Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త ఏడాదిలో కార్లు మరింత ప్రియం

  • మారుతి, బెంజ్‌, ఆడీ ధరల పెంపు 
  •  జనవరి నుంచి అమలులోకి.. 

న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థలు కొత్త ఏడాదిలో కొనుగోలుదారులకు ధరల పెంపుతో స్వాగ తం పలకనున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకీతో పాటు జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీలైన మెర్సిడెజ్‌ బెంజ్‌, ఆడీ సైతం 2022 జనవరి నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాహన ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో పాటు మరిన్ని ఫీచర్ల జోడింపునకు అదనంగా వెచ్చించాల్సి రావడమే ఇందుకు కారణమని కంపెనీలంటున్నాయి. మోడల్‌ను బట్టి ధర పెరుగుదల మారుతుందని మారుతి సుజుకీ స్పష్టం చేసింది. కాగా, ఎంపిక చేసిన మోడళ్లపై వచ్చే జనవరి ఒకటి నుంచి 2 శాతం వరకు ధర పెరగనున్నట్లు మెర్సిడెజ్‌ బెంజ్‌ పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్ని మోడళ్ల రేటును 3 శాతం వరకు పెంచుతున్నట్లు ఆడీ వెల్లడించింది. 

ఈ ఏడాదిలో మూడు సార్లు పెంచిన మారుతి 

కార్ల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన స్టీల్‌, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌, విలువైన లోహాల ధరలు గడిచిన ఏడాదికాలంలో గణనీయంగా పెరుగుతూ వచ్చాయని, దాంతో వాహన ధరలను పలుమార్లు పెంచాల్సి వచ్చిందని మారుతి సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు. ఈ ఏడాదిలో మారుతి కార్ల ధరలను మూడు సార్లు పెంచింది. 2021 జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబరులో 1.9 శాతం కలిపి ఏడాది మొత్తానికి 4.9 శాతం పెంచినట్లు శ్రీవాస్తవ తెలిపారు. వచ్చే జనవరిలో ఎంత పెంచాలన్నదానిపై కసరత్తు జరుగుతోందన్నారు. కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌ ఆల్టో నుంచి ఎస్‌యూవీ ఎస్‌-క్రాస్‌ వరకు పలు మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ఎక్స్‌షోరూమ్‌ ధరలు రూ.3.15 లక్షల నుంచి మొదలుకొని రూ.12.56 లక్షల స్థాయిలో ఉన్నాయి. 

Advertisement
Advertisement