Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆగని లీకులు...

భయం గుప్పిట్లోనే బాధితులు 

శ్రమిస్తున్న అధికారులు

కానరాని ఫలితం 

లీకులను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

బాధితులతో మాట్లాడిన అధికారులు

పామూరు, డిసెంబరు 2: మోపాడు రిజర్వాయర్‌ కట్టకు ఏర్పడిన లీకులకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే సూచనలు కానరావడం లేదు. లీకుల ద్వారా బయటకు వస్తున్న నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీసు శాఖలు చేస్తున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. వందలాది సిమెంటు ఖాళీ బస్తాలు తెప్పించి ఇసుక, కంకరతో నింపి లీకుల వద్ద వేస్తున్నా నీరు బయటకు వస్తూనే ఉంది. మరోవైపు రిజర్వాయర్‌ లోపలి వైపు లీకులు ఉన్న భాగంలో వందలాది టిప్పుల గ్రావెల్‌ను ట్రాక్టర్ల ద్వారా వేస్తున్నా ఉపయోగం లేదు. చివరకు రిజర్వాయర్‌లో ఉన్న నీటిమట్టాన్ని తగ్గించేందుకు అలుగు భాగాన్ని యంత్రాల ద్వారా మరింత గండికొట్టి వరద నీటిని మన్నేరు వాగుకు వదులుతున్నారు. ఒక దశలో అఽధికారులు, కూలీలు సైతం లీకులు అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతుండటంతో నిరాశ నిస్పృహాలకు లోనయ్యారు. మరో ఐదురోజులు సమయం తీసుకునైనా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లాస్థాయి అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నారు. లీకులు ఉన్నచోట, రిజర్వాయర్‌ లోపలి భాగంలో కట్ట ఎత్తుకు సమానంగా మట్టిని పోసి చదును చేస్తే గానీ లీకులు అరికట్ట వచ్చునని ఉద్దేశంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రిజర్వాయర్‌లో 25 అడుగుల మేర నీటిమట్టం వరకు నీరు నిల్వ ఉంచి మిగిలిన నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రిజర్వాయర్‌కు మాత్రం వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రిజర్వాయర్‌ కట్ట వద్ద యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నా ఫలితం మాత్రం ఆశించిన మేర కానరావడం లేదు. దీంతో రిజర్వాయర్‌ పరిధిలోని ముంపు ప్రాంతానికి గురయ్యే పలు గ్రామాల ప్రజలు భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. 


నీటి మట్టాన్ని తగ్గించి లీకులు అరికడతాం: కలెక్టర్‌

మోపాడు కట్టకు ఏర్పడిన లీకులను గురువారం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎస్పీ మలిక గర్గ్‌, ఎమ్మెల్యే మధుసూదన్‌తో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యల గురించి ఇరిగేషన్‌ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రిజర్వాయర్‌లో అధికంగా నీటిమట్టం ఉండటంతో లీకేజీలను అరికట్టడం కష్టంగా మారిందని  తెలిపారు. మరో వారంరోజులు సమయం తీసుకున్నప్పటికి లీకులను అరికట్టి కట్టకు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. అఽధిక వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచివస్తున్న నీరు రిజర్వాయర్‌ సామర్ధ్యాన్ని మించి ఉందన్నారు. కట్టకు లీకులు ఏర్పడ్డాయన్నారు. నీటిమట్టాన్ని తగ్గించి లీకులను అరికడతామన్నారు. విజయవాడ నుంచి వచ్చిన డ్యాం సేప్టీ ఆర్గనైజేషన్‌ ప్రత్యేక నిపుణుల బృందంతో చర్చించినట్లు తెలిపారు. రిజర్వాయర్‌ కట్టకు వచ్చిన ముప్పేమీ లేదని, ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. వందేళ్ల నాటి పురాతన రిజర్వాయ ర్‌ కావడంతో స్వల్పమైన లీకులు ఏర్పడటం సహజమేనన్నారు. అనంతరం లక్ష్మీనరసాపురం జడ్పీ హైస్కూల్‌లో తలదాచుకుంటున్న మో పాడు గ్రామప్రజలతో మాట్లాడారు. ఎవ్వరూ అధైర్యపడవద్దని, కట్టకు వచ్చిన ప్రమాదం ఏమి లేదన్నారు. ఎమ్మెల్యే  మధుసూదన్‌ మాట్లాడుతూ.. రేపటి నుంచి బాధితులు ఇళ్లకు వెళ్లవచ్చన్నారు. అనంతరం బాధితులకు ఎస్పీ మలికాగర్గ్‌, ఎమ్మెల్యే స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అక్కడ ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ లక్ష్మిరెడ్డి, సబ్‌కలెక్టర్‌ అపరాజితాసింగ్‌, డీఎస్పీ కండే శ్రీనివాసరావు, డీఈఈ రవికుమార్‌, తహశీల్దార్‌ సీహెచ్‌ ఉష, ఎంపీడీవో రంగసుబ్బరాయుడు, సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement