Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎంగారూ.. మీ హామీని నెరవేర్చండి

టీటీడీ కార్మికులకు న్యాయం చేయండి 


తిరుపతి(కల్చరల్‌), డిసెంబరు 1: ‘ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టడానికి ముందు రోజు మీరు తిరుమలకు వచ్చారు. టీటీడీ కార్మికులతో కలిసి మిమ్మల్ని కలిశాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో టైంస్కేల్‌ ఇస్తానని మాట ఇచ్చారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లయినా హామీ నెరవేరలేదు. ఇకనైనా ఆ హామీని నెరవేర్చి, టీటీడీ కార్మికులకు న్యాయం చేయండి’ అంటూ జగన్మోహన్‌రెడ్డికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విజ్ఞప్తి చేశారు.  గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన నేపథ్యంలో  టీటీడీ కార్మికుల విషయమై ఒక ప్రకటన చేయాలని కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు కార్మికులు చేపట్టిన నిరవధిక పోరాటం బుధవారంతో ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మురళి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి భిన్నంగా టీటీడీ ఈవో, జేఈవో, పాలక మండలి పెద్దలు వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ధరలు పెరిగిపోయి బతుకు  దుర్భరంగా ఉన్న సమయంలో కార్మికులకు ఊరడింపు కల్పించాల్సిన టీటీడీ యాజమాన్యం తేలిక భావంతో  మాట్లాడుతోందని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టర్ల భారినుంచి  తప్పించి కార్పొరేషన్‌లో కలపాలని.. సొసైటీలో పనిచేసే కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతున్నారన్నారు. ఈరెండు ప్రతిపాదనలను టీటీడీ ఉన్నతాధికారులు ఏకపక్షంగా తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ప్రోద్బలంతో జేఈవో సదాభార్గవి ఉద్యోగులు, కార్మికులను  భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన  వేలాది మంది కార్మికులు టీటీడీలో పనిచేస్తున్నారని గుర్తుచేశారు. అధికారుల మొండి వైఖరికి విసుగెత్తి పోయి ఇక్కడి శాసనసభ్యులు  తమ నిస్సహాయతను వెల్లడించడం.. టీటీడీలో అప్రజాస్వామ్య ధోరణులు ఎంతటి పరాకాష్టకు  చేరుకున్నాయో అర్థమవుతోందన్నారు.  సీఎం హామీని అమలు చేయాలని కోరే తమపై పోలీసులను ఉసిగొల్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని మేలు చేయకపోతే కార్మికులు నష్టపోతారని, ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడాలని మురళి కోరారు. ఈ ఆందోళనలో టీటీడీ కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి టి.సుబ్రమణ్యం, యూనియన్‌ నేతలు గోపీనాథ్‌, త్యాగరాజురెడ్డి, బాలాజి, మనోహర్‌, రాజేష్‌, కుమార్‌, హరి, దిలీప్‌,  శివారెడ్డి, రజని, ఏకాంబరం,  యశోద, సుభద్ర, రాధా, సుభాషిణి,  హరిప్రసాద్‌, హరికృష్ణ, నవీన్‌వర్మ, అమర్నాథ్‌, రూప్‌కుమార్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement