Abn logo
Sep 27 2021 @ 21:27PM

భారతీయులపై చైనా వీసా ఆంక్షలు.. సమర్థించుకున్న డ్రాగన్ దేశం

న్యూఢిల్లీ: భారతీయులపై తాము విధించిన వీసా ఆంక్షలను చైనా ప్రభుత్వం తాజాగా సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తాము ప్రత్యేకంగా భారత్‌నే లక్ష్యంగా చేసుకోలేదని, తమ దేశ పౌరుల విషయంలోనూ ఇవే అమలవుతున్నాయని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రయాణాలపై ఆంక్షలు అవసరమని కూడా పేర్కొంది. చైనా నిబంధనల కారణంగా అనేక మంది భారతీయులు చైనాకు తిరిగి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనాలో విద్యను అభ్యసిస్తున్న 23 వేల మంది భారతీయులు, ఇతర వ్యాపారవేత్తలూ చైనా ప్రభుత్వ ఆంక్షల కారణంగా అక్కడికి తిరిగి వెళ్లలేకపోతున్నారు. భారత్‌లో చిక్కుకుపోయిన కొందరు చైనీయులు కూడా స్వదేశానికి తిరిగెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. 

అయితే.. కరోనా పేరు చెప్పి ఇలా సుదీర్ఘకాలం పాటు ఈ ఆంక్షలను కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఆంక్షలపై చైనాలోని భారత రాయబారీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానం అశాస్త్రీయమని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు తాజాగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన చైనా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.   

ఇవి కూడా చదవండిImage Caption