Abn logo
May 4 2021 @ 09:29AM

నృత్య దర్శకుడు రాకేష్‌ మాస్టర్‌పై కేసు..

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నృత్య దర్శకుడు రాకేష్‌ మాస్టర్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో సినీ నృత్య దర్శకుడు ఎస్‌. రామారావు అలియాస్‌ రాకేష్‌ మాస్టర్‌ శ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాకేష్‌ మాస్టర్‌తోపాటు అతడి భార్య, యూట్యూబ్‌ నిర్వాహకులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములుయాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి వెంకటే్‌షయాదవ్‌, గ్రేటర్‌ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేష్‌ మాస్టర్‌పై ఐపీసీ 295ఎ,298 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు

కొందరు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని రాకే్‌షమాస్టర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణానగర్‌లోని తన ఫ్లాట్‌ వద్దకు ఈ నెల 2న సాయియాదవ్‌, ఇమ్రాన్‌తోపాటు మరికొంత మంది వచ్చారని, యూట్యూబ్‌ చానెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ప్రశ్నిస్తూ దుర్భాషలాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని రాకేష్‌ మాస్టర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 448, 427, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement