Abn logo
Jul 15 2021 @ 00:49AM

దారి మారిన చైనా, ధగధగల చైనా!

బరిమీద వదిలిన పాముని, చైనా వాడిని నమ్మవద్దన్నాడు కవి తిలకుడు. నమ్మలేని వాటి జాబితాలో ‘‘బోగందాని’’ పాటని, చౌ ఎన్ లై మాటని, సినీతార వయస్సుని, మావోత్సేటుంగ్ మనస్సుని కూడా ఆయన కసిగా చేర్చేశారు. అరవయ్యేళ్ల కిందటి యుద్ధ సందర్భం అది. జాతీయత ఉప్పొంగిపోవడానికి ఒక విదేశశత్రువు కనిపించి, దేశభక్తిని ప్రదర్శించుకోవడానికి ఒక కవితావస్తువు సాక్షాత్కరించి కవులంతా ఆవేశపడిపోయిన సమయం అది. విప్లవం సాధించుకున్న కొత్తలో చైనా నాయకులు, భారత్‌తో సఖ్యంగా ఉండడానికి ప్రయత్నించడమే కాక, సౌహార్దానికి ప్రాతిపదికలుగా పంచశీలను కూడా ప్రతిపాదించారు. కారణాలేమయితేనేమి, సరిహద్దు వివాదానికి అపనమ్మకాలు కూడా తోడయి దురదృష్టకరమయిన యుద్ధం జరిగింది. చైనా విప్లవాన్ని ప్రేమించిన భారత కమ్యూనిస్టులకు అప్పుడు పెద్ద సంకటం వచ్చిపడింది. స్టాలిన్ మరణం తరువాత సోవియట్ యూనియన్‌లో మార్పులు మొదలై, రష్యా -చైనా మధ్య దూరానికి కారణమవుతున్న రోజులు అవి. రష్యామార్గమే సరిఅయినది అనుకుని కమ్యూనిస్టుల్లో ఒక శ్రేణి భావించి, చైనా యుద్ధం సమయంలో గట్టి దేశభక్తిని ప్రదర్శించగలిగింది. మరో శ్రేణి, చైనా తరహా విప్లవ మార్గాన్ని సమర్థించడంతో పాటు, సరిహద్దు వివాదంలో కూడా విదేశానిదే న్యాయం అనడంతో, జైళ్లకు వెళ్లవలసి వచ్చింది. ఆ కాలంలోనే మన డిటెక్టివ్ నవలల్లోనూ, సినిమాల్లోనూ, చివరకు జానపద చిత్రాలలో కూడా చైనా ప్రతినాయకులు అవతరించారు. 1962 నాటి యుద్ధంలో భారత్ వెనుకంజ వేయవలసి వచ్చిందన్నది తెలిసిందే. ఆ తరువాత కాలంలో సత్సంబంధాల కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా, పాత వైరం అడ్డు పడుతూనే ఉన్నది. 


చైనాతో ఉన్న అప్రియ సంబంధం ప్రత్యేకత ఏమిటంటే, ఆ నాడు అప్పటి యుద్ధఘట్టం కలిగించిన జాతీయావేశాలు, వేడి తగ్గిపోయి తరువాతి దశాబ్దాలలో గోరువెచ్చగా మారిపోయాయి. పాకిస్థాన్‌తో ఉన్న వైరం కలిగించినంత ఉద్రేకం, చైనాతో పొరపొచ్చాలు కలిగించలేదు. పాకిస్థాన్ శ్రేయోభిలాషులు, ఏజెంట్లు భారతదేశంలోనే ఉన్నారన్న ఆరోపణలు ఇంటా బయటా ఒకేరకమయిన జాతీయ ఆవేశాలను కలిగించగలిగాయి. చైనాకు కూడా భారత్‌లో తొత్తులున్నారన్న విమర్శలు ఉన్నాయి కానీ, అభిప్రాయాల ఆధారంగా గుర్తించగలిగే శత్రువు కన్నా, పుట్టుక ద్వారా గుర్తించే శత్రువు జాతీయవాదానికి అనువుగా ఉంటాడు కదా!


చైనా కమ్యూనిస్టు పార్టీ తన వందేళ్ల పండుగను ఈ నెల మొదట్లో జరుపుకుంది. చైనాలో పార్టీ, ప్రభుత్వం అంతా అద్వైతం కాబట్టి ఆ సభలను ప్రపంచమంతా బాగా పట్టించుకుంది. అభినవ మావో అని, జీవితకాలం నాయకుడని సంబోధనలందుకుంటున్న జిన్ పింగ్ ఏమి చెబుతాడా ఆసక్తిగా అంతా ఎదురుచూశారు. పత్రికలు, ప్రసారసాధనాలు చైనా చరిత్రను, దాని మంచి చెడ్డలను తమదైన పద్ధతుల్లో విస్తృతంగా చాటి చెప్పాయి. ఈ సభలు మొదలుకావడానికి ముందు కొన్ని వారాలుగా భారత్‌‌ -చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రగిలాయి. మే మాసంలో సాయుధ ఘర్షణలు కూడా జరిగి ఉండవచ్చునని ఆలస్యంగా అందుతున్న వార్తలు చెబుతున్నాయి. పోయిన ఏడాది గల్వాన్  ఘర్షణలో చనిపోయిన సైనికుడికి చైనా సంతాపకార్యక్రమం నిర్వహించింది. అక్కడక్కడా చైనా పత్రికల్లో భారత్‌ను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు, చెణుకులు కనిపించసాగాయి. 


నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్ల కాలంలో, భారత్‌ -చైనా సంబంధాలలో చాలా మార్పు వచ్చింది. మంచుకొండల్లో బాహాబాహీ జరిగేదాకా పరిస్థితి వెళ్లింది. చైనా వస్తువుల దిగుమతులపైనా, చైనా మొబైల్ అప్లికేషన్ల పైనా భారత్ ఆంక్షలు పెట్టింది. వాస్తవమైన వాణిజ్యంలో పెద్దగా తేడా ఏమీ లేదు కానీ, సంకేతాత్మకంగా చైనా వ్యతిరేకత అధికారికంగా వ్యక్తమయింది. ప్రభుత్వంలో కంటే, సమాజంలో ఆ వ్యతిరేకత ప్రస్ఫుటంగాను, తీవ్రంగానూ కనిపించింది. అందుకు ప్రత్యేకమయిన దేశీయమైన కారణాలు కూడా ఉన్నాయి. 2014 కంటె ముందు అంతా దేశంలో కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ తరహా పాలనే సాగిందని, దాన్ని మొత్తంగా తాము మార్చివేస్తామని బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సంకల్పం చెప్పుకుంది. ఇప్పటి దాకా జరిగిన అన్ని లోపాలకు, వైఫల్యాలకు నెహ్రూ విధానాలే కారణమని, నెహ్రూకు కమ్యూనిస్టులు మద్దతుగా ఉన్నారని, కాంగీలు- కమ్మీలు కలిసి విజాతీయమైన, దేశద్రోహకరమైన విధానాలను వ్యాప్తి చేశారని ఒక ప్రచారం ముమ్మరంగా జరుగుతూ వచ్చింది. మనదేశానికి చేటుగా పరిణమించిన చైనాకు కమ్యూనిస్టులు సమర్థకులని, అందువల్ల వారు దేశభక్తులు కాదని కూడా ఈ వాదం చెబుతుంది. ఇసుమంత హేతువాదం మాట్లాడినా, బూటకపు జాతీయవాదాన్ని విమర్శించినా వారిని కమ్మీలు అని, చైనా భక్తులని విమర్శించడం ఇప్పుడు ఆనవాయితీ. సమస్య ఏమిటంటే, చైనాకు ఇప్పుడంత దృశ్యం లేదు. 


మన దేశంలో కమ్యూనిస్టులకు చైనా కమ్యూనిస్టు పార్టీకి ఏమైనా సంబంధాలున్నాయా? సిద్ధాంతాల సంగతి తరువాత కానీ, దాదాపు పాతికేళ్లుగా చైనా కమ్యూనిస్టు పార్టీ ఏ దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం పెట్టుకోవడం కానీ, ఆయా దేశాలలో కమ్యూనిస్టు భావాలను వ్యాపింపజేయడానికి సహాయం చేయడం కానీ లేదు. ఆ పార్టీకి ఇప్పుడు అటువంటి కార్యక్రమం ఏమీ లేదు. తన ఉత్పత్తులకు మార్కెట్‌ను, తన పెట్టుబడులను దేశదేశాలలో విస్తరించడం ద్వారా ప్రాబల్యం పెంచుకోవాలనుకుంటున్నది తప్ప, సిద్ధాంత రాద్ధాంతాల గొడవ ఏదీ దానికి లేదు. జాతీయోద్యమ కాలం నాటి కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటి కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా లేశమంతైనా పోలిక ఉండవచ్చును కానీ, 1921లో ఏర్పడిన చైనా కమ్యూనిస్టు పార్టీకి, ఇప్పటి చైనా అధికారపార్టీకి ఏ సామ్యమూ లేదు. పార్టీ పేరు కొనసాగి, సిద్ధాంతాలు మాత్రం తారుమారు కావడం కాంగ్రెస్ విషయంలో అయినా, కమ్యూనిస్టుల విషయంలో అయినా ఒకటే. మావో అనంతరం, 1980 దశకం తొలినాళ్లలోనే చైనా గమనంలో మార్పును గుర్తించి ప్రపంచాన్ని హెచ్చరించినవారున్నారు. అయితే, చైనా ధగధగలను, మిరుమిట్లను చూసి, అదంతా సోషలిజం మహిమే అని భ్రమించేవారు పార్లమెంటరీ కమ్యూనిస్టులలోనే కాదు, విప్లవ కమ్యూనిస్టులలో కూడా ఇప్పటికీ కనిపిస్తారు. చైనీయ తరహా సోషలిజం అంటూ డెంగ్ సియావో పింగ్ హయాం నుంచి ఆ దేశ నాయకులు వల్లిస్తున్న నినాదాన్నే మన సీతారాం ఏచూరి నిజమని విశ్వసిస్తున్నారు. ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, 1980 తరువాత చైనాలో సోషలిస్టు విధానాలే లేవని అంటుంటే, ఆయన అభిమానించే మార్క్సిస్టు పార్టీ మాత్రం చైనాలో సామ్యవాదాన్ని చూడగలుగుతోంది. 


శతాబ్ద చరిత్రలో పేదరికాన్ని రూపుమాపామని చైనా కమ్యూనిస్టు పార్టీ గొప్పగా చెప్పుకుంది. అదొక పచ్చిబూటకం. ఇంకో 28 సంవత్సరాల తరువాత వచ్చే విప్లవ శతాబ్ది ఉత్సవాలనాటికి దేశాన్ని అన్నివిధాల ఆధునికమయిన సోషలిస్టు సమాజంగా మార్చాలన్న లక్ష్యాన్ని కూడా చెప్పుకుంది. విప్లవం తరువాత తొలి మూడు దశాబ్దాల కాలంలో ఏర్పరచుకున్న పార్టీ, ప్రభుత్వ నిర్మాణాలను పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి ప్రతిభావంతంగా ఉపయోగించుకున్న ఘనత డెంగ్ నుంచి జిన్ పింగ్ దాకా దక్కుతుంది. రాజకీయ, సామాజిక వ్యవస్థలలో కట్టడి విధానాలను, ఆర్థికరంగంలో నియంత్రిత స్వేచ్ఛను అమలు చేస్తూ, దేశంలో అపరిమితంగా లభ్యమయ్యే చవక మానవశ్రమనే వనరుగా ఉపయోగించి, సాంకేతికరంగంలో వచ్చిన మార్పులు అందించిన అవకాశాలను ఉపయోగించుకుంటూ చైనా ఈ నాటి ‘అభివృద్ధి’ని సాధించింది. అది ఎంతటి గొప్పది అయినా, అసమానమైనదే. తీవ్రమైన శ్రమదోపిడి ఆధారంగా నిర్మితమయినదే. చైనాకు ఈ రోజు ప్రేరణగా ఉన్నది మార్క్సిజమో, సోషలిజమో కాదు. జాతీయవాదం మాత్రమే. వందేళ్ల సభల్లో దేశాధ్యక్షుడు ప్రపంచమంతా సమానత్వం రావాలని కాంక్షించలేదు. చైనాకు ఏమి కావాలో చెప్పారు. చైనా జోలికి వస్తే ఇనుము లాంటి చైనా గోడకు వేసి శత్రువుల తలలను ప్రజలు బాదుతారని హెచ్చరించారు. సోషలిస్టు రష్యాకైనా, చైనాకైనా అంతర్జాతీయ దృష్టి మాటలవరకే, జాతీయవాదాన్నే వారు అధికంగా ఆశ్రయించారు. 


అయితే, జిన్ పింగ్ హెచ్చరించిన శత్రువు భారత్ కాదు. ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించేంత స్థాయి భారత్‌కు లేదు కాబోలు. ఆయన గురి అమెరికా మీద. అమెరికా తరువాత అత్యధిక సైనికవ్యయం చేసేది చైనాయే. చైనాతో తనకున్నది సైద్ధాంతిక విభేదమే అన్నట్టుగా అమెరికా అభినయిస్తుంది. చైనా నిరంకుశ దేశమే. మానవ హక్కులు లేవు. రాజకీయ స్వేచ్ఛ లేదు. ఆధిపత్య, నిర్బంధ వ్యవస్థలు అధిక అభివృద్ధిని సాధిస్తాయని చైనా నిరూపించింది కాబట్టి, తమ దేశాలలో కూడా నియంతృత్వమే మంచిదని ఎన్ని దేశాలు అనుకోవడం లేదు? ప్రజాస్వామ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పే అమెరికా, ఎన్నో నియంతృత్వ దేశాలను సమర్థిస్తోంది. సరిహద్దు వివాదం కారణంగా, భారత్‌కు శత్రువు అన్నది నిజమే కానీ, రాజకీయ స్వేచ్ఛల విషయంలో చైనాకు మనకూ ఏమంత పెద్ద వ్యత్యాసమున్నదని?


ఒకనాడు అమెరికా చైనాలోని కమ్యూనిస్టు నిబద్ధతను చూసి భయపడింది. బహుశా నెహ్రూకు కూడా అది భయమే కలిగించి ఉంటుంది. చైనాను గురిపెట్టే అణుపరికరాలను హిమాలయాలలో సిఐఏ చేర్చగలగడానికి భారత్ తోడ్పాటు కూడా ఉన్నదని అంటారు. ఇప్పుడు అమెరికా భయపడుతున్నది చైనా విప్లవ స్వభావాన్ని చూసి కాదు, మార్కెట్లలో, రక్షణ వ్యవస్థలలో, అంతర్జాతీయ రాజకీయరంగంలో చైనా ప్రాబల్యం పెరుగుతోందని. భారత్ చైనా సమస్యలు చిన్నవి. సరిహద్దు సమస్యలు వలసకాలపు అవశేషాలు. అరవయ్యేళ్ల కిందటికీ ఇప్పటికీ భారత్‌ -చైనాల మధ్య సైనిక సామర్థ్యపు అంతరం పెరిగిందే తప్ప తగ్గలేదు. అంతేకాదు, అనేక రంగాల కీలక ఉత్పత్తుల విషయంలో చూస్తూ ఉండగానే మనం ఆ దేశపు దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. భారత్ తన శత్రుత్వలక్ష్యాన్ని పాకిస్థాన్ నుంచి చైనాకు మళ్లిస్తున్నందువల్ల కనీవినీ ఎరుగనంతగా యుద్ధసాధనాలను కొనుగోలు చేయవలసి వస్తున్నది. చైనాకు నిస్సందేహంగా విస్తరణ కాంక్ష ఉన్నది. అది భౌగోళికమే కానక్కరలేదు. అది పోటీపడుతున్నది అమెరికాతో. హద్దుమీరితే భారత్ చైనాను ఎదిరించవలసిందే కానీ, మరొకరి తరఫున చైనాతో తగాదా పడనక్కరలేదు.

కె. శ్రీనివాస్