Abn logo
May 12 2020 @ 00:33AM

విపత్తులో నిమిత్తమాత్రంగా కేంద్రం

ఎవరేమనుకున్నా కరోనా కట్టడి విషయంలో మోదీ ఈ దేశానికి ఒక సింబాలిక్ నాయకుడిగా మాత్రమే మిగిలిపోయారు. కార్యాచరణకు, నిరంతర సహాయ సంరక్షణ చర్యలకు సంబంధం లేకుండా ఆయన పైసా ఖర్చులేని ప్రచారాన్ని కోరుకుంటున్నారు. నిజానికి కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికంటే ముందే రాష్ట్రాలు మేల్కొన్నాయి. వైరస్ నియంత్రణకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. కేరళ, తెలంగాణా, ఒరిస్సాలాంటి రాష్ట్రాలు ఈ విపత్తు తీవ్రతను ముందుగానే ఊహించాయి. వ్యాధి లక్షణాలను దృష్టిలో పెట్టుకుని జనసమ్మర్దం ఉండే అన్ని కార్యకలాపాలు రద్దుచేసి దేశం మొత్తంలోనే మొదట అప్రమత్తమై పాక్షిక కట్టడిని ప్రకటించింది తెలంగాణా ప్రభుత్వం.


కరోనా వైరస్ కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా ఉంటోంది. కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించింది మొదలు కేంద్ర ప్రభుత్వం ముందుచూపు ప్రదర్శించకపోగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వెనక్కు లాగే విధంగా ప్రవర్తిస్తోంది. ఇప్పుడు ఈ క్లిష్టపరిస్థితుల మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కేంద్రాన్ని నిందించనప్పటికీ లోలోపల కుమిలిపోతున్నాయి. తాజాగా వలస కార్మికుల తరలింపు మార్గదర్శకాల విషయంలో కేంద్రం పిల్లిమొగ్గలు వేసిన తీరు, అలాగే ప్రజలకు అత్యవసరమైన వస్తువులకు మాత్రమే వెసులుబాటు ఇవ్వాల్సిందిపోయి మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతులివ్వడం, రైళ్లూ విమానాలూ నడిపించాలని నిర్ణయించడం వంటి ఏకపక్ష నిర్ణయాలు.. ఇలాంటివి  విమర్శలకు కారణంఅవుతున్నాయి.


లాక్‍డౌన్ విధింపు, సడలింపు విషయం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఒక్క పైసా సహాయం చేయకుండా పెత్తనం చేయడం పట్ల కూడా అసహనం వ్యక్తం అవుతోంది. బెంగాల్, ఢిల్లీ, జార్ఖండ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తులు చేసి ఉన్నా స్పందన కరువవుతోంది. పైగా కోవిడ్ ఏర్పాట్ల పరిశీలన, పర్యవేక్షణ, నిపుణుల బృందాల పేరుతో జోక్యం చేసుకోవడం కూడా ఎక్కువయిందని విమర్శలు వినవస్తున్నాయి. అయినా సరే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా రాష్ట్రాలు తమ తమ అవసరాల మేర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 


ఇలా జాతి మొత్తాన్ని ఒక విపత్తు కబళించినప్పుడు ఎలా వ్యవహరించాలో కొన్ని పద్ధతులు, నియమాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రొటోకాల్స్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో చట్టాలు కూడా ఉన్నాయి. భారత దేశానికి సంబంధించి దేశరక్షణ (అంటే యుద్ధాల నుంచే కాదు), ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు కాపాడవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. దీనికి సంబంధించి 2005లో విపత్తుల నిర్వహణ చట్టం స్పష్టమైన బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి దఖలుపరచింది. ఈ చట్టం ప్రకారం ప్రతి జాతీయ విపత్తుకు సంబంధించిన నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండే కార్యనిర్వాహక కమిటీ చూసుకుంటుంది. రాష్ట్రానికి సంబంధించినపుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంటుంది. ఇటువంటి ఊహించని ఉపద్రవం జాతిమొత్తాన్ని కబళించినప్పుడు కేద్రప్రభుత్వం దానిని జాతీయ విపత్తుగా ప్రకటించి వెంటనే రంగంలోకి దిగాలి. రాష్ట్రాలకు విపత్తుపై పోరాడేందుకు కావలసిన ఆర్థిక, రక్షణ సంపత్తిని సమకూర్చాలి. అలా చేయకుండా ప్రభుత్వం దీనిని ‘ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఆఫ్ 1897’ పరిధిలోకి తెచ్చి చేతులు కడిగేసుకుంది. 


123 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు తెచ్చిన ‘ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఆఫ్ 1897’ చట్టం రాష్ట్రాలకు మహమ్మారుల సందర్బంగా కొంత వెసులుబాటు ఇచ్చే చట్టం. దీని కింద రాష్ట్రాలకు అప్పటి వరకూ వున్న చట్టాలు, షరతులతో సంబంధంలేకుండా విస్తృతితో వ్యవహరించే మరిన్ని అధికారాలను ఇచ్చింది. ఇది నిర్వహణకు సంబంధింనత వరకు పరవాలేదు, కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా, ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగాలేని కారణంగా విస్తరించే మహమ్మారుల విషయంలో బాధ్యత ఎవరిదో ఎక్కడా స్పష్టత లేదు. దీని కారణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారాన్ని రాష్ట్రాలకు వదిలేసి సలహాలు, సూచనలకు పరిమితం అవువుతోంది. కొన్నిసార్లు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారే ఉత్తర్వులు, ఆదేశాలు కూడా ఇస్తోంది. లాక్‍డౌన్ విషయంలో ముఖ్యంగా ఇప్పుడు లాక్‍డౌన్‍ను ఎత్తివేసే విషయంలో ఇటువంటి ఉత్తర్వులు సమస్యలకు కారణం అవుతున్నాయి. 


ఎవరేమనుకున్నా కరోనా కట్టడి విషయంలో మోదీ ఈ దేశానికి ఒక సింబాలిక్ నాయకుడిగా మాత్రమే మిగిలిపోయారు. అంటే కార్యాచరణకు, నిరంతర సహాయ, సంరక్షణ చర్యలకు సంబంధం లేకుండా ఆయన పైసా ఖర్చులేని ప్రచారాన్ని కోరుకుంటున్నారు. అటువంటి ప్రచారాన్ని కల్పించే ప్రజాకర్షక చర్యలకు పరిమితం అవుతున్నారు. గంటలు మోగించడం, దీపాలు వెలిగించడం, హెలికాఫ్టర్లతో దేశమంతటా ఆసుపత్రుల మీద పూలు చల్లడం లాంటి చర్యలు ఆయన పట్ల ప్రజల్లో ఆదరణను మరింతపెంచవచ్చేమో కానీ,  వ్యాధిగ్రస్తులకు ఉపశమనం ఇవ్వవు. కరోనాను కట్టడి చేయవు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. కరోనా చికిత్స కోసం ఒక్కొక్క బాధితుడికి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. తక్కువ కేసులున్న తెలంగాణా రాష్ట్రంలోనే ఇప్పటివరకు ముప్ఫై ఆరు కోట్లకు పైగా ఖర్చయ్యింది. ఇక మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల పరిస్థితి ఏమిటో ఊహింహవచ్చు. 


నిజానికి కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వానికంటే ముందే రాష్ట్రాలు మేల్కొన్నాయి. వైరస్ నియంత్రణకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. కేరళ, తెలంగాణా, ఒరిస్సాలాంటి రాష్ట్రాలు ఈ విపత్తు తీవ్రతను ముందుగానే ఊహించాయి. వ్యాధి లక్షణాలను దృష్టిలో పెట్టుకుని జనసమ్మర్దం ఉండే అన్ని కార్యకలాపాలు రద్దుచేసి దేశం మొత్తంలోనే మొదట అప్రమత్తమై పాక్షిక కట్టడిని ప్రకటించింది తెలంగాణా ప్రభుత్వం. స్వయంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ఒకవైపు ప్రజలకు ధైర్యం కలిగిస్తూనే, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వ్యాధి విదేశీ ప్రయాణికుల నుంచి విస్తరిస్తోంది కాబట్టి విమానాలు రద్దు చేయాలని, వీసాలు నిలిపి వేయాలని, సరిహద్దులు నియంత్రించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకాస్త ముందుగా మేల్కొని ఉంటే ఈ విపత్తు కొంతయినా అదుపులో ఉండేది.


అంతే కాదు రాష్ట్రాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకునే వెసులుబాటు కల్పించాలని, రుణపరిమితి పెంచాలని, ద్రవ్య చెలామణీ కోసం చర్యలు తీసుకోవాలని కూడా కేసీఆర్ స్పష్టమైన సూచన చేశారు. లాక్‍డౌన్ కారణంగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు డబ్బు చెలామణిలోకి తేవడమే అత్యుత్తమ మార్గం. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడాలంటే దేశంలో, ప్రజల దగ్గర డబ్బుండాలి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే డబ్బు చెలామణిలోకి రాదు. పన్నులుండవు. ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతుంది. కాబట్టి కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు నగదు నిల్వలు అందుబాటులోకి తెచ్చి ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా చూసుకోవాలి. తక్కువ వడ్డీకి నేరుగా రిజర్వు బ్యాంకు ఇటువంటి డబ్బును విడుదల చేస్తుంది. ఇది ఆర్థిక సమతుల్యతను కాపాడుతుంది. ఆదాయం లేని ఈ స్థితిలో ఈ డబ్బు ఖర్చులకు పనికి వస్తుంది. ఈ స్థితిలో హెలికాఫ్టర్ మనీ చెలామణిలోకి రావడం ఆర్థిక వ్యవస్థకు టానిక్ లాగా పనిచేస్తుంది. 1918లో స్పానిష్ ఫ్లూ సందర్భంగా, 2008లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనం సందర్భంగా ఇటువంటి ఏర్పాట్లను ప్రభుత్వాలు చేశాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా 10శాతం, బ్రిటన్ 15శాతం హెలికాఫ్టర్ మనీ అందుబాటులోకి తెచ్చాయి. మనదేశంలో కూడా కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు ఇలా అందుబాటులోకి తేవాలని ఆర్థికవేత్తలు కూడా సూచిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం పనిచేయని నాసిరకం టెస్టింగ్ కిట్లు, సేఫ్టీ కోసం వేసుకునే పీపీఈ కిట్లు రాష్ట్రాలకు పంపి మిగతా సంగతులు మరిచిపోయింది. 


ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సడలింపు సూచనల పుణ్యమా అని వ్యాధి వ్యాప్తి ఇంకా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వలస కార్మికులను వదిలివేయడం, మద్యం దుకాణాలు తెరవడం, కార్లూ టాక్సీ లను అనుమతించడం, రియలెస్టేట్ తదితర వాణిజ్య వ్యాపారాలు నడవాలనుకోవడం ఇవన్నీ రాష్ట్రాల మీద మరింత ఒత్తిడి పెంచే చర్యలు. ఇప్పటికే వలస కార్మికులు రైళ్ళూ బస్సులూ ఇతర మార్గాల ద్వారా ఊళ్లకు చేరుకుంటున్నారు. మళ్ళీ విదేశాల నుంచి విమానాలు దిగుతున్నాయి. లాక్‍డౌన్‍కు ముందు వివిధ దేశాల్లో చిక్కుకున్నవాళ్ళు వెనక్కు వస్తున్నారు. రైళ్లు కూతపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజారవాణా మళ్ళీ మొదలయ్యింది. లాక్‍డౌన్ ఉన్నప్పుడు నోళ్లు కట్టేసుకుని ఇళ్లల్లో కూర్చున్నవాళ్ళు ఇప్పుడు వీధుల పొడవునా వైన్ షాపుల ముందర బారులు తీరుతున్నారు. ఇవన్నీ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి చేసిన కట్టడి చర్యలకు తూట్లు పొడిచే నిర్ణయాలు.


ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఫెడరల్ స్ఫూర్తి కొరవడిందనే చెప్పుకోవాలి. భారత దేశానికి ఉన్న అన్నిరకాల భిన్నత్వాన్ని గుర్తించిన రాజ్యాంగవేత్తలు ఏకవ్యక్తి పాలన, ఏకపక్ష నిర్ణయాలు పనికిరావని ఉద్దేశంతోనే ఫెడరల్ వ్యవస్థను రూపొందించారు. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల స్వేచ్ఛను పూర్వపక్షం చేసే చర్యలు తీసుకుంటోంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. దేశంలో కేవలం యాభై కేసులు ఉన్నప్పుడు లాక్‍డౌన్ విధించిన ప్రభుత్వాలు, అరవైవేల కేసులు దాటుతున్న పరిస్థితుల్లో లాక్‍డౌన్ ఎత్తివేయడం అంటే ప్రజారోగ్యం విషయంలో చేతులు ఎత్తేయడమే! మరోవైపు రానున్న రెండుమూడు నెలల్లో మన దేశానికి కరోనా వైరస్‍తో పెను ప్రమాదం ఉందని, జులై నెలాఖరు నాటికి ఇది తారాస్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టి కోవిడ్ నుంచి కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వాలు ప్రజలమీదికి నెట్టివేయ చూస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. 

డా. రాహుల్ రాజారామ్

సామాజిక, రాజకీయ పరిశోధకుడు

Advertisement
Advertisement
Advertisement