Abn logo
Oct 13 2021 @ 00:06AM

పత్తి వనంలో గంజాయి

యాచారం గ్రామ శివారులో పత్తి పంటలో గంజాయి మొక్కలను గుర్తించిన అధికారులు

సదాశివనగర్‌, జుక్కల్‌లలో పత్తి పంటలో సాగవుతున్న గంజాయి గుర్తింపు

ఆరుతడి పంటల్లో అంతరపంటగా అక్రమంగా సాగు

మారుమూల గ్రామాల రైతులను ప్రోత్సహిస్తున్న స్మగ్లర్లు

జిల్లాలో గంజాయి సాగుపై పోలీసు, ఎక్సైజ్‌ వరుసదాడులు

15రోజుల వ్యవధిలోనే ఆరుచోట్ల బయటపడ్డ గంజాయి సాగు

రూ.కోట్ల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు

ఎక్సైజ్‌ శాఖ దాడులు చేస్తున్నా.. ఆగని గంజాయి సాగు

కామారెడ్డి, అక్టోబరు 12 (ఆంద్రజ్యోతి): జిల్లాలో గంజాయి సాగు మళ్లీ మొదలైనట్లు తెలుస్తోంది. గంజాయి స్మగ్లర్లు, దళారులు మారుమూల గ్రామాల రైతులను ఎంచుకుని గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నారని పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల విచారణలో స్పష్టమవుతోంది. ఆరుతడి పంటలు సాగు చేసే మొక్క జొన్న, పత్తి, కంది పంటలలో అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సాగు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు, ఎక్సైజ్‌ శాఖల నిఘా విభాగాలు వరుసదాడుల్లో గంజాయిసాగు గుట్టు రట్టవుతోంది.  మంగళవారం ఒకేరోజు సదాశి వనగర్‌, జుక్కల్‌ మండలాల్లోని పత్తి పంటలో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయిని అధికారులు గుర్తించి దహనం చేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా 15రోజుల వ్యవధిలోనే ఆరుచోట్ల గంజా యి సాగు మొక్కలు బయటపడ్డాయంటే స్మగ్లర్లు ఏ స్థాయిలో ఈ దందా సాగిస్తున్నారో తెలుస్తుంది. రూ.కోట్లాది విలువచేసే గంజాయి మొక్కలను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేస్తున్నారు. జిల్లా మహారాష్ట్ర, కర్ణాటకలకు సరిహద్దులుగా ఉండడంతో ఆ రాష్ట్రాల్లో గంజాయికి భలే డిమాండ్‌ ఉంది. కాగా, స్మగ్లర్లు ఇక్కడ ప్రాంతంలోని మారుమూల గ్రామాలను ఎంచుకుని గుట్టుగా గంజాయిని సాగు చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది.

పత్తిలో అంతర పంటగా గంజాయి సాగు

జిల్లాలోని సదాశివనగర్‌, జుక్కల్‌ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో గల తండాల్లో గంజాయి సాగవుతుందని సమాచారం మేరకు ఎక్సైజ్‌, పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. సదాశివనగర్‌ మండలం యాచారం గ్రామశివారులోని వ్యవసాయ భూమిలో గల పత్తి పంటలో సాగవుతున్న గంజాయిపై నిజామాబాద్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు చేశారు. దీంతో పత్తి పంటలో సాగువుతున్న 114 గంజాయి మొక్కలను గుర్తించి దహనం చేశారు. అదేవిధంగా జుక్కల్‌ మండలంలోని వజ్రకండి గ్రామంలో బిచ్కుంద ఎక్సైజ్‌ అధికారులు సమాచారం మేరకు పత్తి పంటలో సాగవుతున్న గంజాయిని గుర్తించారు. సుమారు 68 మొక్కలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఇలా ఒకేరోజు పత్తి పంటలోనే గంజాయి మొక్కలను గుర్తించడం గమనార్హం. గతంలో మొక్కజొన్న, కంది లాంటి ఆరుతడి పంటల్లో గంజాయిని సాగు చేస్తుండేవారు. ఇటీవల పత్తి పంటలోను గంజాయి సాగు చేస్తుండడం సంబంధిత శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

