Abn logo
May 14 2020 @ 00:27AM

కరోనాకూ కులమతాలున్నాయి!

ప్రజలకు సక్రమ మార్గంలో నిర్దిష్టంగా దిశ నిర్దేశించాల్సిన ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళు, అది కూడా తక్షణ సత్వర సమాధానాల కోసం వెతుకున్న సమయంలో, కరోనాకు నియో లిబరలిజానికీ లింకు పెడుతూ అమూర్తంగా వ్యాసాలు రాయడం చింతాకరం. హక్కుల నాయకుడిగా చాలా యాంత్రికంగా ‘నియో లిబరలిజం’ అంటూ గుప్పించిన ఆ వ్యాసం నిరాశాకరం, నిరుపయోగం!


కరోనాకు నియో లిబరలిజానికి లింకు పెడుతూ ప్రొఫెసర్ హరగోపాల్ ఒక వ్యాసం రాసారు (ఆంధ్రజ్యోతి, మే 6, 2020). అయితే యుద్ధంచేసి వచ్చిన వీరుడు స్నానాల గచ్చు దగ్గర చతికిల పడ్డట్టుగా ఆ విశ్లేషణ మొత్తం కొనసాగింది. కొన్ని ముఖ్యమైన పాయింట్లు చూద్దాం. వ్యక్తిని, ఒక యూనిట్ కేంద్రంగా మలిచి స్వార్థపూరితంగా చిత్రీకరించే నియో లిబరలిజం, వ్యక్తులను విడగొట్టిన కరోనాకు అవినాభావ సంబంధం ఉంది అని; భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఒక సవాల్‌గా నియో లిబరలిజం చేసినట్లే కరోనాకూడా చేసిందనే పోలికలతో వ్యాసం మొదలయింది. మొదటగా నియో లిబరలిజం అనే కాన్సెప్ట్ చూద్దాం.


ఈ నియో లిబరలిజం అనేది Great Depression, రెండో యుద్ధ ప్రపంచం తర్వాత పుంజుకున్న ఒక థియరీ. వ్యక్తులు స్వార్థ పూరితంగా ఉంటారని, వాళ్ళు అమ్మడం ద్వారా కొనడం ద్వారా మాత్రమే సమాజాన్ని సృష్టిస్తారని, ప్రభుత్వం మాత్రం కేవలం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మునిగి పోవాలని, ఏ వ్యక్తి ఎలా ఉంటే, ఏ వ్యక్తి ఏది ఎన్నుకుంటే అలా ప్రజాస్వామికంగా సమాజ జీవితం గడిచిపోతుందని తెలిపే ఒక ఫిలసాఫికల్ కాన్సెప్ట్ ఇది. దీనికీ కరోనాకే కాదు, మనింటి పక్కన ఉండే కిరాణా స్టోర్ సామానులకు కూడా సంబంధం ఉంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. మనింటి కప్పు వానకు లేచిపోతే అందుకు కారణం నియో లిబరలిజానికి లింకు పెట్టవచ్చు. అయితే సమస్యకు సమాధానం ఎక్కడుంది? ఎక్కడ తక్షణంగా చూడాలి అనే డైరెక్షన్ మనకు కావాల్సింది. అదీ ముఖ్యంగా హక్కుల యోధులుగా పరిగణించబడే వాళ్ళ నుండి. రోహిత్ చావుకు సామ్రాజ్యవాదం కారణమని విరసం సభలో ఒక వక్త సెలవిచ్చాడు. 90% కోరిలేషన్ ఉన్న ఒక విషయాన్ని వదిలేసి, 10% కోరిలేషన్ ఉన్న విషయాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించడంలో ఉంది చిక్కంతా.


చైనా ఎక్కడ? ములుగు ఎక్కడ? ఈ రోజు అక్కడి నుండీ ఇక్కడికి వైరస్ వచ్చిందంటే ఈ ప్రపంచీకరణలో వస్తువులు మనుషులు సర్వీసులు ఎంత త్వరితంగా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే విషయం ప్రాక్టికల్‌గా తెలిసొస్తోంది. అది మనం పాటించిన నియో లిబరలిజంలో భాగమైన గ్లోబలైజేషన్ వల్లనే జరుగుతుంది. ఇది కొత్తగా ప్రూవ్ చేసేదేమీ లేదు. ఏ సామాజిక సమస్య కూడా ఒకే ఒక్క కారణంతో చుట్టపడి ఉండదు. ఈ తరహా ఎనాలిసిస్‌లో ఉండే సమస్య ఏమంటే ప్రధాన తక్షణ కోణాన్ని విస్మరించి, ఒక బాదరాయణ సంబంధంతో abstractగా లింకప్ చేయడం జరుగుతుంది.


