Abn logo
May 15 2020 @ 00:47AM

వృత్తి నైపుణ్యాలే జీవన సోపానాలు

నైపుణ్యాలున్న యువతకు ప్రాంతంతో, భాషతో సంబంధం లేదు; పనిని వెతుక్కుంటూ ఎల్లలు లేకుండా వలస వెళ్ళుతుంది. తెలంగాణలో లక్షల సంఖ్యలో వున్న వలస కార్మికులు, ఒడిషాలోని కేంద్రపార జిల్లాకు చెందిన ప్లంబర్ల వృత్తి సాఫల్యాలు ఈ కరోనా కల్లోల సమయంలో మన యువతకు కొత్తపాఠాన్ని చెబుతున్నాయనడంలో సందేహం లేదు. ఆ వృత్తిదారుల స్ఫూర్తితో శ్రమను గౌరవిస్తే అనేక వృత్తులను ధునికీకరించుకుని ముందుకు సాగవచ్చును. ఈ పని అత్యవసరంగా చేయవలసిఉంది.


ఏదేశమైతే ఉత్పాదక రంగాలలోకి యువతను తీసుకుపోతుందో ఆ దేశమే నిరుద్యోగాన్ని చాలవరకు అధిగమిస్తుంది. ప్రపంచంలో ఎక్కడాలేనంత యువశక్తి మనదేశంలోనే ఉంది. ఆ యువత ఉత్పాదన రంగాల వైపు మళ్లితే మొత్తం ప్రపంచానికి కావాల్సిన ఉత్పత్తులను మనమే అందించగలం. నిరుద్యోగ మహమ్మారిని దేశం జయిస్తుంది. నైపుణ్యమున్న యువత తన పనిని వెతుక్కుంటూ ఎల్లలులేకుండా వలస వెళ్ళిపోతుంది. మన యువత వలసలద్వారా ఒక రాష్ట్రంనుంచి మరొక రాష్ట్రానికి, మాతృ దేశంనుంచి మరొక దేశానికి వెళ్లిపోతున్నది. కొన్ని ప్రాంతాలలోని యువత తాము నేర్చుకున్న నైపుణ్యాలతో దేశవ్యాపితంగా విస్తరించారు. నైపుణ్యాలున్న యువతకు ప్రాంతంతో, భాషతో సంబంధం లేదు. మరి మన ఉత్పాదక రంగాలకు అత్యవసరంగా ఇలాంటి నిపుణ యువజనులే కావాలి. 


కొవిడ్‌-19 వైరస్‌ విజృంభణతో వలస సమస్య ప్రధాన సమస్యగా ముందుకువచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు అన్ని రాష్ట్రాలలో ఎక్కడివారక్కడ ఉండిపోయారు. అదిప్పుడు అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక సమస్యగా పరిణమించింది. ఇట్లా వలసలు వచ్చినవాళ్లు కొన్ని వృత్తుల్లో స్థిరపడిపోయారు. ఆ వృత్తుల్లోకి వచ్చినవారు తమకాళ్లపై తామునిలబడి సంపాదించుకోగలుగుతున్నారు. ప్లంబింగ్‌ పనులలో నైపుణ్యం పొంది ఆ పనిలో రాణించిన వారికి సంపాదన బాగానే ఉంది. భవననిర్మాణ కార్మికులు, ప్లంబింగ్‌, ఎలక్ట్రీసియన్స్‌, పెయింటర్స్‌, వడ్రంగులు, గ్రానైట్‌, వ్యవసాయ రంగంలో, హార్వెస్టర్‌ యంత్రాలు, ట్రాక్టర్స్‌, వ్యవసాయ పనిముట్లు రిపేర్‌ చేసే మెకానిక్‌లు ఇత్యాది వృత్తినిపుణులైన యువ కార్మికులు ఒక్క తెలంగాణలోనే నాలుగు నుంచి ఆరులక్షల మంది దాకా ఉన్నారు. వీళ్లంతా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు.


ఈ నేపధ్యంలో ప్లంబింగ్‌ పనులకు సంబంధించి ఒడిషా రాష్ట్రంలోని ‘కేంద్రపార’ జిల్లా నుంచే 1 లక్ష నుండి 1.5 లక్షలవరకు ప్లంబర్‌లు ఉన్నారు. వీళ్లు ‘కేంద్రపార’ నుండి దేశంలోని అన్నిప్రాంతాలకు విస్తరించారు. 25వేల మంది ప్లంబర్‌లు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. ప్లంబింగ్‌ పనులు చేసేవారికోసం కేంద్రపార జిల్లాలో ఒక శిక్షణా సంస్థను నెలకొల్పారు. ప్లంబింగ్‌ రంగానికే నమూనాగా ఆ జిల్లా వెలుగొందుతుందనడంలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్‌ మహానగరంలో ‘కేంద్రపార’ నుంచి వచ్చిన యువత ప్లంబింగ్‌ వృత్తిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యార్హతలు అవసరమైన రంగాల్లోని యువత సంపాదనతో సమానంగా ఈ వృత్తిలో వాళ్లూ సంపాదిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నై మహానగరాలు ఉత్తరభారతంలోని ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడాలలో ‘కేంద్రపార’ ప్లంబర్‌లది ప్రత్యేకస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పనివారి సహాయార్థం ‘కేంద్రపార’ లో వున్న స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్‌ ప్లంబింగ్‌ టెక్నాలజీ (సిప్ట్‌)లో ఒక ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేశారు. ‘కేంద్రపార’, పట్టాముండై రాజ్‌నగర్‌, రాజ్కానికా బ్లాకులనుండి లక్షమందికిపైగా ప్లంబర్‌లు దేశ దేశాల్లో సేవలందిస్తున్నారు. దేశ ప్లంబింగ్‌ రాజధానిగా ‘కేంద్రపార’ ప్రసిద్ధి కెక్కింది. 


ఒక సాధారణ గ్రాడ్యుయేట్‌ నెలకు 10వేల రూపాయలు సంపాదిస్తే, ఒక ప్లంబరు నెలకు 20వేల వరకు సంపాదిస్తాడు. ఈ వృత్తిని మార్కెట్‌ చేయగల నైపుణ్యం (కేంద్రపార జిల్లాలో పట్టాముండై ఒక రెవిన్యూబ్లాక్‌ స్థాయిగల మునిసిపాలిటీ)కి వున్నది. ‘కేంద్రపార’ జిల్లానుంచే ఈ ప్లంబర్‌లు అధికంగా రావటానికి కారణం పట్టాముండైలో ‘స్టేట్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లంబింగ్‌ టెక్నాలజీ’ (స్పిట్‌) వల్లనే అని చెప్పవచ్చును. లండన్‌లో ఒక గ్రాడ్యుయేట్‌ సగటు జీతం 27,000 పౌండ్లు అయితే ప్లంబరు జీతం 34,885 పౌండ్లు అని తెలుస్తుంది. దేశంలో ఎక్కడ వరదలు వచ్చినా కేంద్రపార జిల్లానుంచి ప్లంబర్‌లు రావాల్సిందే. ఇటీవల కేరళలో వరదతాకిడి తర్వాత పునర్నిర్మాణ ప్రక్రియలో కేంద్రపార ప్లంబర్‌లు కీలకంగా పనిచేశారు. తాగునీరు, మురుగునీటి పైపులైన్‌లు మరమత్తులు చేశారు. 2014లో కశ్మీర్‌లోయలోని కుండపోత వర్షంలో కూడా కేంద్రపార ప్లంబర్‌లు పని చేశారు.


దేశవిభజన సమయంలో కలకత్తాలో పనిచేసే ముస్లిం ప్లంబర్‌లు తూర్పు పాకిస్తాన్‌(బంగ్లాదేశ్‌), పశ్చిమ పాకిస్తాన్‌ (పాకిస్తాన్‌) లకు వలసపోయారు. కేంద్రపార జిల్లా బచారా గ్రామానికి చెందిన ప్లంబర్‌లే కలకత్తాలో ఉండి ప్లంబింగ్‌ పనులు కొనసాగించి ఆనాటి బ్రిటీష్‌ కంపెనీల దగ్గర ప్రావీణ్యంగల ప్లంబర్‌లుగా గుర్తింపు పొందారు. గొట్టపు బావులను తవ్వటమే గాకుండా ఈ ప్లంబర్లు పైపులైన్లు పారిశుద్ధ్యం, సురక్షితమైన తాగునీటికి సహకారం అందిస్తారు. గల్ఫ్‌లో ఒక ప్లంబర్‌ నెలకు 50వేల నుంచి ఒక లక్ష వరకు సంపాదిస్తారు. మనదగ్గర కూడా 15వేలనుంచి 50వేల వరకు సంపాదించే ఫ్లంబర్లున్నారు. ఇరాక్‌, పశ్చిమ ఆసియా వెళ్లి ఈ వృత్తిలో పనిచేస్తున్నారు. 1990లో నిర్మాణరంగాలలో పనిచేయటానికి యూరోపియన్‌ దేశాలకు వలసపోయారు. ప్రస్తుతం దేశవ్యాపితంగా 2,50,000 మంది ప్లంబర్లు ఉన్నారు. మన ప్రస్తుత అవసరాలకు గాను దాదాపు పన్నెండు లక్షల మంది శిక్షణ పొందిన ప్లంబర్‌లు అవసరమవుతారనేది ఒక అంచనా. కేంద్రపార జిల్లాలోని ఉనాయ్‌భితార్కానికా నేషనల్‌ పార్క్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రపంచం నలుమూలలనుంచి ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లను చూడటానికి వస్తారు. అలాగే ఆ ప్రదేశం ప్లంబర్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 50వేల జనాభావున్న పట్టాముండైలో 14 బ్యాంకు శాఖలున్నాయంటే ఆలోచించండి. ప్లంబింగ్‌ వృత్తి ఆ ప్రాంతానికి మానవ సంపదగా మారింది. 


కేంద్ర పారకు చెందిన ఎంతోమంది ప్లంబర్లు తెలంగాణలో పనిచేస్తున్నారు. మన రాష్ట్ర ఐ ఏ ఎస్‌ అధికారి బి.పి.ఆచార్య తాతగారు 1955లో కలకత్తాలో ఛీప్‌ఇంజనీర్‌గా పనిచేశారు. ఒరిస్సా రాష్ట్రంనుంచి వలసవచ్చిన ఈ వృత్తిపనివారల గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన ఈ వ్యాసకర్తతో చర్చించారు. ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్లు ప్లంబింగ్‌ పనులలోనే కాక వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో మన వ్యవసాయ క్షేత్రాలలో కూలీలుగా కూడా పని చేస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందినవాళ్లు అన్నిరంగాలలో పలునైపుణ్యాలు సంపాదించి గల్ఫ్ తదితర దేశాలకు వెళ్ళడం కద్దు. అయితే కేరళకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవాళ్లు పలు రంగాలలో పనిచేస్తున్నారు. ఇపుడు సి.బి.ఎస్‌.ఇ. పాఠశాలల్లో ఈ వలసకార్మికుల పిల్లలే ఫస్ట్‌ర్యాంకర్లుగా వచ్చారు. హైదరాబాద్‌నగరానికి యు.పి, బిహార్‌ నుంచి వచ్చిన వాళ్లు కార్పెంటర్‌ పనుల్లో వేలసంఖ్యలో పనిచేస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో స్టీలు పనుల విషయంలో పలు రాష్ట్రాల వాళ్లు పనిచేస్తున్నారు. ఖమ్మంలో ఒక్క గ్రానైట్‌ రంగంలోనే లక్షకు పైగా యువత ఉత్తరాది నుంచి వచ్చి పనిచేస్తున్నారు. కరోనా కల్లోల సమయంలో తెలంగాణ యువతకు కొత్తపాఠాన్ని చెబుతున్నాయి.


తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది ఇంజనీరింగ్‌ పూర్తిచేసుకున్న లక్షలాది మందిలో 5శాతం మాత్రమే నైపుణ్యాలు పొంది దేశవిదేశాలకు వెళ్ళుతున్నారు. 90శాతం మంది గత రెండు దశాబ్దాలుగా తీవ్ర నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. గత రెండుమూడు దశాబ్దాలుగా ఇంజనీరింగ్‌, సాంప్రదాయ డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నారు. నిరుద్యోగ సైన్యంగా మారారు. ఇందుకు కారణాలు ఏమైతేనేం ప్రస్తుతం ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కోవాలన్నదే మనముందున్నది. ఈ సమస్య పరిష్కారానికై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దార్శనికునిగా ఆలోచనలు చేస్తున్నారు. జీవనాధారమైన వ్యవసాయరంగానికి నీళ్లు అందించి కరువునేలలను పచ్చటి పసిడిభూములుగా మార్చుకుంటున్నాం. అయితే వ్యవసాయధారిత పరిశ్రమలను ఇంకా నెలకొల్పుకోవలసి ఉంది.

ప్రధానంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాలలోకి తెలంగాణ యువత పెద్దఎత్తున రావలసిఉంది. సాంప్రదాయ డిగ్రీలు, ఇంజనీరింగ్‌ చదువులు పూర్తిచేసుకున్న యువత ఐటి రంగంలోకిపోతుంది. అయినా అందరూ ఐటీ రంగానికే పోలేరు కదా. గ్రామీణ ప్రాంతాలలో డిగ్రీలు పూర్తిచేయని యువత వివిధ వృత్తి నైపుణ్యాలను నేర్చుకుని నిలదొక్కుకోవాలి. వ్యవసాయరంగానికి అనుబంధంగా ఏఏ నైపుణ్యాలు అవసరం ఉంది? గ్రామీణ ప్రాంతాల యువత ఏంచేయాలి? ఐటీలో చాలా వరకు మనం సక్సెస్‌ అయ్యాం. మిగతారంగాల్లోకి విస్తరించాలి. ఈ నేపథ్యంలోనే ఒరిస్సాలోని కేంద్రపార జిల్లా నుంచి వచ్చిన ప్లంబర్‌ వృత్తిదారుల నైపుణ్యాలను అంచనావేసుకుని అడుగులువేయాలి. 


ఈ తరం యువతలో శ్రమజీవితం పట్ల, శ్రమశక్తుల పట్ల గౌరవం పెరగాలి. శ్రమ సంస్కృతి అలవడాలి. బాగా కష్టించే తత్త్వం ప్రతి ఒక్క యువకుడు, యువతిలో వేళ్ళూనుకోవాలి. ఈ శ్రమ సంస్కృతి వైపు యువతను మళ్లించలేకపోతే భవిష్యత్తులో దేశం భారీమూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. వృత్తినైపుణ్యాలను ఆధునికీకరించుకుని ఈ కాలానికి కావాల్సిన ఉత్పత్తులను తయారుచేసే స్వయంసమృద్ధ శిక్షణలు పొందాలి. చేసే పనిపైన గౌరవం పెరగాలంటే శ్రమసంస్కృతిని పాఠశాల స్థాయినుంచే వాళ్లకు అలవడేటట్లు చేయాలి. ఈ అంశాలపై యువత మదిలోకి పోయే పాఠ్యాంశాలను చేర్చాలి. శ్రమశక్తులపై గౌరవం కలిగించే సిలబస్‌లను తయారుచేయాలి. ప్లంబర్‌ పని, ఇంజనీరింగ్‌ పని రెండూ సమానమైనవన్న గుర్తింపును సమాజం ఇవ్వగలగాలి. వ్యవసాయం గొప్ప వృత్తి. అది అన్నం బెట్టి ఆకలి తీర్చే మహత్తర పని. వ్యవసాయం మన సంస్కృతి అన్న ఎరుక ఈ తరం వారికి కలిగితే వాళ్లు తప్పకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లోకి పోతారు. ఆ దిశగా పరిశోధనలూ చేస్తారు. శ్రమను గౌరవిస్తే అనేక వృత్తులను ఆధునికీకరించుకుని ముందుకు సాగవచ్చును. ఈ పని అత్యవసరంగా చేయవలసిఉంది.

బోయినపల్లి వినోద్‌కుమార్‌

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు

Advertisement
Advertisement
Advertisement