Abn logo
Sep 5 2020 @ 03:10AM

మారనున్న మాస్టర్‌ ప్లాన్‌

Kaakateeya

తప్పుల తడకలా మారిన 2017 మాస్టర్‌ప్లాన్‌  

జరిగిన తప్పిదాలతో మునిసిపల్‌ ఆదాయానికి వందల కోట్ల గండి

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో 15 రోజుల్లో వికారాబాద్‌కు ప్రత్యేక అధికారుల బృందం 


తప్పుల తడకగా వికారాబాద్‌ మునిసిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేశారు. దీంతో పట్టణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. తమ సొంత పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకోవాలనుకున్న,  లేఅవుట్‌ ఏర్పాటు చేద్దామనుకున్న భూయజమానులకు మాస్టర్‌ ప్లాన్‌లో దొర్లిన తప్పులు చుక్కలు చూపిస్తున్నాయి. మూడేళ్లుగా తమ సమస్య పరిష్కరించుకునేందుకు మునిసిపల్‌ కార్యాలయం, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరేట్‌, డీటీసీపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి పోవడంతో.. ఆయన స్పందించి, మరోసారి సర్వే చేసి ప్రణాళికాబద్ధంగా వికారాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. 


వికారాబాద్‌ : భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించాల్సిన వికారాబాద్‌ మునిసిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో పలు తప్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక అవసరాలు, వనరుల లభ్యత, ప్రజోపయోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అధికారులు తమకు నచ్చిన విధంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. వికారాబాద్‌ మునిసిపల్‌ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మూడేళ్ల కిందట టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించింది. వికారాబాద్‌ పట్టణాన్ని ఆరు జోన్లుగా విభజించి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. మునిసిపల్‌ పరిధిలో ఏయే ప్రాంతాలు నివాసయోగ్యమైనవి, వ్యాపార ఉపయోగ ప్రాంతాలు, ఏయే ప్రాంతాలు వ్యాపారాలకు, పరిశ్రమలకు అనుకూలం, పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌ జోన్‌కు ఏయే ప్రాంతాలు కేటాయించాలి, భవిష్యత్తులో పట్టణం విస్తరించేందుకు ఏయే ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయనేది గుర్తించి జోన్లుగా విభజించి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలి.


ఇష్టానుసారం

పట్టణ ప్రణాళికా విభాగానికి చెందిన కొందరు అధికారుల అలసత్వం, అవగాహన లేమి కారణంగా వికారాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ (జీవో నెంబర్‌ ఎంఎస్‌. 86, తేదీ: 23.3.2017) పూర్తిగా తప్పుల తడకగా మారింది. అధికారులు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో నివాసయోగ్యమైన ప్రాంతాలను ఇండస్ర్టియల్‌ జోన్‌గా, భవిష్యత్తులో విస్తరించనున్న ప్రాంతాలను పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌ అని చూపించారు. ఎన్నో సంవత్సరాలుగా కొత్తగడిలో సగం ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ జోన్‌గా ప్రకటించగా, అనంతగిరిపల్లి ప్రాంతాన్ని ట్రాన్స్‌పోర్ట్‌ జోన్‌గా, ఒక సర్వే నెంబర్‌లో పబ్లిక్‌, సెమీపబ్లిక్‌ ల్యాండ్‌ ఉంటే దాని పక్కనే ఉన్న సర్వే నెంబర్లలోని ప్రాంతాలను రెసిడెన్షియల్‌ జోన్‌కు బదులుగా పబ్లిక్‌ అండ్‌ సెమీ పబ్లిక్‌ యూస్‌కు కేటాయించారు. శ్మశానవాటిక పక్కన ఉన్న పట్టా భూములను శ్మశానవాటికలుగా మాస్టర్‌ప్లాన్‌లో సూచించారు. జిల్లా ఎస్సీ కార్యాలయం పక్కన ఉన్న సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల ప్రాం తాన్ని ట్రాన్స్‌పోర్ట్‌ జోన్‌గా, జిల్లా కోర్టు పక్కన ఉన్న పట్టా భూమిని సెమీ పబ్లిక్‌ వినియోగానికి వీలుగా మార్చారు. ఇలా మాస్టర్‌ప్లాన్‌ను తప్పుల తడకగా మార్చి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ఏయే ప్రాంతాలు... ఏయే జోన్‌కు అనుకూలంగా ఉంటుందనేది డీటీసీపీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి పంపినట్లు తెలుస్తోంది. 


మూడేళ్లుగా ప్రజలకు కష్టాలు

2017, మార్చి 23న ప్రభుత్వం వికారాబాద్‌ మాస్టర్‌ప్లాన్‌ జీవో (నెంబర్‌ 86) విడుదల చేసింది. అప్పటినుంచి పట్టణ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. తమ సొంత పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకోవాలనుకున్న,  లేఅవుట్‌ ఏర్పాటు చేద్దామనుకున్న భూయజమానులకు మాస్టర్‌ ప్లాన్‌లో దొర్లిన తప్పులు చుక్కలు చూపిస్తున్నాయి. 2018లో అప్పటి పాలకవర్గం మాస్టర్‌ ప్లాన్‌లో పలు తప్పులు చోటు చేసుకున్నాయని, దీంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అప్పటి మునిసిపల్‌ చైర్మన్‌ విశ్వనాథం సత్యనారాయణ నేతృత్వంలో సభ్యులు మళ్లీ మాస్టర్‌ ప్లాన్‌ కోసం సర్వే చేయాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదించారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌లో చోటు చేసుకున్న తప్పిదాలతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలని మునిసిపల్‌ అధికారులను ఎవరైనా సంప్రదిస్తే, సీఎల్‌యూ (చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూస్‌)కు దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపేసుకుంటున్నారు. చేసేదేమీ లేక సదరు బాధితులు మూడేళ్లుగా తమ సమస్య పరిష్కరించుకునేందుకు మునిసిపల్‌ కార్యాలయం, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టరేట్‌, డీటీసీపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.


కేటీఆర్‌ దృష్టికి వెళ్లిన సమస్య

ఇదిలా ఉంటే, వికారాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల పలువురు ఎదుర్కొంటున్న సమస్యలను ఇటీవల ఒకరు రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. తన పట్టా పొలాన్ని శ్మశాన వాటికగా రికార్డుల్లో చేర్చారని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్‌  ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరగా, ఆయన స్పందించి మరోసారి సర్వే చేసి ప్రణాళికాబద్ధంగా వికారాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే విషయమై త్వరలో  ప్రత్యేక అధికారుల బృందం వికారాబాద్‌ మునిసిపాలిటీలో పర్యటించి సర్వే చేయనున్నట్లు సమాచారం. అధికారుల తప్పిదంతో కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడడ మే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిపోయింది.


ఎవరూ ఆందోళన చెందొద్దు

వికారాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌లో చోటు చేసుకున్న అంశాలు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత నా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌తోపాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా... రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు సమస్యను విన్నవించాం. మరోసారి వికారాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించేందుకు సర్వే చేయాలని కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో ప్రత్యేక బృందం వికారాబాద్‌ రానుంది. వారు సర్వే చేసిన తరువాత ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం.

- మంజుల రమేష్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌


Advertisement
Advertisement