నియో లిబరలిజం భౌతిక దూరాన్ని కాస్తా సామాజిక దూరంగా మలిచి అలా పాటించమని చెప్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ విశ్లేషించారు. అసలు సామాజిక దూరం అనే పదం వాడ కూడదని, భౌతిక దూరమనే పదమే వాడాలని, అలానే అర్థం చేసుకోవాలని, ఒక మనిషి ఇంకో మనిషితో కలిసి నవ్వడంలోనూ, కుటుంబంతో గడపడంలోనూ ఎటువంటి తేడాలకు సంబంధించిన విషయం కాదని గత నెల 17న ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇప్పుడు కొత్తగా ఈ ‘భాషా ప్రయోగం’ గురించి మాట్లాడేదేముంది? ఈ దేశం సామాజిక దూరం అనే భాషతో సౌకర్యంగా ఉంటే, దానిని ఇక్కడి ప్రభుత్వ అధికారులు ప్రభావితమైన మెజారిటేరియనిస్ట్ భావజాలం సమర్థిస్తే అదే భాష వాడుతారు ఇక. భారత దేశం, ఇండియా లాంటి పదాలు వదిలేసి హిందుస్తాన్ అనే పదం ఎంచుకోగలిగే పార్టీలు, ప్రభుత్వాలు ఇక్కడ ఎందుకు మందకొడిగా ఆలోచిస్తున్నాయి అన్న విషయం మనం ప్రధానంగా ఆలోచించాలి. సుప్రీంకోర్టులో ఇది కుల హీనతకు, వ్యక్తిగత హీనతకు సంబంధించిన భావ జాలాన్ని స్వరూపిస్తుందని ఇటువంటి భాష వాడరాదు అని అప్పీల్ ఇప్పటికే ఉంది. అయితే ఆ అప్పీల్ నియో లిబరలిజంకు వ్యతిరేకంగా చేసిన అప్పీల్ కాదు. ఇక్కడి తక్షణ పరిస్థితులల్లో భాష వ్యక్తీకరణలో ఉన్న సామాజిక బేధాల గురించి వేసిన అప్పీల్ అది. ఇంత విశ్లేషణ రాసిన హక్కుల ఉద్యమ నాయకుడు ఈ పదజాలం ఇక్కడి మెజారిటేరియనిస్ట్ సంస్కృతికి సంబధించింది అని ఒక్క ముక్క రాయలేకపోయారు.


వలస కార్మికులు నియో లిబరలిజం వలన దెబ్బ తిన్నారు అని ఇంకో ఎనాలిసిస్. ఇప్పుడు ఎవరిని నిందించాలి ఈ విషయమై? ముఖేశ్ అంబానీనా? లేకపోతే ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్‌్గనా? ప్రతి సంవత్సరం కోటికి పైగా వలస కార్మికులు (ఇది కేవలం రైల్వే డేటా ఆధారంగా మాత్రమే) మన దేశంలో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వలస వెళ్ళుతున్నారు. ఈ విషయం స్వయాన అప్పటి ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడైన ఆరవింద్ సుబ్రమణ్యం తన పుస్తకంలో రాసాడు. రోడ్డు ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పెరగడంతో ఎక్కడ కూలీల కొదవుందో అక్కడికి మనుష్యుల గమనం మొదలయ్యింది. వాళ్ళ సమస్యను విస్మరించి ప్రభుత్వం లాక్‌డౌన్ ఎలా ప్రకటించిందో, వాళ్ళ సమస్యలను విస్మరించి ప్రభుత్వం ఎలా డీ మానిటైజేషన్‌ను ప్రకటించిందో ఇలాంటి విశ్లేషణ మనకు తక్షణ అవసరం. దీని లోతు పాతులు ప్రజలకు తెలియజేయడం ముఖ్యంగా హక్కుల నాయకుల విధి.


ఈ వ్యాసంలో అంతే కాక కొన్ని ప్రిమెచ్యూర్ వ్యాఖ్యానాలున్నాయి. ‘ప్రకృతిని పూజించే దశ నుండి శాసించే దశకు’ అని విశ్లేషణ చేస్తారు ఒక చోట. ప్రకృతిని పూజించడం అంటే -హాస్పిటల్ మీద పూలు జల్లడం లాంటి అర్థమా? ప్రకృతిని పూజించడం అంటే ప్రకృతిని శ్రద్ధగా కాపాడుకునే ఒక ఉద్దేశ్యపూర్వకమైన శక్తిపూర్వకమైన ఆచరణగా ఉండాలి కదా? అలా ఇక్కడి బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థలో ఉందా ఎప్పుడన్నా? ఈ భారత దేశంలో ఉండే మౌలిక పరిస్థితులు తెలిసి కూడా ప్రకృతిని పూజించడం ఒక గ్లోరియస్ చర్యగా ఎలా అభివర్ణించారో అర్థం కాదు.


ఇక సమాప్తి పేరా మొత్తం మనుష్యులంతా సమానులుగా జీవిద్దాం, ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండేట్టు ఉందాము టైపులో ఎటువంటి tangibility లేని కొన్ని యూనివర్సల్ నియమాలతో కూడిన కంక్లూజన్స్ ఇచ్చి వదిలేసారు. అసలు ముందు వరుసలో ఉన్న ఒక హక్కుల నాయకుడిగా ప్రొఫెసర్ హర గోపాల్ నుండి ఊహించని ప్రిమెచ్యూర్ వ్యాసం ఇది. కళ్ల ముందు కనిపించే విషయాలు వదిలేసి, రంగు రుచి స్పర్శ లేని సమాధానాన్ని వెతకడం జరిగింది ఇందులో. ఈ నాటి పరిస్థితుల్లో కరోనాకు కులముంది, మతముంది. ఇది అడ్డం పెట్టుకుని కమ్యూనలిజంను వ్యాపింపజేస్తున్నారు. మనుష్యులు రోజు రోజుకు పిట్టల్లా చనిపోతున్నారు. మనుష్యులను సక్రమ మార్గంలో నిర్దిష్టంగా దిశ నిర్దేశించాల్సిన వాళ్ళు, అది కూడా తక్షణ సత్వర సమాధానాల కోసం వెతుకున్న సమయంలో, ఇలా అమూర్తంగా వ్యాసాలు రాయడం చింతాకరం. హక్కుల నాయకుడిగా చాలా యాంత్రికంగా ‘నియో లిబరలిజం’ అంటూ గుప్పించిన ఆ వ్యాసం నిరాశాకరం, నిరుపయోగం!

పి విక్టర్ విజయ్‌కుమార్

Advertisement
Advertisement
Advertisement