Abn logo
Mar 6 2021 @ 01:44AM

విశాఖకు ఏ2 శని

ఓటుతో బుద్ధి చెప్పడం ద్వారా నగరం నుంచి తరిమికొట్టండి

జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే...రౌడీయిజానికి లైసెన్స్‌ ఇచ్చినట్టే

ఆడ పిల్లలకు రక్షణ ఉండదు

ఎప్పుడు ఎవరిళ్లు కూలుతుందో, ఎవరి ఆస్తులు ఆక్రమించుకుంటారో కూడా తెలియదు

భయపడి ఓట్లేస్తే మరింతగా అరాచకాలు పెరిగిపోతాయ్‌

 ఎన్నికలైన వెంటనే ఇంటి పన్ను వడ్డనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది

గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే నగరానికి పూర్వవైభం తీసుకొస్తా

మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు


విశాఖఫట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): 


‘విశాఖ నగరాన్ని గత 22 నెలలుగా ఏ 2 శని పట్టి పీడిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పడం ద్వారా దాన్ని వదిలించుకోవాలి’...అని నగరవాసులకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆయన పెందుర్తి నుంచి అక్కయ్యపాలెం వరకూ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ...విశాఖ నగరంతో ఏ2కు పనేమిటని ప్రశ్నించారు. దౌర్జన్యాలు, రౌడీయిజంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని విమర్శించారు.  


విశాఖను ఎంతగానో అభివృద్ధి చేశానని, అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు వేలాది మొక్కలు నాటితే...ఆ మొక్కలకు కనీసం నీళ్లు కూడా పోయడం లేదన్నారు. ఎన్‌ఏడీ ప్లై ఓవర్‌ను ఐకానిక్‌ బ్రిడ్జ్‌గా అభివృద్ధి చేయాలని భావిస్తే...తూతూ మంత్రంగా పూర్తిచేసి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి నగరానికి తెచ్చిన ఫిన్‌టెక్‌ పార్క్‌, అదానీ డేటా సెంటర్‌, లులూ మాల్‌ వంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రైల్వేజోన్‌, మెట్రో ట్రైన్‌, ప్రత్యేక హోదా రాలేదని, చేతగాని ప్రభుత్వం ఏం చేస్తోందో తెలియడం లేదన్నారు. ఐటీ హబ్‌గా, ఇండస్ర్టియల్‌ పార్క్‌గా, అందమైన నగరంగా తీర్చిదిద్దాలనుకుని ఎంతో అభివృద్ధి చేశానని, ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ పోయాయన్నారు. శాంతికి మారుపేరైన విశాఖ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా రెచ్చగొడుతున్నారని, ఏ1, ఏ2 ప్రజలను మభ్యపెడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే నగరానికి పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు.


పెరిగిన ధరలతో భారం.. 


నిత్యావసర సరకుల ధరలు మూడు, నాలుగు రెట్లు పెరిగిపోయాయని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, నియంత్రించాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని భావించిన యువతకు నిరాశే మిగిలిందన్నారు. విశాఖలో రైడీయిజం పెరిగిందని, నేరమయ నగరంగా మార్చారని, భూ కబ్జాలు పెరిగిపోయాయని విమర్శించారు. ‘దౌర్జన్యాలు చేస్తున్న ఏ2 రాజకీయ అనుభవమెంత..? భూ కబ్జాలు చేస్తావా..? శాశ్వతంగా జైలుకు పోతావ్‌ ఖబడ్దార్‌’ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు భయపడితే...అరాచకాలు పెరిగిపోతాయని, ఎదురు తిరగాలని కోరారు. 


రౌడీయిజానికి లైసెన్స్‌ ఇచ్చినట్టే.. 


జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే...రౌడీయిజానికి లైసెన్స్‌ ఇచ్చినట్టేనని చంద్రబాబు స్పష్టంచేశారు. ఆడ పిల్లలకు రక్షణ ఉండదని, ఎప్పుడు ఎవరిళ్లు కూలుతుందో, ఎవరి ఆస్తులు ఆక్రమించుకుంటారో కూడా తెలియదని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికలైన వెంటనే ఇంటి పన్ను వడ్డనకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, వేల రూపాయలు అదనపు భారం ప్రజలపై పడనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు విశాఖ నగరమే నాంది కావాలని పిలుపునిచ్చారు. హుద్‌హుద్‌ సమయంలో విశాఖ నగరం పూర్తిగా కోలుకునేంత వరకు ఇక్కడే వుండి పని చేశానని, తాను ఎక్కడ వున్నా ఈ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఎంతగానో అభివృద్ధి చేశానని, అదే కృతజ్ఞతతో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిపించారని, అదే స్ఫూర్తితో 98 వార్డుల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఇసుక దొరకడం లేదని, ఇష్టం వచ్చిన మద్యం బ్రాండ్లను తెచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. రూ.500-1000 కోసం ఓటేస్తే...జీవితాంతం నష్టపోవాల్సి వస్తుందని, బెదిరింపులకు భయపడొద్దని, ఒక అల్లూరిలా తిరగబడాలని, బొబ్బిలిలా గాండ్రించాలని, అన్యాయాలపై ప్రజలంతా తిరగబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మద్య నిషేధమని చెప్పి.. ఇప్పుడు మద్యంపైన వచ్చే ఆదాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదురించాలని, భయపడకుండా పోరా డాలని సూచించారు. 


వైసీపీకి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ను పోస్కోకు అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్టే...


పోరాటంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం యత్నిస్తోందని, గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ను పోస్కో కంపెనీకి అమ్మేసేందుకు అనుమతి ఇచ్చినట్టేనని చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలో అభివృద్ధి ఆగిపోయిందని, ఉన్న ఒక్కగానొక్క ప్రభుత్వ పరిశ్రమను జగన్‌ నిర్వాకం వల్ల ప్రైవేటుపరం చేసే ప్రక్రియ జరుగుతోందని విమర్శించారు. 


మేయర్‌ అభ్యర్థి పీలా 

చంద్రబాబు ప్రకటన


విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీకి తమ పార్టీ తరపున మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పెందుర్తి ఎన్నికల ప్రచార సభలో ఆయన...పీలా శ్రీనివాసరావు పేరు ప్రకటించి, మొత్తం 98 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరారు. 

ప్రసంగిస్తున్న చంద్రబాబునాయుడు


Advertisement
Advertisement
Advertisement