Abn logo
May 11 2021 @ 02:17AM

జలరవాణా వ్యవస్థకు ‘బకింగ్‌హామ్‌’ ఆదర్శం

తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు తీర ప్రాంతంలో ఓ పెద్దాయనతో మాట్లాడుతుండగా ‘‘ఏందయ్యా! ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని బ్రిడ్జిలు కట్టినా ఈ రద్దీ తగ్గేటట్లు లేదు. బ్రిటిష్‌ వాళ్ళ కాలం నాటి ఆ బకింగ్‌హామ్‌ కాలువ తిరిగి తెరిస్తే సరిపోలా. తక్కువ ఖర్చుతో జల రవాణా వాడుకలోకి వస్తుంది’’ అంటుంటే ఆయన మనో పరిపక్వతకు అబ్బురపడ్డాను. సంభాషణను పొడిగిస్తూ ‘‘బ్రిటిష్‌ కాలం నాటి బ్రిడ్జీలు, రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ మధ్యనే వేసిన హైవే (ఎన్‌హెచ్‌-45) మనుబ్రోలు దగ్గర తుఫాన్ల తాకిడికి కొట్టుకుపోయి, ప్రతి సంవత్సరం నానా యాతనా పడాల్సి వస్తోంది’’ అని వాపోతే, ఆయన విషయ పరిజ్ఞానానికి మనస్సులోనే అభినందించాను.


నిజమే మరి. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా థర్మల్‌, జల, టైడల్‌, వాయు, అణు ఇంధనాల మిశ్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లే- రోడ్లు హైవేలు, బుల్లెట్‌ ట్రైన్లు, జాతీయ, అంతర్జాతీయ విమానాలతో పాటు ప్రత్యామ్నాయంగా జల రవాణా మార్గాల్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఈ కోవలోకి వచ్చేదే, ఈ ప్రాంతవాసులకు చిరపరిచితమైన ‘బకింగ్‌హామ్‌ కాలువ’. 19వ శతాబ్దంలో పాశ్చాత్య ఇంజనీర్లు డిజైన్‌ చేసి, నిర్మించిన ఈ నావిగేషనల్‌ కాలువను ‘కోరమాండల్‌ కోస్టు’కే తలమానికం అని చెప్పవచ్చు. గత వైభవ చిహ్నంగా, జాతీయ వారసత్వ సంపదగా మనకు సంక్రమించిన ఈ జల రవాణావ్యవస్థ నేటి పాలకుల నిర్లిప్తత కారణంగా నిరుపయోగంగా ఉండడం, జాతికే తలవంపు తెచ్చే అంశం.


1806లో రూపు దాల్చిన ఈ ఉప్పునీటి జలరవాణా మార్గం ప్రధానంగా సరుకులను చేరవేయడంతో పాటు పౌరుల రవాణా కోసం ఉద్దేశించబడినా వరదల తాకిడిని, తుఫాను బీభత్సాల్ని నిలువరించడంలో ఎంతగానో ఉపయోగపడింది. ఇదీ ఈ చారిత్రాత్మక కాలువ ప్రత్యేకత. 2004లో సంభవించిన సునామిలో బకింగ్‌హామ్‌ కాలువ ఒక బఫర్‌ జోన్‌గా దాదాపు 310 కి.మీ పొడవున ప్రకాశం జిల్లా పెద్ద గంజాం నుంచి చెన్నై వరకు వందలాది మత్స్యకారుల్ని, తీరప్రాంత గ్రామాల్ని సునామి నుంచి కాపాడిన విషయం లోకవిదితమే. పది నిమిషాల్లో టైడల్‌ వేవ్స్‌ సముద్రంలో కలిసిపోయేలా ఒక అడ్డుగోడగా నిలబడే సామర్థ్యం ఈ కాలువకు ఉందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. వాకాడు మండలంలో ఉన్న పెదకుప్పం, శ్రీనివాసపురం, తుడిపాలెం గ్రామాలు విపత్తు బారిన పడకుండా శిథిలావస్థలో ఉన్న ఈ కాలువ నివారించిందని స్థానికులు పేర్కొనటం గమనార్హం. వరదలు, తుపాన్లు వచ్చిన ప్రతిసారి కొన్ని వేల కోట్ల తక్షణ సహాయం అందించటం ఎంత అవసరమో, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ కాలువను పునర్వ్యవస్థీకరించడం అంతే ముఖ్యమని నేటి పాలకులు గుర్తించాలి.


