Advertisement
Advertisement
Abn logo
Advertisement

Gujarat నుంచి గుంటూరు వచ్చి చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్..

  • గుంటుపల్లిలో చెడ్డీ గ్యాంగ్‌
  • శివార్లలో కలకలం
  • నల్లూరి ఎన్‌క్లేవ్‌లోచోరుల హల్‌చల్‌
  • అపార్ట్‌మెంట్‌వాసులు అప్రమత్తం కావడంతో పరార్‌


గుంటూరు/గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం), డిసెంబరు 2 : గుంటుపల్లి శివారులో బుధవారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న నల్లూరు ఎన్‌క్లేవ్‌లో అర్ధరాత్రి 01.45 గంటల సమయంలో ప్రవేశించిన ఈ గ్యాంగ్‌ మూడో ఫ్లోర్‌లోని ఎన్‌-3 ఫ్లాట్‌ తలుపులు పగలగొట్టి చోరీకి ప్రయత్నించింది. పెద్ద శబ్దం రావటంతో ఫ్లాట్‌ యజమాని లైట్లు వేసి పెద్దగా అరవటంతో పరార్‌ అయ్యారు. పోలీసులు క్లూస్‌ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. ఎన్‌క్లేవ్‌లో ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించి, వాటి ఆధారంగా చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులను గుర్తించే పనిలో పోలీసులున్నారు. ఏసీపీ హనుమంతరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి, గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌-3 ఫ్లాట్‌లో నివసిస్తున్న గొట్టుముక్కల రవి శరణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


నల్లూరు ఎన్‌క్లేవ్‌లో గోడకు ఉన్న ఫెన్సింగ్‌ను కట్‌ చేసి, ఐదుగురు సభ్యులు బనియన్లు, తలకు పాగాలు చుట్టుకుని, ఇనుప రాడ్లు, కర్రలు పట్టుకుని మెట్ల మార్గం ద్వారా పైకి వెళుతున్నట్టు సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయింది. ఆ గ్యాంగ్‌ నేరుగా బీటెక్‌ విద్యార్థి గొట్టుముక్కల రవిశరణ్‌ నివాసముంటున్న ఫ్లాట్‌కు వెళ్లి, తలుపులు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. రవిశరణ్‌ పెద్దగా కేకలు వేయటంతో, అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ అప్రమత్తమై కింద ఉన్న లైట్లన్నీ వేశాడు. దీంతో గాంగ్‌ సభ్యులు పరారయ్యారు. అపార్ట్‌మెంట్‌వాసులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం విజయవాడలో చోరీ జరిగిన నేపథ్యంలో స్థానిక సీఐ శ్రీధర్‌ స్టేషన్‌ పరిధిలోని శివారు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌వాసులను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. ప్రతి అపార్ట్‌మెంట్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అపరిచిత వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


చెడ్డీ గ్యాంగేనా..!?

గుంటుపల్లిలో చోరీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగే అనే ప్రచారాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. ఆ గ్యాంగ్‌ చోరీకి యత్నించిన ప్రాంతంలో క్లూస్‌ టీం ఆధారాలు సేకరించారని చెబుతున్నారు. వాస్తవానికి చెడ్డీ గ్యాంగ్‌ రంగంలోకి దిగితే కచ్చితంగా పని పూర్తి చేసుకుని వెళ్తుంది. ఎవరైనా ఆ సమయంలో చూసినా, పట్టుకోవడానికి ప్రయత్నించినా ప్రాణాలు తీసేస్తుంది. విజయవాడలో తిరుగుతున్న గ్యాంగ్‌ ఇదేనా? కాదా? అనేది పెద్ద సందేహం. చిట్టినగర్‌లో చోరీకి పాల్పడిందీ, గుంటుపల్లిలో చోరీకి యత్నించిందీ ఒకే గ్యాంగేనా? అనే సందేహం వ్యక్తమవుతోంది. చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు చోరీలకు దిగినప్పుడు చెప్పులు ధరించరు. గుంటుపల్లిలో గ్యాంగ్‌ సభ్యులు చెప్పులు ధరించి ఉన్నారని చెబుతున్నారు. దీనినిబట్టి, వచ్చింది చెడ్డీ గ్యాంగా? పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఇతరులు వీరి అవతారంలో వచ్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కడిదీ గ్యాంగ్‌..?

ఈ ముఠా సభ్యులు గుజరాత్‌లోని దాహోడ్‌ జిల్లా గర్బాదా మండలంలోని సహద గ్రామానికి చెందినవారు. అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అక్కడ సుమారు 35 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిలో రామ్‌జేబాడ్‌వే అనే వ్యక్తి కొంతమందితో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. 2010 వరకు ఒకే ముఠాగా పనిచేసిన వాళ్లంతా దినేష్‌, సురేష్‌, రామ్‌జీ, కిషన్‌ అనే నాలుగు ముఠాలుగా ఏర్పడ్డారు. వాళ్లంతా సమీప బంధువులే. ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ ముఠాపై ఆ రాష్ట్రంలో ఎలాంటి కేసులూ లేవు.

చోరీ సొత్తుతో పండుగ

దీపావళికి రెండు నెలల ముందు, సంక్రాంతి పండుగ సమయంలో ఈ గ్యాంగ్‌లు చోరీలకు బయలుదేరుతాయి. ఒక్కో ముఠా ఒక్కో ప్రాంతంలో దిగి, శివార్లలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ముఠాలోని కొందరు పగలు కాలనీలకు వెళ్లి రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి, తిరిగి అర్ధరాత్రి ఒంటిపై ఉన్న దుస్తులను తీసేసి, బెల్టుతో నడుముకు కట్టుకుంటారు. ఎవరైనా పట్టుకుంటే దొరక్కుండా ఒంటికి నూనె, గ్రీజ్‌ రాసుకుంటారు. కాళ్ల చెప్పులను తీసి నడుంకు ఉన్న దుస్తుల్లో పెడతారు. చెడ్డీలు మాత్రమే ధరించి రంగంలోకి దిగుతారు. ఆ సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే తమ వద్ద ఉన్న రాడ్లతో, రాళ్లతో దాడి చేసి ప్రాణాలు తీసేస్తారు. రెండు నెలలపాటు దోపిడీలు చేసి, తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఇలా దోచుకున్న సొమ్ముతో సంబరాలు చేసుకుంటారు. ఈ ముఠా ఏపీతో పాటు హైదరాబాద్‌, రాచకొండ ప్రాంతాల్లో అనేక చోరీలకు పాల్పడింది.

Advertisement
Advertisement