Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్‌పీవై రెడ్డి ఆగ్రోస్‌పై సీబీఐ కేసు!

  1. తప్పుడు పత్రాలతో రూ.కోట్ల రుణాలు 
  2. ఫిర్యాదు చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 
  3. బ్యాంకుకు రూ.61.86 కోట్లు నష్టం 
  4. కంపెనీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు


నంద్యాల టౌన్‌, డిసెంబరు 2: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన దివంగత మాజీ ఎంపీ ఎస్‌పీవై రెడ్డి ఫ్యాక్టరీలపై సీబీఐ కేసు నమోదు చేయడం కలకలం రేపింది. తప్పుడు పత్రాలతో రుణాలు పొందారని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌పీవై రెడ్డి ఆగ్రోస్‌ ఫ్యాక్టరీలపై  సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. నంది గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకుడిగా, ప్రముఖ పారిశ్రామికవేత్త స్థాయికి ఎదిగిన ఎస్‌పీవై రెడ్డి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో సైతం రాణించారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందిన అనంతరం, నంది గ్రూప్‌ సంస్థల నిర్వహణ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లింది. గత కొంతకాలంగా నందిగ్రూప్‌ సంస్థలు ఆర్థికపరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. బ్యాంకు రుణాలకు కనీసం వడ్డీ కూడా చెల్లించలేని స్థితికి చేరాయి. దీంతో బ్యాంకులన్నీ తమవద్ద తాకట్టు పెట్టుకున్న నంది గ్రూప్‌ ఆస్తులను బహిరంగ ప్రకటనల ద్వారా స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌పీవై ఆగ్రో సంస్థ తమ వద్ద తప్పుడు పత్రాలతో రుణాలు పొంది ఎగవేసిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీబీఐకి ఫిర్యాదు చేసింది. రూ.61.86 కోట్లు నష్టపోయామని బాం్యకు అధికారులు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో 15 మంది సభ్యులుగల సీబీఐ బృందం నంద్యాలకు గురువారం వచ్చి నందిగ్రూప్‌ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు తెలిసింది. ఈ తతంగం మొత్తం అత్యంత గోప్యంగా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కంపెనీ డైరెక్టర్లు సురేష్‌కుమార్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి, శేషిరెడ్డిపై సీబీఐ కేసు నమోదైనట్లు తెలిసింది. వివిధ బ్యాంకుల నుంచి రూ.కోట్లలో రుణాలు పొందేందుకు యాజమాన్యం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిందని, బ్యాంకర్లను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌పీవై రెడ్డి కుటుంబంలోని ఓ వ్యక్తి ఈ తతంగంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదేవ్యక్తి ప్రస్తుతం ఫ్యాక్టరీ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని చెబుతూ, కొంతగాలంగా నంద్యాలను వదిలి దూరంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. బ్యాంకుల నుంచి విచ్చలవిడిగా రుణాలు పొందేందుకు ఇదే వ్యక్తి కన్నుసన్నల్లో పలు డొల్ల కంపెనీ(షెల్‌)లను కూడా సృష్టించారని, రూ.కోట్లలో రుణాలు పొందారని ప్రచారం జరుగుతోంది. ఎస్‌పీవై రెడ్డి నంది గ్రూప్‌ సంస్థలకు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకులు సైతం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బాటలోనే నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Advertisement