Abn logo
Sep 30 2020 @ 03:45AM

రైతు గుండెల్లో బాకులతో గుచ్చారు: రాహుల్‌

Kaakateeya

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: దేశ భవిష్యత్తు కోసం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించాల్సిందేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడారు. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు కూడా రైతుపై ప్రతికూల ప్రభావం చూపే చర్యలేనని, అయితే ఈ మూడు చట్టాలూ అంతకంటే ఎక్కువగా రైతులను దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు.


‘వాటికీ, వీటికీ పెద్ద తేడా ఏమీ లేదు. కాకుంటే ఇవి నేరుగా రైతు గుండెల్లో బాకులతో గుచ్చడం’ అని దుయ్యబట్టారు. ‘రైతులది బలమైన గొంతుక. దాని ద్వారానే స్వాతంత్య్రం వచ్చింది. ఇపుడు మరోసారి ఆ గొంతుక ద్వారా స్వతంత్రత సాధించుకోవాలి..’ అన్నారాయన. ఈస్టిండియా కంపెనీ మాదిరిగా ఇపుడు వ్యాపారం చేయజూస్తున్నారని ఓ రైతు వ్యాఖ్యానించగా.. ‘నాడు ఈస్టిండియా కంపెనీ.. ఇపుడు కేంద్రంలో వెస్టిండియా కంపెనీ’ అని రాహుల్‌ మోదీ-అమిత్‌ షాల గుజరాత్‌ విషయాన్ని ప్రస్తావించారు. 

Advertisement
Advertisement
Advertisement