Abn logo
Jan 17 2021 @ 23:53PM

కాలువే కదా.. కబ్జా చేసెయ్‌!

మార్కాపురంలో రెచ్చిపోతున్న రియల్టర్లు

వర్షపు నీరు వెళ్లే కాల్వల చదును

వెంచర్లలో కలుపుకొని ప్లాట్లు 

తూములు సైతం మూసివేత

పట్టించుకోని అధికారులు

ఆందోళన చెందుతున్న ప్రజలు మార్కాపురం, జనవరి 17 :  మార్కాపురం ప్రాంతంలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ఆక్రమణలకు తెగబడుతున్నారు. వర్షపు నీరు పారే కాలువలు, రహదారుల వెంట నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన తూములను సైతం చదును చేస్తున్నారు. వాటిని వెంచర్లలో కలిపి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. రియల్టర్లకు అధికార పార్టీనేతల అండదండలు ఉండటంతోపాటు, భారీగా అమ్యామ్యాలు అందుతుండటమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వ భూములను ఆక్రమించారు. అసైన్‌మెంట్‌ భూములనూ ఆరగించారు. చివరికి చెరువులు, వాగులను సైతం చెరపట్టారు. ఇప్పుడు గ్రామాలు, పొలాల నుంచి వర్షపు నీరు వెళ్లేందుకు ఉన్న కాలువలపై  రియల్టర్లు కన్నేశారు. వాటిని కూడా మింగేస్తున్నారు. దర్జాగా చదును చేసి అమ్ముకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు చివరి దశకు రావడం, నిర్వాసితుల కాలనీల ఏర్పాటు జరుగుతుండటంతో మార్కాపురం ప్రాంతంలో భూములు, ఇళ్ల స్థలాల ధరలకు ఇటీవల రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా రియల్టర్లు కబ్జాల పర్వాన్ని ముమ్మరం చేశారు. వర్షపు నీరు వెళ్లే కాలువలు ఆక్రమించడం వలన ముంపు సమస్య ఏర్పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


దరిమడుగు వద్ద...

మార్కాపురం మండలం దరిమడుగు నుంచి పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు మధ్యలో ఇటీవల కాలంలో ఇంటి స్థలాల ధరలు భారీగా పెరిగాయి. ఈ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కాలనీలు ఏర్పాటవడం ఇందుకు ప్రధాన కారణమైంది. దీంతో పట్టణంలోని రియల్టర్లు ఆ రెండు గ్రామాల మధ్య ఉన్న వ్యవసాయ భూములను నివేశన స్థలాలుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా పొలాల మధ్యలో వర్షపు నీరు పారేందుకు ఏర్పాటు చేసిన కాల్వలను సైతం చదును చేస్తున్నారు. దరిమడుగు సమీపం నుంచి జాతీయ రహదారి 565 వెళ్తోంది. ఆ రహదారి వద్ద దరిమడుగు చెరువు నుంచి గుండ్లకమ్మకు వర్షపు నీరు వెళ్లేందుకు తూము ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ తూము నుంచి వర్షపు నీరు వెళ్లే కాల్వను ఆక్రమించి ఇళ్ల స్థలాలు విక్రయించేందుకు వెంచర్లు వేశారు.   ఈ రోడ్డుకు దక్షిణం వైపు కాలువను గతంలోనే ఆక్రమించారు. 


నికరంపల్లి వద్ద

మార్కాపురం మండలం నికరంపల్లి సమీపం నుంచి అమరావతి నుంచి అనంతపురం వెళ్లే జాతీయ రహదారి  ఎన్‌హెచ్‌ 544డీ నిర్మాణంలో ఉంది. ఆ రహదారిపై నికరంపల్లి గ్రామ సమీపంలో వర్షపునీరు వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మించారు. దానికి సంబంధించిన కాల్వను ఆక్రమించి రియల్టర్లు రోడ్డు నిర్మించారు. దాని పక్కనే వెంచర్‌ వేసి ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. 


పట్టించుకోని అధికారులు

రియల్టర్లు ఇంత అక్రమాలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్ల నిర్మాణంలో భాగంగా బ్రిడ్జిలు నిర్మించిన ఆర్‌ అండ్‌ బీ అధికారులు కానీ, నీటి పారుదలను పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్‌ అధికారులు కానీ ఆవైపు కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే వ్యవసాయ భూములను నివేశన స్థలాలుగా మారుస్తూ రియల్టర్లు చేసుకున్న దరఖాస్తులపై ఎటువంటి విచారణ చేయకుండానే  రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వడం వెనుక భారీ మొత్తంలో చేతులు మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement