Abn logo
Jul 12 2020 @ 06:05AM

పల్లెలకు ‘కేంద్రం’ ఆసరా..

15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల

జిల్లాకు రూ.24.08 కోట్లు


సాలూరు రూరల్‌, జూలై 11: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేకుండా పల్లెలకు ఆర్థిక ఆసరా అందించడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీలకు రూ.28.04 కోట్లు తొలివిడత బేసిక్‌ గ్రాంట్‌ కింద వచ్చాయి. జిల్లాలో ప్రస్తుతం 960 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాల గడువు 2018 ఆగస్టు రెండో తేదీతో ముగిసింది.


పంచాయతీలకు ఎన్నికలు జరిగిన తరువాతే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని అంతా భావించారు. పంచాయతీలకు నిధుల కొరత ఉండడంతో పంచాయతీ కార్యదర్శులు చేతిచమురు వదిలించుకున్నారు. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం పంచాయతీల్లో మొత్తం 23లక్షల 44వేల 474 మంది జనాభా ఉన్నారు. వారిలో 11లక్షల 61వేల 477 మంది పురుషులు, 11లక్షల 82వేల 997 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఇళ్ల సంఖ్య 6.99 లక్షలు ఉన్నాయి. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తే గతంలో ప్రభుత్వాలు ఇతర పనులకు మళ్లించిన సంఘటనలు ఉన్నాయి. ఈ విధానానికి 2014లో మోదీ ప్రభుత్వం స్వస్తి చెప్పి పంచాయతీల బలోపేతానికి నేరుగా పంచాయతీ ఖాతాలకే నిధులను జమ చేస్తుండడం విశేషం. ఈ నిధులు 90 శాతం జనాభా ప్రతిపాదికన, పది శాతం ప్రాంతం ప్రతిపాదికన పంచాయతీ ఖాతాల్లో జమ చేయనున్నారు.


ఈ నిధులతో తాగునీటి పథకాలు, కరోనా నేపథ్యంలో పారిశుధ్య కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. వచ్చిన నిధుల్లో 15 శాతం చొప్పున మండల, జిల్లా పరిషత్‌లకు సైతం నిధులు సర్దుబాటు చేసే అవకాశముంది. నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఆర్థిక ఆసరాగా నిలువనున్నాయి.

Advertisement
Advertisement
Advertisement