Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఖాళీలు కొన్నే.. దరఖాస్తులెన్నో!

  1. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో భర్తీ కోసం.. 
  2. జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో నిరుద్యోగుల రద్దీ 


కర్నూలు(ఎడ్యుకేషన), డిసెంబరు 8 :  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి చాలా కాలం తర్వాత నోటిఫికేషన విడుదలైంది. ప్రిన్సిపాల్‌, సీఆర్‌టీ, పీఈటీ, పీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 4వ తేదీన దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ప్రతి రోజూ వేల కొద్ది నిరుద్యోగులు జిల్లా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పించారు. 8వ తేదీ చివరి గడువు కావడంతో మంగళ, బుధవారాలు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం నిరుద్యోగులతో కిటకిటలాడింది. కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, అధికారులు లోపలికి వెళ్లేందుకు చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయ ప్రాంతమంతా అభ్యర్థులతో కిటకిటలాడింది. కొంత మంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. అప్పటికప్పుడే అప్లికేషన పూరించి దానిపై గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకం చేయించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. బిడ్డల కోసం తల్లిదండ్రులు, భార్యల కోసం భర్తలు భారీగా తరలి వచ్చారు. కార్యాలయం వద్ద వీరి పిల్లలు కూడా కనిపించారు. మొత్తం మీద కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. కర్నూలు జిల్లాలోని సమగ్ర శిక్ష పరిధిలో ఉన్న 53 కేజీబీవీలలో ప్రిన్సిపాల్‌ పోస్టులు 8, సీఆర్‌టీలు 46, పీఈటీ 1, పీజీటీలు 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులు తక్కువగా ఉండటం, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో తమకు ఉద్యోగం వస్తుందో లేదోనని అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరగా చేసుకుని కొంత మంది ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎర వేస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు సంబంధించిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని అధికారులకు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిడి పెరగడంతో సమగ్ర శిక్ష అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొంత మంది అధికారులు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థులను వలలో వేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే పోస్టుల భర్తీ పూర్తిగా మెరిట్‌ ఆధారంగా ఉంటుందని, దళారుల మాటలు నమ్మవద్దని జిల్లా సమగ్ర శిక్ష అధికారులు అంటున్నారు. 


Advertisement
Advertisement