Abn logo
Jul 30 2021 @ 04:35AM

కమ్యూనిస్టులు ‘ఈ’ ఎన్నికల్లో పాల్గొనవచ్చునా?

మానవ సమాజం వేలాది సంవత్సరాలుగా, 

అనేక అసమానతలతోనే సాగుతూ వుంది. ఆ అసమానతలకు కారణాలేమిటో, వాటికి నివారణ లెలాగో, ఆ విషయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆలోచనాపరులు ఎవరికి తోచినట్టు వారు సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ వచ్చారు. 18వ శతాబ్దం చివరి నాటికి, చార్లెస్‌ ఫోరియర్‌, సెయింట్‌ సైమన్‌, రాబర్ట్‌ ఓవెన్‌ల వంటి మేధావులు, ప్రతిపాదించిన సిద్ధాంతాలకు, ‘సోషలిజం’ అనీ, ‘కమ్యూనిజం’ అనీ పేర్లు వచ్చాయి. 


19వ శతాబ్దపు ప్రారంభదశ వారైన మార్క్సూ-ఎంగెల్సులు, తాము వినే సోషలిజం, కమ్యూనిజం- అనే సిద్ధాంతాలనూ, ఆ నాటికే దొరికిన కొందరు ఆర్థిక వేత్తల రచనలనూ, తత్వవేత్తల భావాలనూ, విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, తమ నూతన సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ సిద్ధాంతం అంతా, గతంలోలేని హేతుబద్ధ తర్కంతో ఏర్పడింది. అందుకే, ఈ సిద్ధాంతానికి ‘శాస్త్రీయ సోషలిజం’ అనీ, ‘శాస్త్రీయ కమ్యూనిజం’ అనీ పేర్లు స్తిర పడ్డాయి. వేరువేరు దేశాలకు చెందిన కమ్యూనిస్టులు ‘కమ్యూనిస్ట్‌ లీగ్‌’ అనే పేరుతో ఒక సంస్తని ఏర్పాటు చేశారు. మార్క్సూ-ఎంగెల్సులు కూడా ఆ సంఘంలో సభ్యులే. సమానత్వ సంబంధాలతో, నూతన సమాజాన్ని సాధించడానికి, ఒక ‘ప్రణాళిక’ను తయారు చేయమని, కమ్యూనిస్టు లీగ్‌ సభ్యులు, ఆ బాధ్యతని మార్క్సూ-ఎంగెల్సులకు అప్పగించారు. ఆ రకంగా, ఆ ఇద్దరి రచన వల్లా ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ తయారైంది. దానిలో, చిట్టచివరి పేరాలో వున్న, మార్క్సూ-ఎంగెల్సులు చెప్పిన ‘‘బలవంతంగా కూలదోయడం ద్వారానే’’ అనే మాటల ఆధారంగా, దాదాపు 100 ఏళ్ళగా, ప్రపంచ దేశాల్లో, ఎక్కడ కమ్యూనిస్టులు వుంటే అక్కడ, దోపిడీ పాలకవర్గాన్ని కూలదోయడం కోసం చర్చలపై చర్చలు జరుగుతూనే వున్నాయి. ఆ చర్చలు ఏమిటంటే, కమ్యూనిస్టు సమాజాన్ని, బూర్జువాలు నడిపే పార్లమెంటరీ పంధాలోనే శాంతి యుతంగా, ఏర్పర్చగలమా? లేకపోతే, సాయుధ పోరాటం ద్వారా(దోపిడీ వర్గ పాలనని ‘‘బలవంతంగా కూలదోయడం ద్వారానే’’)‘శ్రమ దోపిడీ’ లేని కమ్యూనిస్టు సమాజాన్ని సాధిస్తామా?- ఈ రకం వాదనలు, ఈ నాటికీ భారతదేశంలో, తెలుగు ప్రాంతాలలో కూడా వున్నాయి. 


