం ట్విట్టర్ ద్వారా తెలిపారు.