Advertisement
Advertisement
Abn logo
Advertisement

బై అమ్మా... బై నాన్నా!

 బుధవారం ఉదయం 8.45 గంటలకు సాయితేజ భార్య శ్యామలకు ఫోన్‌ చేశారు. పిల్లలేం చేస్తున్నారని అడిగారు. బాబుని స్కూల్‌కు రెడీ చేస్తున్నానని చెప్పగా వీడియో కాల్‌ చేస్తా... మాట్లాడించమని కోరాడు. రెండు నిమిషాలు ఇద్దరు పిల్లలతో మాట్లాడారు.డ్యూటీకి వెళ్లాలి...బాయ్‌ నాన్నా... బాయ్‌..మ్మా అంటూ ఫోన్‌ కట్‌ చేశారు. అవే ఆయన చివరి మాటలవుతాయని వారు ఊహించలేకపోయారు.


 కురబలకోట/మదనపల్లె, డిసెంబరు 8: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో కురబలకోట మండలం యర్రబల్లి పంచాయతీ ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ(27) దుర్మరణం పాలు కావడం ఆయన కుటుంబంతో పాటు స్వగ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.సాధారణ రైతు కుటుంబానికి చెందిన బొగ్గుల మోహన్‌, భువనేశ్వరి దంపతు లకు పెద్ద కుమారుడిగా 1994లో జన్మించిన సాయితేజ డిగ్రీ పూర్తయ్యాక 2013లో ఆర్మీకి ఎంపికయ్యారు.సిపాయిగా కొంత కాలం పని చేశాక అప్రెంటీస్‌ కోర్సు పూర్తి చేసి లాన్స్‌ నాయక్‌గా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతాధికారిగా నియమితులయ్యారు.2016లో సిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన శ్యామలతో వివాహమైంది. కుమారుడు మోక్షజ్ఞ(5) చదువుకోసం రెండేళ్ల కుమార్తె దర్శినితో కలసి ఆరునెలల క్రితం మదనపల్లె ఎస్‌బీఐ కాలనీకి శ్యామల నివాసం మార్చారు.వినాయక చవితికి  స్వగ్రామం వచ్చిన సాయితేజ సంక్రాంతికి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారు.బుధవారం మధ్యా హ్నం హెలికాప్టర్‌ ప్రమాదంపై మీడియాలో వార్త లు రావడంతో ఆర్మీ అధికారులను ఫోన్‌లో సంప్రదించడంతో ప్రమాద విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో మదనపల్లెలో ఉన్న బంధువులు శ్యామల వద్దకు చేరుకుని ఓదార్చారు.ఎగువరేగడలో పొలం పనుల్లో ఉన్న సాయుతేజ తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు.దిగ్ర్బాంతికి గురైన సాయితేజ తల్లిదండ్రులు పొలంలోనే కుప్పకూలిపోయారు.గ్రామస్తులు వారిని ఇంటికి చేర్చి ఓదార్చారు.శ్యామల కూడా ఇద్దరు పిల్లలతో హుటాహుటిన ఎగువరేగడకు చేరుకున్నారు.         

 నారా లోకేష్‌ సంతాపం


 ప్రమాదంలో సాయితేజ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం కుటుంబంతో మాట్లాడిన వ్యక్తి సాయంత్రానికి ఇక లేడన్న బాధ ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. సాయితేజ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌ సాయితేజ కుటుంబీకులను ఫోన్‌లో పరామర్శించారు.డీఎస్పీ రవిమనోహరాచారి, రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ గ్రామానికి వెళ్లి సాయితేజ కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.


Advertisement
Advertisement