Abn logo
Dec 2 2020 @ 12:14PM

స్పీకర్ తమ్మినేనిపై చంద్రబాబు ఫైర్..!

అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మూడో రోజూ వాడీవేడిగా సాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇవాళ ఉదయం సమావేశం ప్రారంభమవ్వగానే విద్యుత్‌ సవరణ బిల్లు, అసైన్డ్‌ భూములు లీజు అంశాలపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే.. ఈ అంశంపై చర్చించడానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వకపోవడంతో సభ నుంచి టీడీపీ వాకౌట్‌చేసింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసైన్డ్ భూముల చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని.. ఆ భూములు ఇచ్చిన రైతుల నుంచి మళ్లీ తీసుకోవడం చట్టవిరుద్దమన్నారు. ఎస్సీ రైతులను ఇబ్బంది పెడుతున్నారని.. ప్రభుత్వం పేదవారి పొట్ట కొడుతోందని బాబు ఆరోపించారు. ఈ సందర్భంగా స్పీకర్ గురించి మాట్లాడిన చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్పీకర్‌పై బాబు ఫైర్.. 

అసైన్డ్ భూములను ఎస్సీ రైతుల నుంచి లాక్కుని, వేరే వారికి ఇవ్వడం తప్పని ఇప్పటికే కోర్టు చెప్పింది. ఇంత ముఖ్యమైన బిల్లుపై మాట్లాడతానంటే ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని, బాధ్యత లేని విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారు. అధికార పక్షానికి చెందిన పదిమందికి మైక్ ఇచ్చి, నన్ను, తెలుగుదేశం పార్టీని తిట్టిస్తున్నారు. పదివేల మెగావాట్ల సౌరవిద్యుత్ అదనపు ఉత్పత్తి అంటూ రాష్ట్రంపై పెనుభారం మోపుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 19వేల 450 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇదే ఎక్కువ..మీ అవినీతి కోసం వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఇటువంటి ముఖ్యమైన అంశంపై చర్చ జరగాల్సిందే. మీకు (జగన్ సర్కార్‌కు) ప్రజలు గుణపాఠం చెబుతారుఅని చంద్రబాబు సభలో మాట్లాడారు.

Advertisement
Advertisement
Advertisement