Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 26 2021 @ 16:14PM

మళ్లీ చికెన్‌ ధరలకు రెక్కలు- కిలో రూ.280 కి చేరిక

హైదరాబాద్‌: తెలంగాణలో చికెన్‌ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నాన్‌వెజ్‌ ప్రియులు ఎక్కువ ఇష్టపడే చికెన్‌ ధరలు ఇటీవల కాలంలో కొంత నిలకడగానే కొనసాగాయి. రెండు వారాల క్రితం చికెన్‌ కిలో ధర 230 రూపాయల వద్ద కొనసాగింది. తర్వాత వారం రోజులుగా పెరుగుతూ వస్తోంది. ఆదివారం నాటికి రిటైల్‌ మార్కెట్‌లో కిలో 280 రూపాయలుకు చేరింది. ప్రత్యేకించి హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా చికెన్‌ వినియోగం జరుగుతుంది. సాధారణ రోజుల్లోనే 2లక్షల కేజీల చికెన్‌ వినియోగం అవుతోంది. కానీ పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అయితే 3లక్షల కేజీలకు మించి వినియోగం అవుతుందని వ్యాపారులు తెలిపారు. 


ప్రస్తుతం పితృపక్ష దినాలు కావడం వల్ల కూడా నాన్‌వెజ్‌ అమ్మకాలు బాగా పెరిగాయి. చాలా మంది చనిపోయిన వారికి బియ్యం ఇవ్వడం అన్నది ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున తప్పని సరిగా నాన్‌వెజ్‌ ప్రియులు మాంసాన్నే వినియోగిస్తారు. మాంసం ధరలు ఇప్పటికే కిలో 800 రూపాయలకు చేరడంతో అధిక శాతం మంది చికెన్‌ వైపు మొగ్గుచూపిస్తున్నార. దీంతో ప్రస్తుతం చికెన్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా కోళ్లు అందుబాటులో ఉండడం లేదని అందుకే ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్‌ చికెన్‌ వ్యాపారి మహ్మద్‌ రఫీయుల్లా తెలిపారు. 


గత వారం రోజులతో పోలిస్తే ఇప్పుడు చికెన్‌ అమ్మకాలురెట్టింపు అయినట్టు తెలిపారు. దీనికి కారణం పితృమాస దినాలు కావడమేనని అన్నారు. దీనికితోడు హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్స్‌తో పాటు రోడ్‌సైడ్‌ వ్యాపారులు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలోనూ భారీగా చికెన్‌ వినియోగం అవుతోంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చికెన్‌లో 70శాతం హైదరాబాద్‌ నగరంలోనే వినియోగం అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. పితృమాస దినాలు చివరి రోజైన అక్టోబరు 6వ తేదీ వరకూ చికెన్‌ ధరలు పెరిగే అవకాశం వుందని రాంనగర్‌లోని చికెన్‌ వ్యాపారి వెంకట్‌ రెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement