Abn logo
Mar 26 2020 @ 12:20PM

అమెరికా వెళ్లలేక... ఇండియా రాలేక

అబుదాబి ఎయిర్‌పోర్టులో నిస్సహాయ స్థితిలో గోకవరం వాసి 


గోకవరం(తూర్పు గోదావరి): కరోనా వైరస్‌ విదేశాల్లో ఉద్యోగాలు చేసే వ్యక్తుల పాలిట శాపంగా మారింది. అటు ఉద్యోగంచేసే ప్రాంతానికి వెళ్లలేక ఇటు స్వదేశంలో ఉన్న కుటుంబసభ్యుల వద్దకు చేరుకోలేక మధ్యలో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కొందరు. ఆ కోవకు చెందిన వ్యక్తే గోకవరానికి చెందిన దొంతల అజయ్‌కిరణ్‌. ఇతడు సుమారు ఎనిమిదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 8న బంధువుల ఇంటిలో జరిగే వివాహ కార్యక్రమం నిమిత్తం గోకవరం వచ్చాడు. 21న తిరిగి అమెరికా పయనమయ్యాడు. అయితే కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో మధ్యలో అబుదాబి ఎయిర్‌పోర్టులో చిక్కుకున్నాడు.


అక్కడ అజయ్‌ను ఐసొలేషన్‌ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు చేశారు. నెగెటివ్‌ రిపోర్టు రావడంతో తిరిగి ఇండియా వెళ్లిపొమ్మని అక్కడి అధికారులు సూచించారు. కానీ విమానాలు లేక అటు అమెరికా వెళ్లలేక, స్వదేశం రాలేక అబుదాబి ఎయిర్‌పోర్టులో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. తనను ఇండియా తీసుకొచ్చే ఏర్పాట్లుచేయాలని అజయ్‌ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

Advertisement
Advertisement
Advertisement