బకింగ్‌హామ్‌ కాలువ నిర్మాణం దశలవారీగా జరిగింది. ఇది ఒక ప్రైవేట్‌ జలమార్గం. నేడు మనం వ్యవహరిస్తున్న బిల్డ్‌, ఓన్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ మోడల్‌తో ఆ రోజుల్లోనే డిజైన్‌, బిల్డ్‌, ఆపరేట్‌ పద్ధతిన ఈ జల రహదారిని నిర్వహించడం విశేషం. మద్రాసు పోర్టు నుంచి ఎన్నోరు వరకు గల 16.5 కిమీ కాలువ నిర్మాణాన్ని బాసెల్‌ -కొకృన్‌ కంపెనీ పూర్తిచేయటం చెప్పుకోదగ్గ విషయం. అందుకే 1806లో దీన్ని కొక్రేన్‌ కెనాల్‌గా పిలిచేవారు. మద్రాసుకు ఉత్తరదిశగా ఈ కాలువను పొడిగించారు. తదుపరి విజయవాడ ద్వారా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రేవు వరకు పొడిగించడం ద్వారా మద్రాసు–-కాకినాడ పోర్టు కార్యకలాపాలను ముమ్మరంగా కొనసాగించే వీలు కలిగింది. 1880లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్‌ నెల్లూరు పర్యటనలో భాగంగా ఈ కెనాల్‌ పేరును ‘బకింగ్‌హామ్‌’గా ప్రకటించారు.


796 కిమీ పొడవైన ఈ జలాంతర నావిగేషన్‌ కాలువ కోరమాండల్‌ కోస్టుకు సమాంతరంగా సముద్రతీరం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో తమిళనాడులోని విల్లుపురం వరకు విస్తరిస్తూ పులికాట్‌ సరస్సును అనుసంధానిస్తూ నిర్మించిన కాలువ ఒక అద్భుత ఇంజనీరింగ్‌ సృష్టి, బహుళార్థక ప్రాజెక్టు అని చెప్పవచ్చు.


ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ జలరవాణా వ్యవస్థను పునరుద్ధరించే దిశలో భారత ప్రభుత్వం జాతీయ జల రహదారి ఎన్‌డబ్ల్యూ-4గా 2006లో ప్రకటించడం హర్షణీయం. దేశంలో విస్తరించి ఉన్న జలరవాణా మార్గాల్ని వాడుకలోకి తీసుకువచ్చే దిశలో ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటుచేసి, బకింగ్‌హామ్‌ కాలువ అంతర్భాగంగా కాకినాడ–పుదుచ్చేరి జాతీయ రహదారి పనుల పర్యవేక్షణ కోసం విజయవాడలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించటం విశేషం. ఫేజ్‌–1లో లిస్టు అయిన ఈ ప్రాజెక్టు పనులు ఫేజ్‌–2, 3లోకి మార్చడంతో సర్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రాధాన్యతా క్రమాన్ని మార్పుచేసి మొదటి దశలోనే ఈ జాతీయ జలరహదారి పనులు వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. ఇందు కోసం రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించాల్సిన పాత్ర చాలకీలకమైనది.


ఈ రవాణా వ్యవస్థకు అనుబంధంగా అంతే ప్రాధాన్యతతో చేపట్టాల్సిన మరో ప్రజోపయోగ కార్యం ‘పులికాట్‌ సరస్సు’ ఆధునీకరణ. పై తట్టు ప్రాంతాల నుంచి ఆరణి, కాళింగ, స్వర్ణముఖి నదుల నుంచి వచ్చిపడిన చెత్తాచెదారం, వ్యవసాయ రసాయనాలు, పురుగు మందుల వ్యర్థాలు ఈ సుందరమైన సరస్సును కలుషితం చేయడమే కాకుండా, పూడికతో నింపివేయడంతో ముఖద్వారాలు మూసుకునిపోయి సరస్సు ఎండిపోయే దుస్థితికి వచ్చింది.


డచ్‌, పోర్చుగీసు, బ్రిటిషు పాలనలో మత్స్యసంపదకు ఎంతో పేరెన్నిక గల ఈ సరస్సును స్థానిక పల్లెకారులు వాడుకభాషలో ‘పల్లైకట్టై’గా పిలుచుకునేవారు. మత్స్యకార్లను పల్లెకార్లు అని కూడా అంటారు. పులికాట్‌ సరస్సు చుట్టూ ఉన్న వారి ఆవాస ప్రాంతాల్ని ‘కుప్పాలు’ అని అంటారు. కాలక్రమేణా పులికాట్‌ సరస్సుగా విదేశీ పాలకులు నామకరణం చేసినట్లు రికార్డుల్లో నమోదయింది. ఈ సదస్సు మధ్యలో ఇరుక్కం, వేనాడు ఇత్యాది ద్వీపాలు చెప్పుకోదగ్గ పర్యాటక ప్రదేశాలు. వివి పాలెం సమీపాన రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కొన్ని సౌకర్యాలు కల్పించినా ప్రస్తుతం అవి మూతబడి ఉన్నాయి. మత్స్యకారుల యువతీయువకుల్ని ప్రోత్సహిస్తూ, ఈ సౌకర్యాల్ని పునః ప్రారంభిస్తే విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన వారమవుతాం.


సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలు నీటి వనరు కరువై ఎండిపోతున్న ఈ సరస్సు, గత సంవత్సరం సంభవించిన ‘నివర్‌’ తుఫాను పుణ్యమా అని నిండిపోయింది. రాష్ట్ర అటవీ శాఖ నివేదికల ప్రాతిపదికగా జూన్‌, జూలై మాసాల వరకు ఈ సరస్సులో నీటి నిల్వ ఉంటుందని అంచనా. పేరుకుపోయిన పూడికను దశాబ్దాలుగా తీయకపోవడంతో అటు తమిళనాడు ఇటు ఆంధ్ర ప్రాంత మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి చాలీచాలని మత్స్యసంపద కోసం తరచూ కొట్లాటలకు దిగటం ఈ ప్రాంతంలో నిత్యం కనిపించే దుష్పరిణామం. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూడిక తీయడంలో ఏమాత్రం జాప్యం జరిగినా సరస్సు ఆనవాళ్ళు కనుమరుగయ్యే ప్రమాదముంది.


అంతర్జాతీయంగా పేరెన్నికగన్న శ్రీహరికోట రాకెట్‌ లాంచింగ్ స్టేషన్‌ ఏర్పాటు పులికాట్‌ సరస్సు పూడిక పనుల్ని ఆటంకపరుస్తోందన్న స్థానికుల వాదనలో నిజం లేకపోలేదు. పూడిక తీస్తే షార్‌ పరిసర ప్రాంతాల్లో ఉప్పునీటి వ్యాప్తితో భూగర్భజలాలు ఉప్పుకొయ్య అవుతాయని శ్రీహరికోట అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు నేటి టెక్నాలజీ యుగంలో పరిష్కారం కనుక్కోవడం కష్టమైన పని కాదు. సరస్సు ముందా? షార్‌ ముందా? అన్న ధర్మసందేహానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత షార్‌ శాస్త్రజ్ఞులపై ఉంది. పులికాట్‌ సరస్సు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌–డిసెంబర్‌ మాసాల్లో వలసపక్షుల్ని వీక్షించడానికి ‘పెలికాన్‌ పక్షుల ఫెస్టివల్‌’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు నిర్వహించడం ఈ ప్రాంతానికి గర్వకారణం. గత సంవత్సర కాలంగా కరోనా వల్ల వీటిని నిర్వహించడం వీలుపడలేదు.


కొసమెరుపు: చెప్పటం సులువు.. చేయడం కష్టం అన్నది నానుడి. పాతికేళ్ల కిందటి మాట... నేను కాకినాడ పోర్టు (చిన్నరేవుల) డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజులవి. బకింగ్‌హామ్‌ కాలువ అంతర్భాగమైన కాకినాడ కాలువను ఏలూరు కాలువతో తాడేపల్లిగూడెం వద్ద గోదావరి జలాలతో కలిపే జలరవాణా మార్గం ప్రయోగాత్మకంగా పునరుద్ధరించాలని నిర్ణయించాను. పదవిరీత్యా లభ్యమైన అధికారాలు, నాతో పాటు పనిచేస్తున్న మెరైన్‌ ఇంజినీరు రామకృష్ణారెడ్డి కృషి, ధవళేశ్వరం ఇరిగేషన్‌ ఇంజినీర్ల సహకారంతో ఆరునెలలు దీక్షగా పనిచేస్తూ తుప్పుపట్టిన పాత స్లూయిస్‌లను, లాక్‌లను, కాలువకు అవసరమైన మరమ్మతులను చేయించి దానిని వాడుకలోకి తెచ్చాం. తాడేపల్లిగూడెం వద్ద ఉన్న గోయెంకా గ్రూపు కంపెనీ వారి సహకారంతో ఫుడ్‌-–ఫాట్స్‌–-ఫెర్టిలైజర్స్‌ను, కాకినాడ యాంకరేజ్‌ పోర్టు ద్వారా ఎగుమతి చేస్తున్న రైస్‌బ్రాన్‌ (తవుడు)ను కాకినాడ కెనాల్‌ ద్వారా ఫ్యాక్టరీ నుంచి ఓడలోకి చేరవేయడం ఎంతో తృప్తినిచ్చింది. ‘బోటు వెనుక బోటు’ కట్టి కాలువ మార్గంలో ఎగుమతి సరుకును రవాణా చేయడం కాకినాడ పోర్టు సాధించిన ఘనవిజయం. మనసు ఉండాలే గానీ మార్గం ఉంటుందని, ఏదీ అసాధ్యం కాదని ఆనాడు నిరూపించాం. ఆ ప్రయత్నాన్ని కొనసాగించక పోవడం ప్రభుత్వ తప్పిదమే అవుతుంది.

డా. దాసరి శ్రీనివాసులు

Advertisement