Advertisement
Advertisement
Abn logo
Advertisement

శేషశైలా...ఇక సెలవు!

డాలర్‌ శేషాద్రికి ప్రముఖుల నివాళి

తిరుపతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): శేషశైలవాసికి చిరకాలంగా సేవలందించిన పాల శేషాద్రి అలియాస్‌ డాలర్‌ శేషాద్రి శ్రీనివాసుడి కొలువునుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.  విశాఖపట్నంలో టీటీడీ తలపెట్టిన కార్తీకదీప మహోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. వైజాగ్‌ నుంచి మంగళవారం వేకువజామున ఆయన పార్థివదేహం తిరుపతికి చేరుకుంది. పాతప్రసూతి ఆస్పత్రి సమీపంలోని సిరిగిరి టవర్స్‌ సెల్లార్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయన పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఉదయం 7 గంటలనుంచే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శేషాద్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరుపతికి చేరుకుని శేషాద్రికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 25 ఏళ్లుగా శేషాద్రితో తనకున్న అనుబంధాన్ని ఈసందర్భంగా ఆయన మీడియాతో పంచుకున్నారు. తిరుమలకు వచ్చినప్పుడల్లా శేషాద్రి చిరునవ్వుతో ఆత్మీయ పలకరింపు గుర్తుకువస్తుందన్నారు.శ్రీవారి ఆలయ సంప్రదాయాలపై ఆయన రచించిన పుస్తకాలను టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. బ్రాహ్మణ ఆచారవ్యవహారాలకు అనుగుణంగా అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేశారు.దేవేంద్ర థియేటర్‌ సమీపంలోని హరిశ్చంద్ర స్మశానవాటికలో దహన సంస్కారం నిర్వహించారు. 


 పాడె మోసిన ఎమ్మెల్యేలు

డాలర్‌ శేషాద్రి అంతిమయాత్రలో ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి తదితరులు పాల్గొని పాడె మోశారు. కరుణాకర రెడ్డి, ధర్మారెడ్డి శేషాద్రి జ్ఞాపకాలను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. స్వామివారి సేవకే శేషాద్రి జీవితాన్ని అంకితం చేశారన్నారు.శ్రీవారి భక్తాగ్రేసరుల్లో శేషాద్రి ఒకరన్నారు.డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ శేషాద్రి నిస్వార్థపరుడని, చివరి శ్వాస వరకు స్వామివారి సేవలోనే తరించారని చెప్పారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వామిసేవలోనే తనువు చాలించాలనుకున్న శేషాద్రి కోరికను శ్రీవారు నెరవేర్చారన్నారు.కరోనా బారినపడి కోలుకున్నప్పటికీ, నిరంతరం స్వామివారి సేవలోనే ఉండేవారని చెప్పారు. వయసు రీత్యా ఎక్కువ దూరం ప్రయాణించవద్దని సలహా ఇచ్చినప్పటికీ, విశాఖలో నిర్వహించిన కార్తీకమహాదీపోత్సవంలో పాల్గొనాలని వెళ్లి, స్వామివారి సేవలో తుదిశ్వాస విడిచి ధన్యజీవి అయ్యారన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు.  టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ నిరంతరం శ్రీవారి సేవలో గడిపిన శేషాద్రి లేని లోటు తీరనిదన్నారు. ఆలయంలో జరిగే నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల సేవలు, ఉత్సవాల నిర్వహణ విషయంలో అర్చకులకు, జియ్యంగార్లకు, అధికారులకు శేషాద్రి సంధానకర్తగా వ్యవహరించారన్నారు. రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ, మేయర్‌ శిరీష, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎ్‌సబీజీ పార్థసారధి, ప్రభుత్వ సలహాదారు అజయ్‌కల్లం, తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జి వీర్రాజు,టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాస రాజు, సీవీఎస్వో గోపీనాధ్‌ జెట్టి తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.

శేషాద్రి పాడె మోస్తున్న కరుణాకర రెడ్డి, చెవిరెడ్డి, ధర్మారెడ్డి


Advertisement
Advertisement