Abn logo
Jul 15 2020 @ 03:39AM

కరోనా పంజా

జిల్లాఅంతటా వైరస్‌ విలయతాండవం

జిల్లాలో ఒకే రోజు 305 మందికి పాజిటివ్‌ 

బాపట్లలో ఓ డాక్టర్‌కు, ఓ కానిస్టేబుల్‌కు కరోనా

గుంటూరులో ఓ బ్యాంకు మేనేజర్‌కు పాజిటివ్‌.. 

గుంటూరులో 107, తెనాలిలో 58, మంగళగిరిలో 38 కేసులు

కోటప్పకొండలో ఇద్దరు పూజారులకు వైరస్‌.. 18 వరకు దర్శనం నిలిపివేత


ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌, జూలై 14: జిల్లాపై కరోనా పంజా విసిరింది. అక్కడాఇక్కడా అన్న తేడా లేకుండా జిల్లా అంతటా వైరస్‌ విలయం సృష్టిస్తోంది. జిల్లాలో మంగళవారం ఏకంగా 305 కేసులు నమోయ్యాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం మంగళవారం గుంటూరు నగర పరిధిలో 107, నరసరావుపేటలో 25, మంగళగిరిలో 38, తెనాలిలో 58 కేసులు వెలుగు చూశాయి. వరుసగా రెండో రోజు కూడా జిల్లాలో 300పై చిలుకు కరోనా కేసులు వెలుగు చూడటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. గుంటూరులోని ఓ జాతీయ బ్యాంకు మేనేజర్‌కు కరోనా సోకింది.  దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  బ్యాంకు సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. మంగళవారం నుంచే బ్యాంకు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సిబ్బంది పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత బ్యాంకు సేవలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. మంగళవారం నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే గుంటూరు నగర పరిధిలో.. అడవితక్కెళ్లపాడు, అంకిరెడ్డిపాలెం, ఏటీఅగ్రహారం, డీఎస్‌నగర్‌, శ్యామలానగర్‌, చుట్టుగుంట, రామనామక్షేత్రం, కోదండరామయ్యనగర్‌, రాఘవనగర్‌, ఆర్టీసీ కాలనీ, యతిరాజులకాలనీ, రామన్నపేట, ప్రకాష్‌ నగర్‌, పట్టాభిపురం, ఇన్నర్‌రింగ్‌ రోడ్‌లో ఒక్కొక్క కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భారత్‌పేట, కన్నావారితోట, ఐపీడీకాలనీ, సంజీవయ్యనగర్‌, మణిపురం, ముత్యాలరెడ్డినగర్‌, గుజ్జనగుండ్లలో రెండేసి కేసులు, పాతగుంటూరు, కేవీపీకాలనీ, కొత్తపేట, సంగడిగుంటలో మూడేసి, నల్లపాడు, నల్లచెరువు, రామిరెడ్డితోటలో నాలుగేసి, గుంటూరువారితోటలో 8 కేసులు నమోదయ్యాయి.


గుంటూరులో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో కర్నాటక రాష్ట్రం నుంచి వచ్చిన ఒక వ్యక్తితోపాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న మరో ఎనిమిది మందికి కూడా వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. జిల్లాలోని చేబ్రోలు, కాకుమాను, మేడికొండూరు, పెదకాకాని, పొన్నూరు, రొంపిచెర్ల, వెల్దుర్తిలో ఒక్కొక్క కేసు, బాపట్ల, ముప్పాళ్ల, నూజెండ్ల, ఫిరంగిపురం, తాడేపల్లి, చుండూరులో రెండేసి, బొల్లాపల్లి, కారంపూడి, నాదెండ్ల, శావల్యాపురం, తాడికొండ, వట్టిచెరుకూరులో మూడేసి కేసులు, పిడుగురాళ్ల, వినుకొండలో నాలుగేసి కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేటలో 5 కేసులు, ప్రత్తిపాడులో 6, కేసులు, సత్తెనపల్లిలో 8 కేసులు, దాచేపల్లిలో 13 కేసులను అధికారులు నిర్ధారించారు. 


- మంగళగిరి పట్టణం, మండల పరిధిలో 35 కేసులు నమోదైనట్టు డాక్టర్‌ అంబటి వెంకటరావు తెలిపారు. మండలంలోని కురగల్లు ఓ గర్భిణికి, చినకాకాని, కాజల్లో ఒక్కొక్కరికి, ఎర్రబాలెంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 


 - తాడేపల్లిలో రెండు  కేసులు నమోదయ్యాయి. డోలాస్‌ నగర్‌లో 60 ఏళ్ళు పైబడిన వారికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 


- వట్టిచెరుకూరు మండలం యామర్రులో ఓ సచివాలయ ఉద్యోగికి, ఓ వలంటీర్‌కు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నాగిరెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగి గుంటూరులో ఉంటాడని తెలిపారు.  


- పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఐదుగురికి, కాకానిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు.  


- తాడికొండ మండలం తాడికొండ గ్రామంలో మూడు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మంగళగిరి పానకాలస్వామి గుడి వద్ద చెప్పుల స్టాండ్‌ నిర్వహిస్తున్న కంతేరు రోడ్డులో నివాసం ఉంటే ఓ మహిళకు, కొప్పురావూరు పోస్టాఫీస్‌లో పనిచేసే వ్యక్తికి, పరిమిరోడ్డులోని ఎస్టీ ఏరియాకు చెందిన ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.  


- వినుకొండ పట్టణంలో 15 కేసులు నమోదయ్యాయి. స్థానిక ఎన్‌ఎస్పీ కాలనీలో హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారి కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో వ్యాపారాలతో పాటు పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక పట్టణంలోని మేదరబజారు, పాతమార్కెట్‌బజారు, కోటనల్సా బజారు, డబ్బాస్థంభం సెంటర్‌, పున్నమిటవర్స్‌, విటంరాజుపల్లిలో ఒక్కొక్కరికి, ఆగబావిజబారులో, పాటిమీదబజారు, బాలమ్మబజారుల్లో ముగ్గురికి చొప్పున పాజిటివ్‌ వచ్చినట్లు ఆర్‌ఐ జానీబాషా తెలిపారు.  


- నూజెండ్ల మండలం ముక్కెళ్ళపాడులో తండ్రీకుమారులకు కరోనా వచ్చింది. వీరిద్దరూ వినుకొండలో విత్తనాలు అమ్మే దుకాణంలో పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. శావల్యాపురం మండలం వేల్పూరులో మూడు కేసులు వచ్చినట్లు  తహసీల్దారు సుజాత తెలిపారు. 


- ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో గతంలో తండ్రికి కరోనా పాజిటివ్‌ రాగా ఇప్పుడు కుమారుడికి పాజిటివ్‌గా నిర్ధారించారు. లంకెలకూరపాడులో ఓ వ్యక్తికి కరోనా వచ్చింది.  


- కారంపూడి మండలంలో మూడు కేసులు నమోదైనట్లు ఎస్‌ఐ రవికృష్ణ తెలిపారు. కారంపూడిలో ఇద్దరు, పేటసన్నిగండ్లలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది.  


- బాపట్ల 11వ వార్డులో ఓ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ భాస్కరరావు తెలిపారు. విధుల్లో భాగంగా నిందితులను తెనాలి వైద్యశాలకు తీసుకెళ్లే క్రమంలో వైరస్‌ సోకి ఉండవచ్చన్నారు. ఇస్లాంపేటకు చెందిన కర్లపాలెం మండలంలో పని చేసే ఓ వైద్యురాలికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. స్టూవర్టుపురంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు మానసప్రియదర్శిని తెలిపారు. ఈ వ్యక్తి ప్రకాశంజిల్లా చీరాల ఐఎల్‌టీడీ కంపెనీలో పనిచేసేవాడని తెలిపారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న 30 మందికి పరీక్షలను నిర్వహించామన్నారు.


- సత్తెనపల్లిలో నాలుగు కేసులు నమోదైనట్లు కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. పాలవెంకాయమ్మ బజారు, భావనాఋషి బజారు, క్రిస్టియన్‌పేటల్లో ఒక్కొక్క కేసు వచ్చిందన్నారు. పట్టణ పోలీస్టేషన్‌లో ఓ కానిస్టేబుల్‌కు కూడా పాజిటివ్‌ వచ్చిందన్నారు. కానిస్టేబుల్‌ తాడేపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడని అక్కడి నుంచే ఐసోలేషన్‌కు వెళ్లినట్లు  తెలిపారు. మండలంలోని పెదమక్కెనలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్‌ శేషుయాదవ్‌ తెలిపారు.  


- పిడుగురాళ్లలో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాబ్యాంకు ఎదురువీధిలో, జానపాడులో, తహసీల్దారు కార్యాలయంలో ఓ వీఆర్వోకు,  బ్రాహ్మణపల్లిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. 


- రాజుపాలెం మండలం మొక్కపాడులో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి భువనేశ్వరి తెలిపారు. ఇతడు నరసరావుపేటలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ వారానికి ఒకసారి మొక్కపాడు వచ్చిపోతుంటాడన్నారు.


- పొన్నూరులోని 22 వార్డుకు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు మున్సిపల్‌ కమిషనరు పాయసం వెంకటేశ్వరరావు తెలిపారు. ఇతడు తెనాలి మున్సిపల్‌ కార్యాలయంలోని టిడ్కో విభాగంలో పని చేస్తారన్నారు. కాకుమాను మండలం రేటూరులో తొలి కేసు నమోదైనట్లు తహసీల్దారు వెంకటేశ్వర్లు తెలిపారు. పెదనందిపాడు మండలం అన్నవరంలో ఓ వృద్ధుడికి, ప్రత్తిపాడులో ఓ మెడికల్‌ షాపు యజమానికి, మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. నకరికల్లు మండలం రూపెనగుంట్లలో ఒకరికి, చీమలమర్రిలో ఒకరికి కరోనా వచ్చింది. రొంపిచర్ల మండలం రొంపిచర్లలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. రెంటచింతల మండలం సత్రశాలోని టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో ఓ ఇంజనీర్‌కు పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ హుస్యానాయక్‌ చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 10 మంది గర్భిణులు, 17 మంది సత్రశాల జెన్‌కో ఉద్యోగులతో పాటు మరో 8 మందికి మంగళవారం స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించినట్లు సూపర్‌వైజర్‌ కందిమళ్ల నాగరాజు చెప్పారు.


- యడ్లపాడు మండలం జాలాది గ్రామంలో ఆదివారం రాత్రి మృతి చెందిన ఓ వృద్ధుడికి పాజిటివ్‌గా అధికారులు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న ఇతడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మృతి చెందగా కరోనా పరీక్షలు నిమిత్తం నమూనాలను సేకరించి మృతదేహాన్ని అప్పటించారు. అయితే మృతదేహాన్ని స్థానికులు గ్రామంలోకి రానివ్వక పోవడంతో గుంటూరులో అంత్యక్రియలు చేశారు. అయితే మంగళవారం వెల్లడైన వైద్య నివేదికల్లో అతడికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. గ్రామంలో అతడితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరించి వారికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

Advertisement
Advertisement
Advertisement