Jun 19 2021 @ 15:52PM

మిల్కా సింగ్‌కు నివాళి: చిరంజీవి

భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం మిల్కా సింగ్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా నివాళులు అర్పించారు. ‘ఫ్లయింగ్‌ సిఖ్‌’ మిల్కా సింగ్‌ (91) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. నెల రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతున్నారు. గత నెల 20న మిల్కాకు మొదట కరోనా సోకగా 24న మొహాలీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అదే నెల 30న డిశ్చార్చి అయినప్పటికీ తిరిగి ఈనెల 3న ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్‌లో చేర్పించారు. దీంతో గురువారం నెగెటివ్‌గా తేలడంతో మిల్కాను సాధారణ వార్డుకు మార్చారు. కానీ శుక్రవారం విపరీత జ్వరం.. ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో తిరిగి ఐసీయూకు మార్చారు. కానీ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి ఆయన మృతి చెందారు. గత ఆదివారమే మిల్కా భార్య నిర్మల్‌ కౌర్‌ (85) కరోనాతోనే మృతి చెందారు. మిల్కా సింగ్‌ మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.


''పరుగుల వీరుడు మిల్కా సింగ్‌గారి మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్టను, భారత పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి.. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్ కు నివాళి.." అని చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా మిల్కా సింగ్‌కు నివాళులు అర్పించారు. చిరంజీవితో పాటు మోహన్‌ లాల్‌, మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి వారు కూడా మిల్కా సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.