Abn logo
Aug 3 2020 @ 21:19PM

భర్తను చంపిన భార్య.. కావాలని చేయలేదని చెప్పడంతో..

కేధా: భర్తను హతమార్చిన బ్రిటిష్ మహిళ ఉరిశిక్ష నుంచి ఎట్టకేలకు బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలేషియాలో సమంతా జోన్స్(51) అనే మహిళ 2018 అక్టోబర్ 18వ తేదీన తన భర్తను కత్తితో పొడిచి హతమార్చింది. ఆ తరువాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టుకు వెళ్లింది. ఈ కేసుపై అప్పటి నుంచి తుది తీర్పు రాకపోవడంతో.. 20 నెలల నుంచి సమంతా జోన్స్ జైలుశిక్షను అనుభవిస్తోంది. సహజంగా హత్యకు సంబంధించిన కేసులో సమంతా జోన్స్‌కు ఉరిశిక్ష విధించాల్సి ఉంది. అయితే సమంతా జోన్స్ నేరాన్ని అంగీకరిస్తూనే.. తన భర్తను కావాలని హతమార్చలేదని కోర్టుకు చెప్పుకొచ్చింది. ఆమె తరపు లాయర్ కూడా కోర్టుకు ఇదే చెబుతూ వచ్చారు. తాను నేరం చేశానని.. అయితే అది అనుకోకుండా జరిగిన సంఘటన అని సమంతా జోన్స్ జడ్జికి వివరించింది. తన భర్త అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రోజు తామిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అనుకోకుండా తాను భర్తను హతమార్చాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త చాలా కాలం నుంచి తనను వేధిస్తూ వచ్చాడని.. తన భర్తను ఎన్నో థెరపీలకు కూడా పంపానని.. అయినప్పటికి ఎటువంటి లాభం లేకపోయిందని సమంత జోన్స్ కోర్టుకు చెప్పింది. తన భర్త ఎంతో కోపంతో తనపై దాడికి దిగేవాడని.. హత్య జరిగిన రోజు కూడా తనపై ఎంతో కోపంతో ఉన్నాడని వివరించింది. ఇక సమంతా జోన్స్ వాదనలను విన్న జడ్జి ఆమెకు ఉరిశిక్ష విధించడం లేదని.. 42 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చారు. పైగా ఆమె జైలులో మంచి ప్రవర్తనతో కలిగి ఉండటంతో.. ఆమె జైలుశిక్ష కూడా తగ్గనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే 20 నెలల నుంచి సమంతా జోన్స్ జైలులో ఉండగా.. వచ్చే ఏడాది చివరి నాటికి ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.

Advertisement
Advertisement
Advertisement