ఒక రకం వాదం: ఈ ఎన్నికలు బూర్జువా చట్టాలను కొనసాగించేవే అయినా, జనాభాలో శ్రామిక జనాలే ఎక్కువ సంఖ్య కాబట్టి, ఎన్నికల్లో పాల్గొంటే, శ్రామికులే ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలరు. ఆ రకంగా, ‘బూర్జువా పార్లమెంటరీ ఎన్నికల ద్వారా అయినా, శ్రామికులే ఎక్కువ ఓట్లతో, రాజకీయ అధికారం సాధిస్తారు. ఆ తర్వాత బూర్జువా చట్టాలన్నిటినీ కొత్త చట్టాలుగా మార్చేసి, ‘సోషలిజాన్ని’ తేలికగా ఏర్పర్చవచ్చును’- ఇదీ మొదటి వాదం.


ఇంకో వాదం: ‘బూర్జువా రాజ్యం, ఆయుధాలతో వుంటుంది. కాబట్టి, సాయుధంగా వున్న బూర్జువా రాజ్యాంగ యంత్రాన్ని, శ్రామిక వర్గాలు ఎన్నికల ద్వారా ఓడించలేరు. దాన్ని సాయుధంగానే కూలదోయాలి. ఎన్నికల మార్గంతో సోషలిజాన్ని సాధించలేము’- ఇది బూర్జువా ఎన్నికలలో శ్రామికులు పాల్గొనడాన్ని తిరస్కరించే వాదం. 


మరో వాదం: ఇది దాదాపు మొదటి వాదం వంటిదే. ఇది ఏమిటంటే, శ్రామిక ప్రజలకు బూర్జువా పార్లమెంటరీ వ్యవస్త మీద భ్రమలు వున్నాయి. ఆ భ్రమలు పోగొట్టడానికే, కమ్యూనిస్టులు ఎన్నికల్లో పాల్గొనాలి -అనే వాదం ఇది. 


ఈ వేరువేరు వాదనలలో ఏ వాదనని సరైన వాదనగా అంగీకరించాలీ, దానికి తగినట్టు ఎలా పని చేయాలీ- అనే విషయాల గురించి, పాఠకులు నన్ను తరచూ అడుగుతూ వుంటారు. నేను మార్క్సు ‘కాపిటల్‌’కి ‘పరిచయం’ రాశాను కాబట్టి నాకు అది తెలుస్తుందని కొందరు పాఠకుల నమ్మకం. కానీ, నాకు ఈ విషయాల గురించి తగినంత స్పష్టత లేదు. దాని కోసం, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ నించీ మొదలు పెట్టి, ‘కాపిటల్‌’ వరకూ వున్న రచనలలో, వెతక వలిసి వచ్చింది. అంతే కాదు. ఈ విషయం మీద లెనిన్‌ ప్రత్యేకంగా రాసిన ఒక పుస్తకాన్నీ, అదే కాలంలో (1920లో) కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌లో జరిగిన వాదనల్ని కూడా చూడడం అత్యవసరం అయింది. ఆ వాదనలన్నిటినీ పాఠకుల ముందు పెట్టడానికే ఈ వ్యాసంలో ప్రయత్నించాను. 


అన్ని వాదనలనూ పరిచయం చేసి, వాటిలో భారత దేశానికి ఏది వర్తిస్తుందో, ఏది వర్తించదో, నాకు తోచిన అభిప్రాయాలు నేను వ్యక్తం చేశాను. ఇది, ఒక రకమైన చర్చా వ్యాసం లాంటిదే. అలాగే, బూర్జువా పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనడం గురించి పాఠకులు అడిగే ప్రశ్నల్నీ, వాటికి నాకు తోచిన జవాబుల్నీ కూడా ఈ పుస్తకంలో చేర్చాను. 


మచ్చుకి ఒక ప్రశ్న: ‘‘అధికారంలోకి వచ్చే విధానం గురించి మార్క్సిజం, ‘బలప్రయోగ మార్గాన్ని’ చెప్పింది. కానీ నేడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా? ఈ నాడు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా, ఒక వ్యక్తి ఎక్కడున్నాడో కనిపెట్టడం సులువై పోయింది. రాజ్యం చేతి నుండి విప్లవకారులు తప్పించుకు తిరగ గలిగేటట్లు ఈ నాడు వుంటుందా? యుద్ధ విమానాలూ, కమ్యూనికేషన్‌ వ్యవస్తా, ఈ నాడు పెరిగి వున్నాయి. ఆధునిక యుద్ధ సామాగ్రి వల్ల, నేడు కార్మికులు రాజ్యంతో తలపడి బల ప్రయోగం ద్వారా అధికారాన్ని స్థాపించుకోవడం సాధ్యమా? కాబట్టి, ఎన్నికల మార్గం లోనే కార్మికులూ, ఇతర శ్రామికులూ, మెజారిటీ ఓట్లతో అధికారంలోకి రాగలరనుకోకూడదా? 


జవాబు: గత చరిత్రని చూడండి! ఆ నాటికి గొప్ప టెక్నాలజీతో, అమెరికా, వేల మైళ్ళ దూరంలో వున్న వియత్నాం మీదకి వెళ్ళి, 1963-–73 మధ్య, 10 సంవత్సరాల పాటు, అనేక మారణాయుధాలతో పాటు, 3 లక్షల 88 వేల టన్నుల ‘నాపాం’ బాంబుల్ని వేసింది. 2 కోట్ల గాలన్ల విషరసాయనాలను పొలాల మీదా, జలాశయాల మీదా, ఊళ్ళపైనా విమానాలతో చల్లించారు. ఆ బాంబులూ, విషరసాయనాలూ లక్షలమంది జనాల మరణాలకీ, ప్రాణాంతక రోగాలకీ కారణమయ్యాయి. లక్షలాది పంట పొలాలూ, జలాశయాలూ, నాశనం అయ్యాయి. అంత చేసినా, వియత్నాం ప్రజలు, ఆ దుర్మార్గపు టెక్నాలజీకి లొంగలేదు. అయినా, టెక్నాలజీ అనేది ఎప్పుడూ పాలక వర్గాల చేతుల్లోనే వున్నా, దాన్ని చేసేవాళ్ళూ, పాలకుల కోసం దాన్ని ఉపయోగించే వాళ్ళూ కూడా శ్రామికులే కదా? మేధా శ్రమల కార్మికులూ, నైపుణ్యాలతో శారీరక శ్రమలు చేసే కార్మికులూ, ఆ విషాలను కనిపెట్టే మేధా శ్రమల వారూ, వీరందరూ జీతాల శ్రామికులే. ‘అదనపు విలువ సిద్ధాంతాలు’ అనే రచనలో మార్క్సు చెప్పినట్టు సైనికులూ, పోలీసులూ కూడా, తప్పుడు సామాజిక సంబంధాల వల్ల, అవసరమైన శ్రామికులే. కమ్యూనిస్టు పార్టీ అనేది, తమ ప్రచారాలతో, ఆ శ్రామికులలో కూడా వర్గ చైతన్యాన్ని బోధించే పని చెయ్యాలి. రష్యాలోనూ, చైనాలోనూ, వియత్నాంలోనూ, విప్లవ కాలంలో, సైనికులు, విప్లవకారుల వేపు తిరగడం జరిగింది. కమ్యూనిస్టుల పని, సైనికుల్లో, పోలీసుల్లో చెయ్యడం, అతి ముఖ్యం. దాదాపు 50 ఏళ్ళ కిందట, తెలుగులో, విప్లవ కవి చెరబండరాజు గారు, పోలీసులను సమీకరించేటంత శక్తివంతమైన పాట రాశారు, ఇలా: ‘మా లోని మనిషివే/మా మనిషివే నీవు/పొట్ట కూటికి నీవు పోలీసువైనావు/ప్రాణాలు బలిపెట్టి పోరాడు సోదరుల/గుండెలకు తూటాలు గురిపెట్టి నావేమి?’ అనే పాట ఇది. 

రంగనాయకమ్మ 

(‘కమ్యూనిస్టులు, బూర్జువా పార్లమెంటరీ ఎన్నికల్లో

పాల్గొనవచ్చునా, లేదా?’ అనే కొత్త పుస్తకం నించీ కొంత.)