15 రోజుల్లో ఆరుచోట్ల బట్టబయలు

జిల్లాలో గంజాయి సాగు జోరుగా సాగుతుందనే సమాచారం మేరకు ఎక్సైజ్‌,పోలీసు శాఖలు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. ఈ శాఖల అధికారులతో పాటు నిఘా విభాగాలు సైతం అప్రమత్తమై గంజాయి సాగుపై మరింత నిఘా పెట్టారు. వరుస దాడులు చేస్తు గంజాయి సాగు మొక్కలను గుర్తించడమే ఇందుకు నిదర్శనం. 15 రోజుల వ్యవధిలో జిల్లాలో ఆరు చోట్ల పెద్దమొత్తంలోని గంజాయి మొక్కలను సంబంధిత శాఖ అధికారులు గుర్తించారంటే.. స్మగ్లర్లు ఏ స్థాయిలో గంజాయిని సాగు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈనెల 3వ తేదీన గాంధారి మండలంలోని దన్‌సింగ్‌ తండాలో 267 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. మరుసటి రోజు 4న అదే మండలంలోని కొత్తబాది తండాలో పెద్దమొత్తంలోనే గంజాయి మొక్కలను పోలీసు నిఘా వర్గాలు గుర్తించారు. కొత్తబాది తండాలో ఎకరం మొక్కజొన్న పంటలో సుమారు రెండు వేల వరకు గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. 11న జుక్కల్‌ మండలంలోని వజ్రకండిలో మొక్కజొన్న పంటలో సాగు చేస్తున్న 140 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 12న సదాశివనగర్‌లోని యాచారంలో పత్తిపంటలో సాగవుతున్న 114 మొక్కలను గుర్తించారు. జుక్కల్‌లోని వజ్రకండి గ్రామంలో పత్తి పంటలో సాగువుతున్న 68 గంజాయి మొక్కలను ఎక్సైజ్‌ పోలీసులు గుర్తించి దగ్దం చేశారు. 

మారుమూల గ్రామాలు, తండాల్లో..

జిల్లాలోని గాంధారి, సదాశివనగర్‌, రాజంపేట్‌, రామారెడ్డి, జుక్కల్‌, మద్నూర్‌, పిట్లం, బిచ్కుంద, నస్రూళ్లబాద్‌ మండలాల్లో గల మారుమూల గ్రామాలు, తండాలను గంజాయి సాగుకు స్మగ్లర్లు, దళారులు ఎంచుకుంటున్నారు. కొంతమంది వ్యాపారులు వానాకాలం పంటల సాగుకు ముందే ఈ ప్రాంతాలను ఎంచుకుని ఆయా గ్రామాలు, తండాల రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పత్తి, కంది లాంటి పంటల్లో అంతరపంటగా సాగు చేసేలా పెట్టుబడులు స్మగ్లర్లే పెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మొక్కలెక్కన స్మగ్లర్లు రైతులకు డబ్బులు చెల్లిస్తున్నట్లు, గంజాయి సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. స్మగ్మర్లు గుట్టుగా గంజాయి విత్తనాలను అందిస్తూ, మూడో కంటికి తెలియకుండా ఆరుతడి పంటల్లో అంతరపంటగా అక్రమంగా సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మారుమూల గ్రామాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండడంతో.. ఇక్కడి నుంచి సాగుచేసి ఎండు గంజాయిని ఆ రాష్ట్రాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహా నగరాల్లో భలే డిమాండ్‌ 

జిల్లాలో సాగు చేస్తున్న గంజాయికి మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో మంచి డి మాండ్‌ ఉంది. కొంతమంది దళారులు జిల్లా రైతులు పండించిన గంజాయి ఆకును కిలోకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు కొనుగొలు చేస్తున్నారు. గంజాయి మొక్కను కిలోకు రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు చెల్లిస్తున్నారు. తమ అనుచరుల ద్వారా రైలు, రోడ్డు మార్గంలో ఇతర ప్రాంతాలకు గుట్టుగా తరిలిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎండు గంజాయి కిలోకు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణ లో తేలింది. గతంలో గాంధారిలో గంజాయి సాగు జోరుగా ఉండేది. అప్పటినుంచే గంజాయికి మూలకేంద్రంగా కామారెడ్డి కొనసాగేది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్‌ లాంటి మహానగరాలకు తరలిస్తూ గంజాయి స్మగ్లర్లు జోరుగా దందా సాగించేవారు.

గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

: శ్రీనివాస్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, కామారెడ్డి

గంజాయిని సాగుచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఇటీవల కాలంలో ఎక్సైజ్‌ మరింత నిఘా పెంచింది. ప్రధానంగా మారుమూల గ్రామాలు, తండాలు, అటవీ ప్రాంతాలలో సాగవుతున్న గంజాయిపై మరింత నిఘా పెట్టాం. తనిఖీలు చేస్తుండడంతో ఆరుతడి పంటల్లో గుట్టుగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను గుర్తిస్తున్నాం. గంజాయిని సాగుచేయడం నేరం. ఎవరైన గంజాయి సాగుచేస్తే.. వారి సమాచారం ఎక్సైజ్‌ శాఖకు అందించాలి.